కరోనా ని ధైర్యంగా ఎదుర్కొందాం: మంత్రి ఎర్రబెల్లి భరోసా
- ప్రభుత్వ వైద్యశాలల్లో అద్భుతమైన వైద్య సేవలు
- అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక అంబులెన్స్ వాహనాలు
- కరోనా బాధితుల ఇండ్లకు ఐసోలేషన్ కిట్లు
- స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించండి
- హాస్పిటల్స్ , హోం క్వారంటైన్ లలో ఉన్న కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఆధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్ నుంచి పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు,ప్రజా ప్రతినిధులు,అధికారులతో మంత్రి శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు,జెడ్పీటీసీలు,ఆర్డీవోలు,ఎమ్మార్వో లు,సీఐ లు,ఎస్సైలు, డీఎం& హెచ్ఓ,డాక్టర్లను టెలీకాన్ఫరెన్సులోకి తీసుకుని మంత్రి వారితో మాట్లాడారు.కాగా, వారిలో అనేక మంది మంత్రి తోనూ మాట్లాడారు. వారి యోగ క్షేమాలను, అందుతున్న వైద్యాన్ని, తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి ఎర్రబెల్లితో పంచుకున్నారు.
ఒకవైపు కరోనా బాధితుల స్థితిగతులను తెలుసుకుంటూనే,మరోవైపు ప్రజాప్రతినిధులకు కరోనా బాధితులను ఆదుకోవాలని హితబోధ చేస్తూ, బాధితులకు భరోసాని, ధైర్యాన్నినింపుతూ మంత్రి మాట్లాడారు. కరోనా విస్తృతి పెరిగి, తీవ్రత తగ్గిందన్నారు. సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ల ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ సఫలమయ్యాయన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడంతోపాటు, తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు.
ఇక కరోనా వచ్చిన వారు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వం సాయంగా ఉందని, ఎంజిఎం సహా, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలతోపాటు తగు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. నేను కూడా నిరంతరం అందుబాటులో ఉన్నాను. నా సిబ్బంది కూడా మీకు సాయం చేయడానికి నిరంతరం సిద్ధంగా ఉన్నారు అని మంత్రి తెలిపారు. మీరంతా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రోగ నిరోధక శక్తి పెరిగే విధంగా ఆహారం తీసుకోవాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్సలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.