అమీన్ పూర్ సంఘటనపై అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి సత్యవతి రాథోడ్

  • ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ చేస్తున్నాం
  • మారుతి శిశు సంరక్షణ కేంద్రం అనుమతి రద్దు చేసి, సంస్థను మూసివేశాం
  • సంరక్షణ కేంద్రంలోని పిల్లలను ప్రభుత్వ హోమ్ కు తరలించాం
  • ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించాం
  • ఏసీపి స్థాయి ప్రత్యేక పోలీసు అధికారిని నియమించి ఈ కేసు విచారణ చేయిస్తున్నాం
(హైదరాబాద్, ఆగస్టు 18): ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, బాలలపై దాడుల జరిగితే ఎట్టి పరిస్థితుల్లో వారిని ఉపేక్షించేది లేదని, తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ లోని మారుతి బాలల సంరక్షణ కేంద్రంలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో అమ్మాయి మరణించింది తెలిసిందే. బాలిక మృతికి కారణమైన మారుతి బాలల సంరక్షణ కేంద్రం అనుమతులు వెంటనే రద్దు చేసి, కేంద్రాన్ని మూసి వేయించామని, ఈ ఘటనకు కారణమైన ముగ్గురిని ప్రధాన నిందితులుగా గుర్తించి వారిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశామన్నారు. ఈ కేసును క్షుణ్ణంగా విచారించేందుకు ఏసీపి స్థాయికి తగ్గకుండా ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర డీజీపీని కోరడంతో ఆయన ప్రత్యేక అధికారిని నియమించి, విచారణ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీసు విచారణతో పాటు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు, బాలల సంక్షేమ కమిటీలోని ఇద్దరు సభ్యులు, ఉమెన్ సెఫ్టీ వింగ్ డిఎస్పీ, రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శితో ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు గురించి ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు ఇస్తూ సహకరించడానికి నిపుణులైన న్యాయ సలహాదారుడిని నియమించామన్నారు.

మారుతి బాలల సంరక్షణ కేంద్రాన్ని మూసివేయడంతో అక్కడున్న 47 మంది బాలికలను ప్రభుత్వ హోమ్ కు తరలించి, వారి సంపూర్ణ సంరక్షణ చేపట్టామని, కావల్సిన వసతులు కల్పిస్తున్నామన్నారు.

అమీన్ పూర్ సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ బాలల సంరక్షణ కేంద్రాల్లో విధిగా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. అదే విధంగా బాలలకు ఇబ్బందులు వస్తే వెంటనే ఫిర్యాదు చేసే విధంగా ప్రతి కేంద్రంలో 1098 నెంబర్ ను ప్రదర్శించాలని, మహిళా – శిశు సంక్షేమ శాఖ రూపొందించిన బాలల హక్కుల రక్షణ పోస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో 429 బాలల సంరక్షణ కేంద్రాలున్నాయని, వీటిల్లో 13,054 మంది సంరక్షణ పొందుతున్నారని, ప్రస్తుతం కోవిడ్ -19 నేపథ్యంలో బాలలను వారి సంరక్షకులు, కుటుంబాల వద్దకు పంపించామని, అమీన్ పూర్ ఘటన తర్వాత ఇండ్లలకు వెళ్లిన ప్రతి బాలుడు, బాలిక స్థితిగతులు కనుకొని నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని, ఇంటి వద్ద బాలలకు ఇబ్బందులు ఉంటే వెంటనే ప్రభుత్వ హోమ్స్ కు తరలించాలని సూచించినట్లు తెలిపారు. ఈ బాలల సంరక్షణను నిరంతరం పర్యవేక్షించే విధంగా రాష్ట్రంలో 33 జిల్లాల బాలల హక్కుల కమిటీలకు బాధ్యతలు అప్పజెప్పినట్లు వివరించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మహిళలు, శిశువుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, వారిని ఇబ్బంది పెట్టే ఎలాంటి చర్యను సహించేది లేదని, అందుకు బాధ్యులయ్యే వారెవరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. భవిష్యత్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన ప్రణాళికను రూపొందించి ఈ రాష్ట్రంలో బాలల హక్కలను సంపూర్ణంగా పరిరక్షిస్తామన్నారు.

More Press News