'జీబ్రా' - మూవీ రివ్యూ!

Movie Name: Zebra

Release Date: 2024-11-22
Cast: Satya Dev, Daali Dhananjaya, Sathyaraj, Priya Bhavani Shankar, Jennifer Piccinato, Sunil
Director: Eashvar Karthic
Producer: SN Reddy - S Padmaja
Music: Ravi Basrur
Banner: Padmaja Films - Old Town Pictures
Rating: 2.25 out of 5
  • బ్యాంకింగ్‌ నేపథ్యంలో సాగే 'జీబ్రా'
  • సూర్య పాత్రలో మెప్పించిన సత్యదేవ్‌ 
  • ఆకట్టుకోని కథ, కథనాలు
  • సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కాని కంటెంట్  

కంటెంట్‌ ఉంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. గత రెండు వారాల క్రితం విడుదలైన 'క' చిత్రం ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది. ఈ వారం కూడా దాదాపు అరడజనుకుపైగా చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి వచ్చాయి. అందులో ఒకటి 'జీబ్రా'. హీరోగా మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్న సత్యదేవ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం, ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది? ఎంతవరకు ఆడియన్స్‌ ఆదరించే అవకాశం ఉంది?. సత్యదేవ్‌ కెరీర్‌కు 'జీబ్రా' ఎంతవరకు ప్లస్‌ అవుతుంది? అనేది తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లవలసిందే. 

కథ: సూర్య (సత్యదేవ్‌) ఓ బ్యాంక్‌లో ఎంప్లాయ్‌గా పనిచేస్తుంటాడు. తను ప్రాణంగా ప్రేమించే అమ్మకోసం, ఐదేళ్లుగా ప్రేమిస్తున్న సహద్యోగి స్వాతి (ప్రియా భవాని) కోసం సొంతంగా ఓ ఫ్లాట్‌ కొనుక్కోని జీవితాన్ని హాయిగా గడపాలని ప్లాన్‌ చేసుకుంటాడు. అయితే ఒక రోజు స్వాతి బ్యాంక్‌లో ఓ కస్టమర్‌ విషయంలో చేసిన పొరపాటు వల్ల, ఒకరి అకౌంట్‌లో పడాల్సిన డబ్బు మరొకరి అకౌంట్‌లో పడుతుంది. ఈ సమస్యను ఛేదించడానికి సూర్య బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ఉన్న లూప్‌హోల్స్‌ను అడ్డం పెట్టుకుని.. తన తెలివితేటలతో ఆ రోజే అసలు కస్టమర్‌కు డబ్బులు అందజేస్తాడు. అయితే దీని వల్ల సూర్య చిక్కుల్లో పడతాడు. 

సూర్య పేరుతో ఉన్న బ్యాంక్‌ ఖాతాలో 5 కోట్లు జమ అవుతాయి. ఆ తరువాత ఆ అకౌంట్‌ కార్యకలపాలు నిలిచిపోతాయి. ఆ ఐదు కోట్ల రూపాయాలు తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని సూర్య లైఫ్‌లోకి గ్యాంగ్‌స్టర్‌ ఆది ( డాలీ ధనుంజయ) ప్రవేశిస్తాడు. ఇక ఇక్కడి నుంచే కథలో విచిత్రమైన మలుపులు ఉంటాయి. అసలు ఆది ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? సూర్యకు అతనికి ఉన్న సంబంధమేమిటి? సూర్య ఐదు కోట్లు తిరిగిస్తాడా? ఆ తరువాత జరిగిందేమిటి? అనేది వెండితెరపై చూడాల్సిందే. 

విశ్లేషణ: బ్యాంకింగ్‌ సెక్టార్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. నేటి బ్యాంకింగ్‌ వ్యవస్థల్లోని కొద్దిపాటి లోపాలను ఆధారంగా ఎలాంటి ఆర్థిక నేరాలు జరుగుతాయనే చూపించడానికి ప్రయత్నించారు. అయితే దీనికి గ్యాంగ్‌స్టర్‌ కథను కూడా మిక్స్‌ చేశాడు దర్శకుడు. ఇప్పటికీ చాలామందికి బ్యాంకింగ్‌ వ్యవస్థలోని ప్రాసెస్‌ తెలియదు. రెగ్యులర్‌ బ్యాంక్‌ లావాదేవీలు చేసే వాళ్లకు మాత్రమే అర్థమయ్యే విషయాలను దర్శకుడు టచ్ చేశాడు. 

 ఇలాంటి కథను ఎంతో క్లారిటీతో చెప్పాలి.. కానీ సినిమాలో ఆ విషయాన్ని దర్శకుడు పూర్తిగా విస్మరించాడు. చాలా కన్‌ఫ్యూజన్‌గా కథను చెప్పాడు. కొన్ని సన్నివేశాలు కేవలం బ్యాంక్‌ ఎంప్లాయిస్‌కి మాత్రమే అర్థమయ్యేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇదే బ్యాంకింగ్‌ వ్యవస్థపై రూపొందిన 'లక్కీ భాస్కర్‌' చిత్రంలో ఉన్న క్లారిటీ ఈ చిత్రంలో పూర్తిగా లోపించింది. ఈ సినిమాలో సన్నివేశాలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. సాధారణంగానే సగటు మనిషికి బ్యాంకింగ్‌ కార్యకలపాలనేవి ఓ పజిల్‌గా అనిపిస్తాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్‌ కూడా ఓ పజిల్‌ ఛేదిస్తున్నట్లుగానే ఫీల్‌ అవుతాడు. 

ఈ కథకు గ్యాంగ్‌స్టర్‌ కథను ముడిపెట్టిన విధానం కూడా అంతగా పండలేదు. తొలిభాగం స్లోగా, అనవసరమైన సన్నివేశాలతో నింపిన దర్శకుడు, సెకండాఫ్‌లో కథనాన్ని కాస్త పరుగులు పెట్టించాలని ప్రయత్నించినా, పాత్రలు బలంగా లేకపోవడంతో అది కూడా విఫలమైంది. ఇలాంటి కథను అనుకున్నప్పుడు దర్శకుడు రచన విషయంలో ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. బ్యాంకింగ్‌ వ్యవస్థకు సంబంధించిన సన్నివేశాలను ప్రేక్షకులకు సులభతరంగా ఎలా కన్వీన్స్‌ చేయాలో కసరత్తులు చేయాలి. కానీ డైరెక్టర్‌ అటుగా ఆలోచించలేదని అనిపిస్తుంది. సత్య వైపు నుంచి అక్కడక్కడా చోటు చేసుకున్న కాసింత వినోదం మాత్రమే రిలీఫ్‌గా అనిపిస్తుంది. 

పనితీరు
: సూర్య పాత్రలో సత్యదేవ్‌ మెప్పించాడు. అయితే నటుడిగా ఛాలెంజింగ్‌గా ఫీలయ్యే సన్నివేశాలు మాత్రం ఈ చిత్రంలో ఏమీ లేవు. ఆదిగా డాలీ ధనుంజయ పాత్ర ఆకట్టుకోలేదు. కాకపోతే అతనికి కూడా నటనకు పెద్దగా స్కోప్‌ లేని పాత్ర ఇది. సూర్య, ప్రియురాలిగా ప్రియా భవానీ తన పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. సునీల్‌ పాత్ర కూడా ఎంతో గమ్మత్తుగా ఉంది. అయితే సరైన సన్నివేశాలు లేపోవడం వల్ల ఆ పాత్ర కూడా తేలిపోయింది. 

దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ కథగా అనుకున్న పాయింట్‌లో కాస్త కొత్తదనం ఉన్నా, ఆ కథకు సరైన రచన, స్క్రీన్‌ప్లే లేకపోవడం వల్ల సినిమా బౌన్స్ అయిన చెక్‌లా మిగిలిపోయింది. కథలో లోపాల వల్ల ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం పెద్దగా ఉపయోగ పడలేదు. ఫైనల్‌గా 'జీబ్రా' చూడాలంటే బ్యాంకింగ్‌ రంగం పట్ల అవగాహనతో పాటు కాసింత ఓపిక కూడా ఉండాలనిపిస్తుంది.   

Trailer

More Movie Reviews