సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం భద్రాచలంలోని ITDA హాల్ నందు జరిగిన సీతారామ ప్రాజెక్ట్ పనులు, భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్య ప్రాణి అనుమతులు, పంప్ హౌజ్ లు, కెనాల్స్, ఇతర పనుల పురోగతిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు 4,832 ఎకరాలు భూమిని సేకరించినట్లు అధికారులు వివరించారు. ఇంకా 1951 ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకొని అటవీ భూముల సేకరణ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. 6 లక్షల 74 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి ఇంకా వేగంగా జరగాలని అన్నారు.

సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగుతుందని, 3,28,853 ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం లభిస్తుందన్ని తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం అవుతుందన్నారు. ప్యాకేజీల వారీగా సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను మంత్రి సమీక్షించారు. మొత్తం 8 ప్యాకేజీలలో ప్రస్తుతం వివిధ ప్యాకేజీలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మోటార్లు, సివిల్, మెకానికల్ విభాగాలకు చెందిన పెండింగ్ లో ఉన్న డిజైన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గత పర్యటనలో మీరు ఇచ్చిన లక్ష్యంను పూర్తి చేయలేకపోయారని సున్నితంగా మందలించారు. ఇక సమయం వృధా చేయడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అతి త్వరలో పర్యటన చేయనున్నారని ఈలోగా అసంపూర్తి పనులు పూర్తి చేయాల్సిందే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేసేందుకు రూపొందించిన సీతారామ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఖమ్మం జిల్లా సశ్య శ్యామలం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.

సీతారామ ప్రాజెక్టు వలన ఖమ్మం జిల్లాకు అందే ప్రయోజనాలు రైతులు అనుభవించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని మెరక ప్రాంతాలైన తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్‌, ముదిగొండ మండలంలకు కూడా సాగునీటి సౌలభ్యము లభిస్తుందని తెలిపారు. జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టులైన వైరా, లంకాసాగర్‌, పాలేరు, బయ్యారం ప్రాజక్టుల కింద 46,187 ఎకరాలు, పాలేరు ప్రాజక్టు ద్వారా నాగార్జున సాగర్‌ ప్రాజక్టు ఆయకట్టు 2,37,573 ఎకరాలు స్థిరీకరించబడతాయన్నారు.

చిన్ననీటి చెరువుల కింద 1,35,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు సాగునీటి సౌలభ్యము లభిస్తుందని అన్నారు. ఈ సమీక్షలో ఎంపీ మలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి IAS, ITDA PO గౌతమ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈ వెంకటకృష్ణ, ఈఈ లు బాబు రావు, సురేష్ కుమార్, డిఈ శ్రీనివాస్ రెడ్డి, HV రామదాసు, తహసీల్దార్ వీరభద్ర నాయక్, డిప్యూటీ తహసీల్దార్ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.


More Press News