25వ జాతీయ అటవీ క్రీడల్లో తెలంగాణకు 16 పథకాలు
జాతీయ అటవీ క్రీడోత్సవాల్లో విజేతలను అభినందించిన పీసీసీఎఫ్
ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ తో జరిగిన 25వ జాతీయ స్థాయి అటవీ క్రీడల్లో తెలంగాణ ప్రతినిధులు మంచి ప్రతిభ కనపరచారు. మొత్తం 16 మెడల్స్ గెలుచుకున్నారు. మరో ఆరు ఈవెంట్లలో నాలుగో స్థానంలో నిలిచారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్న ఈ క్రీడల్లో తెలంగాణ మొత్తం మీద పదిహేనో స్థానాన్ని సాధించింది. పథకాలు గెలుచుకున్న అటవీ అధికారులు, సిబ్బంది అరణ్య భవన్ లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభను కలిశారు.
పథకాలు పొందిన క్రీడాకారులను అటవీ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. తెలంగాణ రాష్ట్రం తరపున మొత్తం 285 మంది క్రీడాకారులు, 95 ఈవెంట్లలో పాల్గొన్నారు. ఒక స్వర్ణం, 9 రజితం, 6 కాంస్య పథకాలకు తోడు మరో ఆరు ఈవెంట్లలో నాలుగో స్థానంలో నిలిచారు. క్యారమ్స్, డిస్కస్ త్రో, గోల్ఫ్, రన్నింగ్, షాట్ పుట్ తదితర క్రీడల్లో తెలంగాణ అటవీ సిబ్బంది మెడల్స్ సాధించారు.
వృత్తి జీవితంలో ఒత్తిడిని జయించేందుకు, అటవీ ఉద్యోగులకు అవసరమైన ఫిట్ నెస్ ను సాధించేందుకు క్రీడలే మంచి మార్గమని పీసీసీఎఫ్ శోభ అన్నారు. తమకు ప్రవేశం ఉన్న క్రీడలను వదలిపెట్టకుండా, ప్రాక్టీస్ కొనసాగించాలని ఉద్యోగులకు సూచించారు. తెలంగాణ అటవీ శాఖలో కొత్తగా రెండు వేలకు పైగా నియామకాలు జరిగినందున, రానున్న అన్ని అటవీ క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచేందుకు అవకాశముందని అన్నారు. జాతీయ క్రీడల్లో చత్తీస్ ఘడ్ మొదటి స్థానాన్ని, కర్ణాటక రెండు, మధ్యప్రదేశ్ మూడు స్థానాలను సాధించాయి.
కార్యక్రమంలో అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఎం.సీ.పర్గెయిన్, ఆర్.ఎం. డోబ్రియల్, సిద్దానంద్కుక్రేటీ, ప్రత్యేక అధికారి తిరుపతయ్య పాల్గొన్నారు.