ఒకటి లేదా రెండు రోజుల్లో రేషన్ సరుకులు ఇచ్చేందుకు చర్యలు: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
వికారి నామ సంవత్సరం మిగిల్చిన కరోనా వికారాలకు వీడ్కోలు పలికి... సీఎం కేసీఆర్ చూపిన లాక్ డౌన్ ఉక్కు సంకల్పంతో ఇండ్లకే పరిమితమై కొత్త ఏడాది శార్వరి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎర్రబెల్లి వ్యాఖ్యలు:ఉగాది పండుగ తెలుగు ప్రజలకు ఆరంభ పండుగ, పర్వదినం. అయినప్పటికీ, పరిస్థితుల ప్రభావం కారణంగా వచ్చిన కరోనా వైరస్ కారణంగా... ఇంటికే పరిమితమై పండుగను చేసుకోవాలని కోరుతున్నాను
కరోనా మహమ్మారి మన దరి చేరకుండా స్వయం నిర్బంధం పాటించి లాక్ డౌన్ ను విజయవంతం చేద్దాం
ఇంట్లో ఉన్న సరుకులతోనే పండుగను జరుపుకుందాం. ఎవరు కూడా బయటకు రావద్దు. సరుకుల కోసం ఎవరు కూడా ఆందోళన పడవద్దు
ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున, కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికీ రేషన్ బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 ఇవ్వనున్నది
అందరికీ నిత్యావసర సరుకులు, కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది
మనం చేయాల్సిందల్లా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడమే. సామాజిక దూరం పాటిస్తూ గడపడమే
సామాజిక దూరాన్ని పాటిస్తూ, పరిశుభ్రతని విడనాడకుండా, ఇంట్లో చేసే పూజల సందర్భంగా కరోనా వైరస్ ని ఖతం చేసే శక్తిని మనకివ్వమని మన ఇష్ట దైవాలను ప్రార్థిద్దాం
ఇటలీ ప్రజల నిర్లక్ష్య వైఖరిని చూస్తున్న అనుభవంతో సిఎం కెసిఆర్ చెప్పినట్లుగా సామాజిక బాధ్యతతో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, స్వయం నిర్బంధాన్ని, స్వీయ నియంత్రణతో కరోనాని ఎదుర్కొందాం
మనల్ని మనమే కాదు... మన చుట్టుముట్టున్న ప్రపంచాన్ని రక్షించే బాధ్యతని మనం తీసుకుందాం