క్రమ శిక్షణతో లాక్ డౌన్ ని పాటించాలి: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
- నిరుపేదలను ఆదుకుందాం
- సామాజిక, భౌతిక దూరంతో కరోనాని కట్టడి చేద్దాం
- స్వీయ నియంత్రణకు మించిన మందు లేదు
- సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిద్దాం
- మన సంస్కృతీ సంప్రదాయాలను అనుసరిద్దాం
- అమ్మా పురంలో మహారాష్ట్ర వలస కూలీలను పరామర్శించిన మంత్రి
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, జమస్థాన్ పూర్ తదితర గ్రామాల్లో దాతల సహకారంతో అందించిన నిత్యావసర సరుకులను నిరుపేదలకు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
శుక్రవారం మంత్రి మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని తొర్రూరు లో, తొర్రూరు మండలం జమస్థాన్ పూర్ లో పలువురు దాతల సహకారంతో అందిస్తున్న నిత్యావసర సరుకులను నిరుపేదలకు పంపిణీ చేశారు. అలాగే అమ్మాపురం గ్రామంలో మహరాష్ట్రకు చెందిన వలస కూలీలను పరామర్శించారు. వారిని కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కరోనాని ఎదుర్కోవడంలో ప్రపంచంలోని దేశాలకంటే, మన దేశంలోని రాష్ట్రాలకంటే కూడా ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు సీఎం కేసీఆర్ తీసుకున్నారన్నారు. కేసీఆర్ నిర్ణయాల వల్లే ప్రస్తుతం మిగతా వాళ్ళకంటే కూడా ఎంతో మెరుగ్గా, ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు. లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ కూడా కట్టడిలోనే ఉందన్నారు. అయితే, ప్రజలు మరింత కట్టుదిట్టంగా కరోనా కట్టడికి ప్రయత్నించాలని, లాక్ డౌన్ ని కఠినంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సామాజిక దూరం, భౌతిక దూరాన్ని మించిన మందులేదన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ, సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా నడుచుకోవడం వల్ల మనం మరింత ఆరోగ్యంగా, ఆనందంగా జీవించలగమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే కరోనా కట్టడి అయ్యే వరకు నిరుపేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని చెప్పారు. పేదలను ఆదుకుంటున్న దాతలను మంత్రి అభినందించారు.
తొర్రూరులో...:
*తొర్రూరు మండలం జమస్తాన్ పూర్ లో డాక్టర్ రాజేందర్ రెడ్డి, కాకిరాల హరి ప్రసాద్ ల ఆధ్వర్యంలో అందించిన నిత్యావసర సరుకులను నిరుపేదలకు మంత్రి పంపిణీ చేశారు. అలాగే జిల్లా పరిషత్ పాఠశాలలో పోలీసు, రెవిన్యూ శాఖల ఆధ్వర్యంలో వెయ్యి మంది నిరుపేదలకు, లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్మైల్ ఫౌండేషన్ ద్వారా, సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో డాక్టర్ స్వరూప్, గౌరీ శంకర్ ఆధ్వర్యంలో రోగులకు, నిరుపేదలకు వెయ్యి ఆహారా పొట్లాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, పోలీసులు, రెవిన్యూ ఉద్యోగులు, దాతలు తదితరులు పాల్గొన్నారు.
అమ్మాపురంలో వలస కూలీలకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ:
తొర్రూరు కార్యక్రమాలకు వస్తున్న సందర్భంగా అమ్మాపురంలో మంత్రి ఎర్రబెల్లికి వలస కూలీలు కనిపించారు. వెంటనే మంత్రి అక్కడ ఆగి, వారి వివరాలు తెలుసుకున్నారు. వారు మహారాష్ట్ర నుంచి వచ్చారని, వారికి తగిన ఏర్పాట్లు చేయాలని అక్కడే ఉన్న పోలీసు అధికారులను ఆదేశించారు.