ఎన్నారై కేసుల సత్వర పరిష్కారానికై మరింత పకడ్బందీగా వ్యవహరించనున్న మహిళా భద్రత విభాగం ఎన్నారై సెల్!
ప్రవాస భారతీయుల (ఎన్నారై ) మోసాలను అరికట్టేందుకై తెలంగాణ పోలీసుశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్నారై మహిళా భద్రతా విభాగం మరింత పకడ్బందీగా వ్యవహరించనుంది. రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలో ఎన్నారై పెళ్లిళ్లు, విదేశాలలో మహిళలపై గృహ హింస, వరకట్న వేధింపులు తదితర కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. దీనితో ఈ కేసుల పరిష్కారంలో సరైన మార్గదర్శకం లేకపోవడం, విదేశాల చట్టాలపై అవగాహన లోపం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలలో సమన్వయం చేయాల్సిరావడంతో ఈ కేసుల పరిష్కారంలో అంతగా పురోగతి లేకపోవడం, ఈ కేసుల పరిష్కారంపై బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. దీంతో, ఎన్నారై కేసులపై సత్వరం చర్యలు చేపట్టి ప్రాసిక్యూషన్ చేయడం ద్వారా వీటీని అరికట్టవచ్చని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ఎన్నారై ఉమెన్ సెఫిటీ విభాగాన్ని 2019 జూలై 17న ప్రారంబించింది.
ఈ ఎన్నారై విభాగం ప్రారంభంతో ప్రవాస కేసులలో కదలిక ఏర్పడి చార్జ్షీట్ల దాఖలు, లుక్ అవుట్ నోటీసుల జారీ, పాస్ పోర్ట్ ల సీజ్, నిందితులకు శిక్ష పడడం వేగవంతంగా జరుగుతున్నాయి.
తెలంగాణలో 574 ఎన్నారై కేసుల నమోదు, ఎన్నారై సెల్ లో 73 కేసులు:
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 574 కేసులు ఎన్నారై వరుళ్లపైనా, వారి బంధువుల పైన రాష్ట్ర వ్యాప్తంగా 17 మహిళా పోలీస్ స్టేషన్లలోనూ, ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. వీటిలో రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 17 మహిళా పోలీస్ స్టేషన్లలోనే 417 కేసులు రిజిస్టరయ్యాయి. గత సంవత్సరం జూలై 17న ఏర్పాటైన ప్రత్యేక ఎన్నారై సెల్ కు 73 పిటీషన్ లు వచ్చాయి. వివాహ, గృహ హింస, ఇతర వేధింపులపై ఎన్నారై నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ వచ్చిన ఈ పిటీషన్లలో 70 వాటిపై కేసులను రిజిస్టర్ చేశారు.
ఈ 70 కేసులలో 29 కేసులు దార్యాప్తు దశలో ఉండగా, 41 కేసులు పెండింగ్ ట్రయల్స్ లో వున్నాయి. 46 మందికి లుక్ అవుట్ నోటీసులను జారీ, మరో 32 మందికి నాన్ బెయిలబుల్ వారంటీలు జారీ చేయడం, ఐదుగురికి ఎల్.ఓ.సి అమలయ్యాయి. ఆరుగురి పాస్ పోర్ట్ లను స్వాధీన పర్చుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 546 కేసులకు సంబంధించి 577 మంది ఎన్నారై పెళ్లికొడుకులు, వారి దగ్గరి ఎన్నారై బంధువులపై లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. రాష్ట్రంలో అత్యధికంగా సిటీ మహిళా సీసీఎస్ లో 137 కేసులు, 78 కేసులతో సరూర్ నగర్ మహిళా పీ.ఎస్ ద్వితీయ స్థానం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదైన 574 ఎన్నారై కేసులలో అత్యధికంగా హైదరాబాద్ సిటీలోని సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్ లో 137 కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలోని సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో 78 కేసులు నమోదై ద్వితీయ స్థానంలో వుంది. సౌత్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ లో 65, బేగంపేట్ మహిళా స్టేషన్ లో 34, భువనగిరి మహిళా స్టేషన్ లో ఒకటి, గచ్చిబౌలి మహిళా స్టేషన్ లో 8, వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని సుబేదారి, వరంగల్ అర్బన్ మహిళా స్టేషన్ లలో 42, ఖమ్మంలో ఏడు, మహబూబ్ నగర్ లో ఆరు, ఆదిలాబాద్ లో 11, కరీంనగర్ మహిళా స్టేషన్ లో 21, నల్గొండ స్టేషన్ లో ఏడు నమోదయ్యాయి.
కేసుల పరిష్కారంలో ఎన్నారై సెల్ మార్గదర్శకం:
ప్రవాస భారతీయుల కేసులకు సంబంధించి ప్రధానంగా ఎన్నారై పెళ్లిళ్లకు సంబంధించి దర్యాప్తు అధికారులకు(ఐ.ఓ) సహాయపడేలా నెట్ వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగల్ ఆక్టివిస్ట్ (నీల), ఇతర స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలను కల్పిస్తోంది. ముఖ్యంగా వరకట్న వేధింపులు, ఎన్నారై వివాహాల మోసాలు,బంధువుల వేధింపుల విషయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు సహాయ పడేలా ఈ సెల్ తోడ్పడుతుంది. ఈ కేసులలో దర్యాప్తు చేసే విధానంపై ఎస్.హెచ్.ఓ లకు శిక్షణ అందిస్తోంది. ఈఎన్నారై సెల్ ఎప్పటికప్పుడు లుక్అవుట్ నోటీసులు, నాన్ బెయిలబుల్ కేసులు, ఛార్జ్ షీట్ ల దాఖలు, దర్యాప్తు వేగవంతంపై నిరంతరం విచారణాధికారులతో పర్యవేక్షిస్తోంది. వివిధ దేశాల ఎంబసీలు, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమీషన్, ఎన్నారై వివాహాలపై పనిచేసే స్వచ్చంద సంస్థల కాంటాక్ట్ నెంబర్లను బాధితులకు అందచేస్తుంది.
ఎన్నారై సెల్ సాధించిన విజయాలు:
ఎన్నారై సెల్ ప్రారంభించిన ఆరు నెలల్లోనే ఐదు కేసులకు సంబంధించి లుక్ అవుట్ నోటీసులు అమలు చేయడంతో పాటు ఆరు కేసులకు సంబంధించి పాస్ పోర్ట్ లను ఇంపౌండ్ చేసింది. ఈ సెల్ ప్రధానంగా జాతీయ మహిళా కమీషన్, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి, కాన్సిలేట్ జనరల్, ఎంబసీలు, తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ సెల్, జీఏడీల సహాయం, సమన్వయముతో కేసుల సత్వర విచారణను చెపట్టేందుకై సాంకేతిక సహకారాన్ని విచారణాధికారులకు అందచేస్తోంది.