కొప్పినీడి మురళీకృష్ణ కుటుంబానికి పవన్ ఓదార్పు.. రూ.2.50 ల‌క్షల ఆర్ధిక సాయం!

  • బాధ‌తో క‌న్నీరు పెట్టుకున్న ప‌వ‌న్‌ కల్యాణ్
  • ముర‌ళీకృష్ణ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని హామీ.. రూ.2.50 ల‌క్షల ఆర్ధిక సాయం

క్యాన్స‌ర్ వ్యాధితో మృతి చెందిన జ‌న‌సేన పార్టీ ముఖ్య‌ కార్య‌క‌ర్త కొప్పినీడి ముర‌ళీకృష్ణ కుటుంబాన్ని పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్‌ కల్యాణ్ ప‌రామ‌ర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేరులోని ముర‌ళీకృష్ణ ఇంటికి వెళ్లి, అత‌ని భార్య‌, తల్లి, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ముందుగా ముర‌ళీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం ముర‌ళీకృష్ణ ఎలా మృతి చెందాడు అనే విష‌యంపై ఆరా తీశారు. అత‌ని త‌ల్లి ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు.

జ‌న‌సేన గెలుపు కోసం ముర‌ళీకృష్ణ చేసిన కృషిని స్థానిక నాయ‌కుల‌ను అడిగి తెలుసుకున్నారు. మీరు గెలిచిన నాడు మా అబ్బాయి ఆత్మ‌ శాంతిస్తుందంటూ అత‌ని త‌ల్లి, భార్య అన‌డంతో, ప‌వ‌న్‌ క‌న్నీరు పెట్టుకున్నారు. మీ కొడుకు స్థానంలో నేను మీకు అండ‌గా ఉంటాన‌ని అత‌ని త‌ల్లికి భ‌రోసా ఇచ్చారు. ముర‌ళీకృష్ణ పిల్ల‌ల చ‌దువుల‌, భ‌విష్య‌త్ జ‌న‌సేన పార్టీ చూసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. త‌న వ్య‌క్తిగ‌త ట్ర‌స్ట్ నుంచి రూ. 2.50 ల‌క్ష‌ల ఆర్ధిక సాయాన్ని చెక్ రూపంలో అత‌ని భార్య‌ ఊహా జ్యోతికి ప‌వ‌న్‌ అందించారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ. “కొప్పినీడి ముర‌ళీకృష్ణ పార్టీ ముఖ్య‌కార్య‌క‌ర్త‌. చాలా మందిలాగా తాను హైలెట్ అవ్వాల‌ని చూడ‌కుండా, వెనుక‌నుండే పార్టీ గెలుపు కోసం విప‌రీతంగా క‌ష్ట‌ప‌డ్డారు. ఇలా నిబ‌ద్ద‌త‌గా పార్టీ కోసం ప‌ని చేసే కార్య‌క‌ర్త‌లు చ‌నిపోవ‌డం బాధ క‌లిగిస్తోంది. విష‌యం మా అన్న‌య్య నాగబాబు నా దృష్టికి తీసుకువ‌చ్చిన‌ప్పుడు, అలాంటి కార్య‌క‌ర్త మృతి చెందాడ‌న్న వార్త న‌న్ను క‌దిలించింది. అత‌ను ఏదైతే ఆశ‌యం కోసం క‌ష్ట‌ప‌డి ప్రాణాలు కోల్పోయాడో అదే ఆశ‌య సాధ‌న కోసం ప‌ని చేస్తాను.

డ‌బ్బుతో ప్రాణాల‌కు వెల‌క‌ట్ట‌లేం కానీ, వారి కుటుంబానికి నా వంతు సాయం చేయ‌డం జ‌రిగింది. స్థానిక నాయ‌కులు ర‌మేష్ పార్టీ త‌ర‌ఫున మ‌రో ల‌క్ష రూపాయిల ఆర్ధిక సాయాన్ని అందిస్తారు. అత‌ని బిడ్డ‌ల భ‌విష్య‌త్ జ‌న‌సేన పార్టీ చూసుకుంటుంది” అని తెలిపారు. పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా ప‌వ‌న్‌ తో పాటు ముర‌ళీకృష్ణ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వారిలో ఉన్నారు.

•చిన‌బాబు ఇంటికి వెళ్లిన ప‌వ‌న్‌ కల్యాణ్:

అంత‌కు ముందు జ‌న‌సేన పార్టీ భీమ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ కొటిక‌ల‌పూడి గోవింద‌రావు(చిన‌బాబు) ఇంటికి ప‌వ‌న్‌ మ‌ర్యాద‌పూర్వ‌కంగా వెళ్లారు. తుందుర్రులోని చిన‌బాబు ఇంటిని సంద‌ర్శించి, ఆయన కుటుంబ స‌భ్యుల‌తో కొంత స‌మ‌యం గ‌డిపారు. పేరు పేరునా అంద‌రి వివ‌రాలు అడిగి తెలుసుకుని వారితో ముచ్చ‌టించారు.

More Press News