తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను 6.5 నుంచి 10 శాతానికి పెంచాలి: మంత్రి సత్యవతి రాథోడ్

  • జీవో 3ని అమలు చేసేవిధంగా కేంద్రం నుంచి మద్దతు ఇవ్వండి
  • గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలి
  • తెలంగాణకు మరిన్ని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వండి
  • మిని గురుకులాల రెన్యువల్ చేసి, కొత్తవి మంజూరు చేయండి
  • మిని గురుకులాలను ఎన్జీవోలకు ఇవ్వడం కంటే ప్రభుత్వంతోనే నడిపించడం మంచిది
  • సిఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం
  • రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు చేసే కార్యక్రమాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని విజ్ణప్తి
  • కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర గిరిజన, స్త్రీ –శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్
(హైదరాబాద్, సెప్టెంబర్ 3): గిరిజన పరిశోధన సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇతర పరిశోధనల సంస్థల ఆధ్వర్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఈ నెల 3,4 తేదీల్లో(నేడు, రేపు) నిర్వహిస్తున్న నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ కాంక్లేవ్ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ నేడు హైదరాబాద్ దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ నుంచి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, సంయుక్త సంచాలకులు కళ్యాణ్ రెడ్డి, సమజువాలా, రాష్ట్ర గిరిజన పరిశోధన సంస్థ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సత్యవతి రాథోడ్ మాటలు:
 
అందరికీ నమస్కారాలు..
  • కోవిడ్ సమయంలో ఈ సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు
  • కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మేము పూర్తిగా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్తున్నాం
  • ఏ పథకాలు అమలు చేస్తే ప్రజలకు బాగా చేరుతాయి, ఆ పథకాలు ఏ విధంగా నడిపించాలో మంచి సలహాలు ఇచ్చారు.
  • కోవిడ్ సమయంలో కూడా మీరు రెండు, మూడు సార్లు ఫోన్ చేసి ఇక్కడి గిరిజన ప్రజలు ఏ విధంగా ఉన్నారని అడిగి, గైడ్ చేసినందుకు ధన్యవాదాలు. 
  • రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ గిరిజన జనాభా 9.08 శాతం ఉన్నారు, కానీ 6.5 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు జరుగుతోంది.  దీనివల్ల చాలా మంది గిరిజన విద్యార్థులు,యువత విద్యలో, ఉద్యోగాల్లో నష్టపోతున్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం ఆలోచించి వీలైనంత త్వరలో ఈ రిజర్వేషన్లను పెంచాలని కోరుతున్నాను. 
  • గిరిజన ప్రాంతాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాలను స్థానికులతోనే భర్తి చేయాలని 20 ఏళ్ల క్రితం ఇచ్చిన జీవో 3ని సుప్రీం కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ లో కొట్టి వేసింది. వెంటనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో న్యాయ సలహా తీసుకుని జీవో నెంబర్ 3పై రిప్యూ పిటిషన్ వేశాము. దీనిని తిరిగి అమలు చేసే విధంగా కేంద్ర నుంచి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. 
  • గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అవన్నీ చేసింది. యుజీసీ నిబంధనలన్నీ పాటించింది. 350 ఎకరాల భూమి కేటాయించింది. మౌలిక వసతులు కల్పించాము. కానీ విశ్వవిద్యాలయం ప్రారంభించేందుకు మీ దగ్గరి నుంచి అనుమతి రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయం ప్రారంభం అయింది. తెలంగాణలో కాలేదు. దీనివల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి వీలైనంత త్వరలో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభిస్తే ఇక్కడి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని నా విజ్ణప్తి. 
  • తెలంగాణలో 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్) ఇచ్చారు. ఇక్కడ చాలా ప్రాంతాల్లో వందశాతం, 50శాతం ప్రజలున్న ఆవాసాలున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వంతరపునుంచి ఇచ్చిన విజ్ణప్తులను పరిగణనలోకి తీసుకుని వెంటనే మరిన్ని ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఇవ్వాలని కోరుతున్నాను. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చాము. వాటిని తొందరగా మంజూరు చేయాలని వినతి. 
  • తెలంగాణకు 29 మినిగురుకులాలు ఇచ్చారు. వీటిల్లో 5వేల మంది గిరిజన బాలికలు చదువుతున్నారు. ఈసంవత్సరం వాటికి రెన్యువల్స్ ఇవ్వలేదు. దీనివల్ల ఈ పేద గిరిజన విద్యార్థినిలు ఇబ్బందులు  పడే అవకాశం ఉంది. ఇప్పుడున్న మిని గురుకులాలు రెన్యువల్ చేసి, మరికొన్ని కూడా కొత్తవి ఇవ్వాలని కోరుతున్నాము. దీనివల్ల విద్యలో వెనుకబడిన గిరిజనులకు ప్రయోజనం కలుగుతుంది.
  • ఎవరైనా ఎన్జీవోలు ముందుకు వస్తే వారికి మినిగురుకులాలు ఇస్తామని మీరొక డైరెక్టన్ ఇచ్చారు. అయితే ఎన్జీవోలకంటే తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల సొసైటీ సమర్థవంతమైంది. సొసైటీలో అత్యంత నిపుణులైన ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. అన్ని విధాల మౌలిక వసతులు కల్పించాము. కాబట్టి మినీ గురుకులాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించే అవకాశం ఇవ్వండి. 
  • గిరిజన బడ్జెట్ ఇంకా కొంత పెండింగ్ లో ఉంది.  తొందరగా అది  ఇవ్వాలని కోరుతున్నాము. 
  • ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాల్లో 2020 ఉత్తీర్ణత చూస్తే ఇతర ఏ విద్యాలయాలలో లేని విధంగా ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. అందుకే మరిన్ని ఈఎంఆర్ఎస్ లు, గురుకులాలు, మినీ గురుకులాలు ఇవ్వాలని విజ్ణప్తి.
  • తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు కేంద్రం ఇస్తున్న మద్దతును రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తోంది. గిరిజనుల జీవన విధానం మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా పరిశోధన చేసి, వివిధ పథకాలు అమలు చేస్తోంది. అత్యంత పేద వర్గాలకు మేలు చేసేందుకు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. వీటికి కూడా మీ మద్దతు ఇస్తే మారుమూల ప్రాంతాల్లో ఉన్న అత్యంత పేద గిరిజనులకు మేలు జరుగుతుంది. 
  • ఈ వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలిపేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని నేరుగా కలిసి రాష్ట్ర ప్రభుత్వ విజ్ణప్తులను అందిస్తాము.

More Press News