కేంద్ర మంత్రితో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ బీఆర్కేఆర్ భవన్ నుండి మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
రాష్ట్రం, దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై టాక్స్ ఎత్తివేయాలని మంత్రి ఈటల కోరారు. అదేవిధంగా విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వైద్య పరికరాలపై కస్టమ్స్, టాక్స్ రద్దు చేయాలని కూడా కోరారు. వెంటిలేటర్ లు, ఇతర వైద్య పరికరాలు ECIL, DRDO లాంటి సంస్థల్లో తయారు చేసి రాష్ట్రాలకు అందజేయాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.
N-95 మాస్కులు, PPE కిట్స్, టెస్టింగ్ కిట్స్ సాధ్యమైనంత త్వరగా తెలంగాణకి అందజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. వైద్య పరికరాలు, కరోనా నియంత్రణ కోసం వినియోగిస్తున్న వాటిని బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని, వాటిని కేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ట్రాలకు అందించాలని మంత్రి ఈటల కోరారు. ఇప్పటి వరకు తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు అని, రాష్ట్రంలో 8500 మందికి పరీక్షలు చేస్తే 471 మందికి పాజిటివ్ అని తేలిందని, వారందరికీ చికిత్స అందిస్తున్నామని, 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా, 12 మంది చనిపోయినట్లు తెలిపారు. లాక్ డౌన్ పొడిగించే అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించారు.