'మార్టిన్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Movie Name: Martin

Release Date: 2024-11-15
Cast: Dhruva Sarja, Vaibhavi Shandilya, Achyuth Kumar, Anveshi Jain
Director: A P Arjun
Producer: Shrinivas Timmapur - Suraj Uday Mehta
Music: Mani Sharma - Ravi Basrur
Banner: Vasavi Enterprises - Uday K Mehta Productions
Rating: 2.00 out of 5
  • కన్నడంలో రూపొందిన 'మార్టిన్'
  • ధృవ సర్జా డ్యూయెల్ రోల్ చేసిన సినిమా
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో పలకరించిన కంటెంట్  
  • ఈ నెల 15 నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్ 
  •  నిరాశపరిచే కథాకథనాలు

ధ్రువ సర్జా హీరోగా రూపొందిన సినిమానే 'మార్టిన్'. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 11న థియేటర్లకు వచ్చింది. వైభవి శాండిల్య కథానాయికగా నటించిన ఈ సినిమాకి, మణిశర్మ బాణీలు సమకూర్చగా, రవి బస్రూర్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. హీరో అర్జున్ కథను అందించిన ఈ సినిమా,  ఈ నెల 15వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: ఈ కథ పాకిస్థాన్ లో మొదలవుతుంది. గ్యాంగ్ స్టర్స్ పోరాటంలో గాయపడిన అర్జున్ (ధృవ సర్జా)   హాస్పిటల్లో కోలుకుంటాడు. న్యూ యార్క్ లోని అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఆదేశం మేరకు అతనికి ఒక రకమైన ఇంజక్షన్ ఇస్తారు. దాంతో తనకి సంబంధించిన అన్ని విషయాలను అర్జున్ మరిచిపోతాడు. తనకి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి అక్కడి నుంచి బయటపడతాడు. తనని గుర్తుపట్టి పలకరించిన ఒక వ్యక్తి ద్వారా, తన పేరు అర్జున్ అనీ .. తాను ఇండియా నుంచి వచ్చానని తెలుసుకుంటాడు. 

ఆ వ్యక్తి ద్వారా రెజీనా అనే యువతిని కలుసుకోవడానికి ఆమె ఇంటికి వెళతాడు. అయితే అప్పటికే రెజీనా హత్య చేయబడుతుంది. అయితే ఆమె ఇచ్చిన హింట్ ద్వారా, తనని వెంటాడుతున్నది మార్టిన్ ( ధృవ్ సర్జా) అనే విషయం అర్జున్ కి అర్థమవుతుంది. రెజీనా ఇచ్చిన ఒక ఫోన్ నెంబర్ కి అతను కాల్ చేస్తాడు. తాను మార్టిన్ ను పట్టుకోవడానికి పాకిస్థాన్ వచ్చాననే విషయం అర్జున్ కి అప్పుడు అర్థమవుతుంది.

అతి కష్టం మీద అర్జున్ అక్కడి నుంచి ఇండియా చేరుకుంటాడు. తనతో పాటు తన స్నేహితులైన పరశురామ్ - వివేక్ లను కాపాడుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలాగే తాను పెళ్లి చేసుకోనున్న ప్రీతి (వైభవీ శాండిల్య)ను కూడా రక్షించుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ నేపథ్యంలోనే అర్జున్ కి ముస్తాక్ నుంచి కూడా ప్రమాదం ఎదురవుతుంది. అప్పుడు అర్జున్ ఏం చేస్తాడు? మార్టిన్ ను ఎలా ఎదుర్కొంటాడు? ముస్తాక్ ఎవరు? అతనితో అర్జున్ కి ఉన్న గొడవేంటి? అనేది కథ.

విశ్లేషణ: ఇది ధృవ సర్జా ద్విపాత్రాభినయం చేసిన సినిమా. ఫస్టాఫ్ లో ఒక పాత్ర ఎంట్రీ ఇస్తే, సెకండాఫ్ లో మరో పాత్ర తోడవుతుంది. ఒక పాత్ర గ్యాంగ్ స్టర్ కి సంబంధించినది కాగా, మరో పాత్రలో నేవీ ఆఫీసర్ గా కనిపిస్తాడు. 12 వేల కోట్ల ఖరీదు చేసే అక్రమాయుధాలు కలిగిన కంటెయినర్స్ వీరిద్దరి మధ్య హీరోయిజాన్నీ .. విలనిజాన్ని పతాకస్థాయికి తీసుకుని వెళతాయి. 

ఈ కథ భారీ యాక్షన్ సీన్ తోనే మొదలవుతుంది. కథ మొదలైన కాసేపటి వరకూ ఒక గందరగోళ వాతావరణమే కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఆ తరువాత కథపై కొంత ఉత్కంఠ పెరుగుతుంది. కానీ కథ మళ్లీ ఫ్లాష్ బ్యాకులోకి వెళ్లి బయటికి వచ్చే సమయాల్లో సాధారణ ప్రేక్షకులు అయోమయానికి లోనవుతారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్లకి కొంత సమయం పడుతుంది. 

హీరో ఇంట్రడక్షన్ మొదలు చాలా సేపటివరకూ అతని ప్రవర్తన దెబ్బతిన్న సింహంలా .. మందు తిన్న మదపుటేనుగు ప్రవర్తనల ఉంటుంది. అతని గురించిన డైలాగులు కూడా అలాగే ఉంటాయి. ఆ విపరీత ధోరణి ప్రేక్షకులకు 'అతి'గా అనిపిస్తుంది .. అసహనాన్ని కలిగిస్తుంది. విలన్ సంగతి అటుంచితే, హీరో వైపు నుంచి కూడా ఎమోషన్స్ కనెక్ట్ కావు. అందువలన ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటే, ఏమీ తోచక కొట్టుకుంటున్నారనే మనకి అనిపిస్తూ ఉంటుంది.

అవసరానికి మించిన ఫైట్లు .. ఛేజింగులు .. కాల్పులు, చూసేవారిని చిరాకు పెడతాయి. ఇవన్నీ సరిపోవన్నట్టుగా పెద్ద పెద్ద అరుపులు .. కేకలు. చిన్న సన్న ఫైట్స్ పెడితే చాలదనుకున్నారేమో, యుద్ధ ట్యాంకర్లను .. హెలికాఫ్టర్లను కూడా రంగంలోకి దింపేశారు. ఇటు హీరో .. అటు విలన్ ఇద్దరూ ఒకే హీరో కావడం వలన, ఎంత కొట్టుకున్నా మనకి ఏమీ అనిపించదు. ఇలా అనుకుంటూ ఉండగానే మరో లుక్ తో .. మరో పాత్రతో అదే హీరో తెరపైకి వచ్చి, ఈ కథ అప్పుడే అయిపోలేదని హింట్ ఇస్తాడు.

పనితీరు: హీరో ధృవ్ సర్జాకి కన్నడలో మంచి క్రేజ్ ఉంది .. మాస్ ఫాలోయింగ్ ఉంది. తన క్రేజ్ కి తగినస్థాయి నిర్మాణం ఈ సినిమాలో కనిపించింది. కానీ కథ విషయంలో .. తన పాత్రల విషయంలో దృష్టిపెడితే బాగుండేదని అనిపిస్తుంది. లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. వీటన్నింటినీ వదిలేసి, ఒక్క యాక్షన్ పై ఆధారపడటమే మైనస్ అయిందని చెప్పక తప్పదు. 

హీరోగా .. విలన్ గా ఒకే హీరో చేసిన కొన్ని సినిమాలు మాత్రమే మంచి మార్కులు కొట్టేశాయి. కొట్టేవాడు .. తన్నులు తినేవాడు ఒకే హీరో అయినప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేయలేరు. ఈ కథ విషయంలో అది బయటపడుతుంది. ఇక హీరో - విలన్ చుట్టూ చెప్పుకోదగిన బలమైన పాత్రలను డిజైన్ చేయకపోవడం మరో లోపంగా అనిపిస్తుంది.

కథ ఇచ్చింది యాక్షన్ కింగ్ అర్జున్ అయినప్పటికీ, చెప్పడంలో క్లారిటీ లోపించింది. మణిశర్మ అందించిన బాణీలు .. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. సత్య హెగ్డే ఫొటోగ్రఫీ ఫరవాలేదు. ప్రకాశ్ ఎడిటింగ్ విషయానికి వస్తే, యాక్షన్ సన్నివేశాల నిడివిని తగ్గిస్తే బాగుండునని అనిపిస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాల చుట్టూ బలమైన కథను అల్లుకోకపోవడమే ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగించే విషయమని చెప్పచ్చు. 

Trailer

More Movie Reviews