ఉదారతను చాటుకున్న మంత్రి ఎర్రబెల్లి
- తన రైతు బంధు డబ్బులను సిఎంఆర్ ఎఫ్ కిచ్చిన మంత్రి
- సిఎం కెసిఆర్ కి అందచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే చాలు ఆయన చేతికి ఎముకలేదంటారు. దయన్నా అని పిలిస్తే చాలు... నేనున్నానని ముందుకు వస్తారు. అలాంటి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తన ఉదారతని చాటుకున్నారు. తనకు వ్యవసాయ క్షేత్రానికి వచ్చే రైతు బంధు డబ్బులు రూ.లక్షా 45వేల రూపాయలను నేరుగా సీఎం కెసిఆర్ ని కలిసి అంద చేశారు. ఆ నిధిని కరోనా కష్ట కాలంలో పేదల కోసం వాడాల్సిందిగా కోరారు. ఇందుకు మంంత్రి ఎర్రబెల్లిని సిఎం కెసిఆర్ అభినందించారు. అనునిత్యం ప్రజల కోసం పరితపించే అసలు సిసలైన నేతగా నిలిచావంటూ కొనియాడారు. ఇందుకు సీఎంకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
వెంకటేశ్వర గ్రానైట్స్ ఉదారత:
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రపంచ సమస్యగా మారిందన్నారు. కరోనా బాధితులు అందరినీ ఆదుకోవడం ఆరోగ్యంగా ఉన్న మిగతా అందరి బాధ్యతగా మారాలన్నారు. ఇందులో భాగంగా అనేక మంది సిఎంఆర్ ఎఫ్ కి, తనకు, ఇతర అనేక విధాలుగా నేరుగా ప్రజలకు, బాధితులకు అండగా నిలిచి ఆదుకుంటున్నారని, తమలోని మానవతని చాటుకుంటున్నారని చెప్పారు. ఇదే తరహాలో వెంకటేశ్వర గ్రానైట్స్ అధినేత వెంకటేశ్వరరావు తన వంతుగా ఒక అంబులెన్స్ వాహనాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. ఆ వాహనాన్ని కరోనా బాధితులకు అవసరమైన రీతిలో వినియోగిస్తామన్నారు.
దాతలు ఇంకా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వెంకటేశ్వర గ్రానైట్స్ వెంకటేశ్వరరావుని మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు నేరుగా తాను ఒక అంబులెన్స్ ఇచ్చామన్నారు. అందుకు వసరమైన నిధిని చెక్కు రూపంలో మంత్రికి అందచేశామన్నారు. డబ్బులు సంపాదించడమొక్కటే కాదని, సంపాదనలో కొంత భాగాన్ని ఆపన్నులను ఆదుకోవడానికి ఉపయోగించాలన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రి ఎర్రబెల్లికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.