రాయలసీమలో తొలిసారిగా కిడ్నీ శ్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్
* ఒకరి తల్లి కిడ్నీ మరొకరికి అమరిక
* ఆయన భార్య కిడ్నీ ఈ తల్లి కుమారుడికి
* 12 గంటల పాటు ఒకేసారి నాలుగు శస్త్రచికిత్సలు
* కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యుల సరికొత్త రికార్డు
కర్నూలు, March 08, 2024: రాయలసీమలోనే తొలిసారిగా కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీల శ్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. సాధారణంగా కిడ్నీ మార్పిడి చేయాలంటే లైవ్, కెడావర్ డొనేషన్ అనే రెండు పద్ధతులు ఉంటాయి. ఈ రెండింటిలోనూ అదే గ్రూపు రక్తం ఉన్నవారి నుంచే తీసుకుంటారు. లైవ్ డొనేషన్‌లో అయితే సమీప బంధువులది మాత్రమే తీసుకుంటారు. కానీ, సమీప బంధువుల్లో అదే గ్రూపు వారు లేనప్పుడు అరుదైన సందర్భాల్లో ఇలా శ్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. అందుకు పలు రకాల అనుమతులు కూడా అవసరం అవుతాయి. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటివరకు ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. తొలిసారిగా జరిగిన ఈ శ్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ అనంతరావు వివరించారు.
“ఎ పాజిటివ్ గ్రూపు రక్తం ఉన్న దైవ ప్రసాద్ కర్నూలులో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయనకు ఏడాది క్రితం కిడ్నీ విఫలమైంది. కానీ, ఆయన భార్యకు బి పాజిటివ్ రక్తం ఉండటంతో ఆమె నుంచి కిడ్నీ తీసుకోవడం కుదరలేదు. దాంతో ఆయనకు శ్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి చెప్పాం. రెండో రోగి వెంకట కొండయ్య. ఆయన గ్రూపు బి పాజిటివ్. ఆయనకు ఆరు నెలల క్రితం డయాలసిస్ మొదలైంది. తొలుత ఆయన భార్య కిడ్నీ ఇస్తానని చెప్పినా, తర్వాత ఆమె కిడ్నీ దానానికి అనర్హురాలని తేలింది. తర్వాత ఎ పాజిటివ్ గ్రూపు రక్తం ఉన్న ఆయన తల్లి ముందుకొచ్చారు. అప్పుడు ఈ ఇద్దరి మధ్య శ్వాప్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని భావించి ఇద్దరితోనూ చర్చించగా, ఇద్దరూ సరేనన్నారు. ముందుగా కిమ్స్ ఆస్పత్రిలో ఆథరైజేషన్ కమిటీ సమావేశం నిర్వహించాం. తర్వాత రాష్ట్రస్థాయి కమిటీకి అనుమతి కోసం పంపాం. దైవప్రసాద్ భార్య వెంకట కొండయ్యకు కిడ్నీ ఇవ్వడానికి, వెంకట కొండయ్య తల్లి దైవప్రసాద్‌కు ఇవ్వడానికి అనుమతులు వచ్చాయి.
సమీప బంధువులలో కంటే, శ్వాప్ ట్రాన్స్‌ప్లాంట్ కొంచెం కష్టం. ఎందుకంటే ఒకేసారి నాలుగు శస్త్రచికిత్సలు చేయాలి. ఎక్కువ ఆపరేషన్ థియేటర్లు, ఎక్కువ మంది సర్జన్లు, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్‌లో తగినన్ని పడకలు ఉండాలి. దీనికితోడు నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యులు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, ఎనస్థీషియన్లు, ఓటీ సిబ్బంది, కేటీయూ సిబ్బంది మధ్య తగిన సమన్వయం, సహకారం ఉండాలి. కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో ఈ సదుపాయాలన్నీ ఉన్నాయి. దాదాపు 20 మంది వైద్య సిబ్బంది మొత్తం సమన్వయంతో 12 గంటల పాటు శస్త్రచికిత్సలు చేశారు. ఇద్దరు రోగులకూ కిడ్నీ మార్పిడి విజయవంతంగా జరిగింది. ఇద్దరు రోగులు, వారి కిడ్నీ దాతలు మరో ఇద్దరిని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జి చేశాం. శస్త్రచికిత్సలలో పాల్గొన్నవారిలో నెఫ్రాలజిస్టులు డాక్టర్ అనంతరావు, డాక్టర్ సురేష్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు డాక్టర్ సీహెచ్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ దుర్గాప్రసాద్, ఎనస్థీషియన్లు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ అఖ్తర్, డాక్టర్ స్వాతి ఉన్నారు. ఇలా శ్వాప్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం కర్నూలులోనే కాక.. రాయలసీమ ప్రాంతం మొత్తంలోనే ఇదే మొదటిసారి. రాయలసీమలో కిడ్నీల వైఫల్యంతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉంటే శ్వాప్, ఏబీఓ ఇన్‌కంపాటబుల్ లేదా కెడావర్ ట్రాన్స్‌ప్లాంట్ల కోసం కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ అనంతరావు (9000819193)ను సంప్రదించవచ్చు. ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలో 35 మందికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా అన్నీ విజయవంతం అయ్యాయి” అని వివరించారు.
అవయవ దాతలు ముందుకు రావాలి
మన దేశంలో సుమారు 1.80 లక్షల మంది కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో 30% మంది అవి దొరక్క ప్రతియేటా మరణిస్తున్నారు. ఏడాదికి కేవలం 6వేల మార్పిడి శస్త్రచికిత్సలే జరుగుతున్నాయి. మరణానంతరం అవయవదానం చేసినవారి నుంచి తీసుకునే అవకాశం ఉన్నా, అందుకు మూడు నుంచి నాలుగేళ్లు వేచి ఉండాల్సి వస్తోంది. అందువల్ల దాతల సంఖ్యను మరింత పెంచాలన్నా, చికిత్స ఖర్చు తగ్గాలన్నా మన దేశంలో చట్టప్రకారం అనుమతి ఉన్న శ్వాప్ ట్రాన్స్‌ప్లాంట్లను ఎంచుకోవచ్చు. ఇది ఒకే ఆస్పత్రిలో, లేదా ఒకే నగరంలో రెండు ఆస్పత్రుల మధ్య, లేదా రెండు నగరాలు, రెండు రాష్ట్రాల మధ్య కూడా చేయొచ్చు. ఏబీఓ ఇన్‌కంపాటబుల్ లేదా కెడావర్ ట్రాన్స్‌ప్లాంట్ల కంటే శ్వాప్ ట్రాన్స్‌ప్లాంట్‌లో ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.