'జనక అయితే గనక' (ఆహా) మూవీ రివ్యూ!

Movie Name: Janaka Aithe Ganaka

Release Date: 2024-11-08
Cast: Suhas, Sangerthana, Vennela Kishore, Rajendra Prasad, Murali Sharma
Director: Sandeep Reddi Bandla
Producer: Harshith Reddy - Hansitha
Music: Vijay Bulganin
Banner: Dil Raju Productions
Rating: 2.75 out of 5
  • సుహాస్ హీరోగా రూపొందిన సినిమా 
  • కామెడీ .. ఎమోషన్స్ ప్రధానంగా సాగే కథ
  • సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు
  • సరదాగా సాగిపోయే కంటెంట్ 
  • తలచుకుని నవ్వేలా చేసే ఫైనల్ ట్విస్ట్

కథానాయకుడిగా సుహాస్ విభిన్నమైన .. విలక్షణమైన కథలను - పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందే 'జనక అయితే గనక'. దిల్ రాజు బ్యానర్లో నిర్మితమైన సినిమా ఇది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. నిన్నటి నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ప్రసాద్ (సుహాస్) ఓ మధ్యతరగతి యువకుడు. తల్లి .. తండ్రి .. నాయనమ్మ .. భార్య (సంగీర్తన) ఇదే అతని కుటుంబం. ఓ చిన్నపాటి సంస్థలో అతను జాబ్ చేస్తూ ఉంటాడు. అతని స్నేహితుడు కిశోర్ (వెన్నెల కిశోర్) ప్రాక్టీస్ లేని ఓ లాయర్. అతనికి ఇద్దరు పిల్లలు. వాళ్లు అడిగింది కొనివ్వలేక అతను నానా తంటాలు పడుతూ ఉంటాడు. అది చూసిన ప్రసాద్ లో, తాను ఎలాంటి పరిస్థితులలోను పిల్లలను కనకూడదనే భావన బలపడుతూ ఉంటుంది. 

మిడిల్ క్లాస్ జీవితం కారణంగా చిన్నప్పటి నుంచి ప్రసాద్ ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతూ పెరుగుతాడు. తగినంత డబ్బు లేకపోవడం వలన సరైన స్కూల్లో చదవలేదు .. సరైన కాలేజ్ లో చేరలేదు .. అందువల్లనే మంచి ఉద్యోగం రాలేదు అనే ఒక అసంతృప్తి అతనిని వెంటాడుతూ ఉంటుంది. దాంతో అందుకు కారకుడైన తన తండ్రిని తిట్టుకుంటూనే అతను ఎదుగుతాడు. తన మాదిరిగా తనని తన పిల్లలు తిట్టుకోకూడదని అనుకుంటాడు. 

మంచి లైఫ్ ఇవ్వలేనప్పుడు పిల్లలను కనకూడదు అనే అభిప్రాయంతో ప్రసాద్ ఉంటాడు.ఇంట్లో వాళ్లు ఎంతగా పోరినా అతను మాత్రం ఈ విషయంలో మెట్టు దిగడు. ప్రసాద్ మనసును అర్థం చేసుకుని, అతని భార్య సర్దుకుపోతుంటుంది. తన జాబ్ విషయంలో అసంతృప్తి వెంటాడుతున్న ప్రసాద్ కి మరో ప్రమాదం ఎదురవుతుంది. ఓ రోజున అతను ఇంటికి రాగానే, తాను నెల తప్పినట్టుగా భార్య చెబుతుంది. ఆ మాటకు ఒక్కసారిగా అతను ఉలిక్కి పడతాడు. తాను కుటుంబ నియంత్రణను కఠినంగా ఫాలో అవుతూ ఉండగా ఇది ఎలా సాధ్యమనే ఆలోచనలోపడతాడు.    

 తాను వాడుతున్న 'కండోమ్' ఫెయిలై పోవడం వల్లనే ఇలా జరిగిందనే ఉద్దేశంతో, ఆ సంస్థపై కేసు పెడతాడు. నష్ట పరిహారంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ కోర్టుకెక్కుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అతను తీసుకున్న ఆ నిర్ణయం ఎలాంటి సమస్యలను తెచ్చిపెడుతుంది? ఆ అవాంతరాలను అతను ఎలా అధిగమిస్తాడు? అనేది ఈ కథలో ప్రధానమైన అంశం.     

విశ్లేషణ: ఈ సినిమాకి సంబంధించి మనం ముందుగా మాట్లాడుకోవలసింది టైటిల్ గురించి. 'జనక అయితే గనక' అనే టైటిల్ లోనే కామెడీ ఉంది. 'తండ్రి అయినవాడికి ఆ కష్టాలు తెలుస్తాయి' అనే అర్థం కూడా ఈ టైటిల్లో ధ్వనిస్తుంది. నిజానికి ఇది మంచి కామెడీ టచ్ ఉన్నదే. అయితే సాధారణ ప్రేక్షకులకు ఈ మేజిక్ అర్ధమయ్యే అవకాశాలు తక్కువే అని చెప్పాలి. థియేటర్స్ దగ్గర జనం తగ్గడానికి ఇది ఒక కారణం అయ్యుండొచ్చు.

భార్యా భర్తలు .. వారికి సంబంధించిన ఇరు కుటుంబాలతో ఈ కథ మొదలవుతుంది. 50 నిమిషాల తరువాత నుంచి ఈ కథ కోర్టు రూమ్ లోకి అడుగుపెడుతుంది. అక్కడ నుంచి కథలో ఎక్కువ భాగం కోర్టు రూమ్ లోనే నడుస్తుంది. జడ్జిగా రాజేంద్రప్రసాద్ .. పేరున్న పెద్ద లాయర్ గా మురళీ శర్మ ఎంట్రీ ఇస్తారు. కోర్టులో వాదోపవాదాలు కామెడీ టచ్ తో సాగడం వలన, కాస్త సరదాగానే అనిపిస్తుంది. 

దర్శకుడు అసలు పాయింటును అలా నడిపిస్తూనే, మారుతున్న సమాజంలో మధ్య తరగతి కుటుంబాల ముందున్న సవాళ్లను ఆవిష్కరించిన తీరు ఆలోచింపజేస్తుంది. పిల్లల విషయంలో పేరెంట్స్ ఎమోషన్స్ ను ఎంతమంది ఎన్ని రకాలుగా క్యాష్ చేసుకుంటున్నారు? అనేది వివరించిన తీరు మెప్పిస్తుంది. భర్త గౌరవాన్ని నిలబెట్టడం భార్య బాధ్యత .. భార్య ఆత్మాభిమానాన్ని కాపాడటం భర్త ధర్మం అనే సున్నితమైన పాయింటును బలంగా చెప్పారు.

ఈ కథ .. 'కండోమ్' అనే ప్రధానమైన అంశం చుట్టూ తిరుగుతుంది. ఈ కథకు ప్లస్సూ .. మైనస్సూ ఇదే. కోర్టు రూమ్ డ్రామా అంతా కండోమ్ అనే అంశం చుట్టూనే తిరుగుతుంది. ఫ్యామిలీతో కాకుండా విడిగా థియేటర్స్ కి వెళ్లినవారు సరదాగా నవ్వుకుంటారు. కానీ ఫ్యామిలీతో  వెళ్లినవారు కాస్తంత ఇబ్బంది పడతారు. అలా అని చెప్పి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమీ ఉండవు. కానీ ప్రధానమైన కథాంశమే 'కండోమ్' కావడం వలన అలా అనిపిస్తుంది.

వెన్నెల కిశోర్ వైపు నుంచి .. హీరో నాయనమ్మ వైపు నుంచి ఈ కథ సరదాగా నడుస్తుంది. మొదటి నుంచి కథ ఏ అంశంపై నడుస్తూ వెళుతోందో, ఫైనల్ పంచ్ అదే అంశంపై ఇవ్వడంతో కథకి మరింత బలాన్ని చేకూర్చారు. చివరి ట్విస్టును తలచుకుని తలచుకుని నవ్వుకోకుండా ఉండలేరు. కథ మొత్తానికి కలిపి ఇచ్చిన ఈ ట్విస్ట్ .. ఈ సినిమాకి హైలైట్ అని చెప్పక తప్పదు. 

పనితీరు
: సుహాస్ నటన చాలా సహజంగా అనిపిస్తుంది. కొత్త హీరోయిన్ సంగీర్తన బాగుంది. ఆ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోయింది. 'పిల్లలు కడుపులో ఉండగానే కాదురా .. బయటికి వచ్చిన తరువాత కూడా తంతారు' అంటూ పిల్లల టార్చర్ అనుభవించే తండ్రి పాత్రలో వెన్నెల కిశోర్ నవ్విస్తాడు. ఇక రాజేంద్రప్రసాద్ .. మురళీ శర్మ ..  గోపరాజు రమణ కథకి మరింత సహజత్వాన్ని ఆపాదించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. 

--- దర్శకుడు సందీప్ రెడ్డి కథను మలచిన తీరు .. పాత్రలను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం .. సాయి శ్రీరామ్ ఫొటోగ్రఫీ .. కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ కంటెంట్ ను మరింత పట్టుగా తెరపైకి తీసుకుని వచ్చాయి. ఏ సమయంలో .. ఏ సందర్భంలో .. ఏ పాత్ర స్వభావం ఎలా ఉంటుందనే పూర్తి అవగాహనతో దర్శకుడు ఈ సినిమాను ప్రెజెంట్ చేశాడు. అందువల్లనే ఈ సినిమా కోర్టు రూమ్ డ్రామాలోను సరదాగా నవ్విస్తుంది .. ఎమోషన్స్ ను కనెక్ట్ చేస్తుంది. 

Trailer

More Movie Reviews