ప్రతి ఇంట్లో జ్వర పరీక్షలు నిర్వహించాలి: మంత్రి ఈటల ఆదేశం

  • పాజిటివ్ కేసులు ముందుగా గుర్తించాలి
  • సిబ్బంది రక్షణ ముఖ్యం.. ఏం కాదులే అనే భావన వద్దు
  • విజయలక్ష్మి అనే ఆశ వర్కర్తో మాట్లాడి అభినందించిన మంత్రి
  • కరోనా తో పాటు ఇతర వైద్య సేవలు, సీజనల్ వ్యాదులమీద దృష్టి పెట్టండి
  • వైద్య సిబ్బందితో విడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
  • జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ANM, ASHA వర్కర్స్ తో విడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మంత్రి
మొన్నటి వరకు లాక్ డౌన్ వల్ల ఎక్కడివారు అక్కడే ఉన్నారు. కానీ ఇపుడు కొన్ని సడలింపుల నేపద్యంలో గ్రామాల్లోకి వలస కార్మికులు, ఇతర వ్యక్తులు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి జ్వర పరీక్షలు చేయాలని ఆదేశించారు. ILI (influenza like illness- జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి), SARI (severe Acute respiratory illness- ఊపిరితిత్తుల్లో న్యుమోనియా) ఈ రెండు లక్షణాలు తప్పనిసరిగా పరీక్షలు చేయాలి అని మంత్రి కోరారు.

పలువురు ఆశా వర్కర్లు, ANM లతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, HCQ టాబ్లెట్స్ వేసుకోవాలని కోరారు. రవాణా సదుపాయాలు లేని చోట్ల మెడికల్ ఆఫీసర్స్ కి వాహనాలు ఏర్పాట్లు చేయాలని సమావేశంలోనే అధికారులను మంత్రి  ఆదేశించారు. కోవిడ్ యుద్దంలో మొదటి వరుసలో పనిచేస్తున్న తొమ్మిదివేల మంది ఆరోగ్య కార్యకర్తల భద్రత తమ మొదటి ప్రాధాన్యత అని మంత్రి అన్నారు. వారికి కావాల్సిన ప్రతి సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా అడ్డుకట్ట వేయడానికి పని చేసిన వైద్య సిబ్బందికి సమాజంలో ఎప్పుడూ  లేనంత గొప్ప గౌరవం దక్కింది అని మంత్రి అన్నారు.

సానిటీజేషన్ వర్కర్ నుండి మంత్రి వరకు అందరూ కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యం అయ్యింది అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలానికి చెందిన విజయలక్ష్మి అనే ఆశ వర్కర్ తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారు చేస్తున్న సేవలకు, ధైర్యానికి మంత్రి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటివ్, సౌకర్యాల పట్ల సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని తప్పని సరిగా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉంచాలని లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయాలని మంత్రి ఆదేశించారు. పరీక్షలు చేసే విషయంలో ICMR మార్గ నిర్దేశకాల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఇంట్లో స్థలం లేనివారికి గ్రామంలో ఉండే కమ్యూనిటి హాల్ లేదా స్కూల్ లో ఉంచాలని కోరారు. ప్రతి ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో కోవిడ్ ఓపి, నాన్ కోవిడ్ ఓపి అని వేర్వేరుగా పరీక్షలు చేయాలని సూచించారు.మన రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కేవలం రెండు శాతం మంది మాత్రమే చనిపోతున్నారు. 98 శాతం మందిని ఆరోగ్యంగా ఇంటికి పంపించగలుగుతున్నాము. ఇది దేశంలోనే అత్యధిక శాతం అని మంత్రి అన్నారు. ధైర్యంగా పని చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.

కరోనాతో పాటుగా ఇతర వైద్య సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కోరారు. సాధ్యమైనన్ని ఎక్కువ డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూడాలని కోరారు. IMR తగ్గించడం పట్ల అభినందనలు తెలిపారు. వంద శాతం ఇమ్యునైజేషన్ జరిగేలా చూడాలని కోరారు. మన పని తనానకి నిధర్శనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి పెరగడమేనని అన్నారు. డాక్టర్ ఉదయం 9 గంటల నుండి  సాయంత్రం 4 గంటలవరకు అందుబాటులో ఉంటే ప్రజలు వస్తారని అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యమే ఆధారం కాబట్టి వారికి అందుబాటులో ఉండాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాదులు, మలేరియా జ్వరాలపట్ల జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో పని చేస్తున్న డాక్టర్లను సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రతి ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్స్ వేసి పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు.
సచివాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ యోగీతా రాణా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, TSMIDC ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.

More Press News