జీవాల పెంపకందారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి తలసాని

హైదరాబాద్: రాష్ట్రంలోని జీవాల పెంపకం దారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాదిపరిశ్రమ శాఖల ఉన్నతాదికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, డెయిరీ MD శ్రీనివాస్ రావు, TSLDA CEO మంజువాణిలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల ప్రమాదాలతో జీవాలు మరణించిన సందర్బాలలో పెంపకందారులు ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జీవాల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు అర్హులైన వారికి ఇప్పటికే గొర్రెలు, పాడి గేదెలు సబ్సిడీ పై అందజేయడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం అందజేసిన జీవాలకు ప్రభుత్వం ఇన్సురెన్స్ ప్రీమియాన్ని చెల్లిస్తుందని, దీని ద్వారా జీవాలు మరణిస్తే ఇన్సురెన్స్  క్లైయిమ్ క్రింద జీవానికి బదులు జీవాన్ని కొనుగోలు చేసి లబ్దిదారుడికి అందిస్తున్నట్లు చెప్పారు.

అదే విధంగా రైతుల వద్ద ఉన్న గొర్రెలు, పాడి గేదెలకు (ప్రభుత్వం అందజేసిన జీవాలు కాకుండా) రోడ్డు ప్రమాదాలు, పిడుగుపాటు వంటి పలు ప్రమాదాల భారిన పడి చనిపోయిన సమయాలలో రైతులు ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్నారని, అలాంటి సంఘటనల నుండి రైతులను ఆదుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. ఇందుకోసం (ప్రభుత్వం 80 శాతం, రైతులు 20 శాతం  వాటా ) ప్రీమియంతో ఇన్సురెన్స్ వర్తింపచేసేలా చర్యలను చేపట్టినట్లు తెలిపారు. అక్టోబర్ 15 వ తేదీ నుండి ఆయా జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయాలలో రైతులు దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం తీసుకునే ఈ చర్యలు జీవాలు మరణించిన సమయాలలో రైతులకు అండగా ఉండి ఆదుకుంటుందని వివరించారు. రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షాకాలంలో జీవాలు సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ ఆసుపత్రులకు అవసరమైన పరికరాల కోసం 37 లక్షల రూపాయలను, జీవాలకు అవసరమైన మందులను కొనుగోలు కోసం 3 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు. మందులు, వైద్య పరికరాలను ఆసుపత్రులకు సరఫరా చేయడం జరిగిందని చెప్పారు. జీవాలకు అవసరమైన అన్ని వేళలా మందులు ఆసుపత్రులలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

రైతుల నుండి అత్యధికంగా డిమాండ్ ఉన్న మందుల సమాచారం సేకరించి వాటిని కూడా అందుబాటులో ఉంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. గొర్రెలు, మేకల లో పారుదు రోగం నివారణకు చేపట్టిన  వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఒక్క జీవాన్ని కూడా వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గొర్రెలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కోసం 6 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆవులలో లంపీ స్కిన్, గొర్రెలు, మేకలలో నీలి నాలుక, కుంటుడు వ్యాధుల భారిన పడకుండా, వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలని తాను జిల్లాల పర్యటన చేసిన సమయంలో రైతుల నుండి మందుల కొరత ఉందని పిర్యాదులు అందుతున్నాయని, అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని పేర్కొన్నారు.

జీవాల వద్దకే వైద్యసేవలు తీసుకెళ్ళాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 100 సంచార పశువైద్యశాలలను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. సంచార పశువైద్య శాలల సేవలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్నారు. రైతులు తమ తమ సొంత భూములలో పశుగ్రాసం పెంపకాన్ని చేపట్టే విధంగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. అంతేకాకుండా పశుసంవర్ధక, డైరీ, మత్స్య శాఖల కు చెందిన ఖాళీ స్థలాలలో పశుగ్రాసం పెంపకం చేపట్టాలని నెల రోజుల క్రితం ఆదేశించడం జరిగిందని, ఎంత మేరకు చేపట్టారో జిల్లాల నుండి నివేదిక తెప్పించాలని ఆదేశించారు. ఇప్పటికే 3.21 కోట్ల రూపాయల తో ప్రభుత్వం గడ్డి విత్తనాలను కొనుగోలు చేసి రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.

జీవాలకు అందుతున్న వైద్య సేవలు, పశుగ్రాసం పెంపకం తదితర అంశాలపై ఈ నెల 23 వ తేదీన అన్ని జిల్లాల పశువైద్యాదికారులు, డెయిరీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.  రాష్ట్ర పశువైద్య మండలి (వెటర్నరీ కౌన్సిల్)ను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ కార్యక్రమాల క్రింద మంజూరైన నిధులు, విడుదల కావాల్సిన నిధుల సమగ్ర సమాచారాన్ని 15 రోజులలో సమర్పించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా వినియోగించడం ద్వారా రాష్ట్రంలోని రైతులకు మేలు జరిగేలా చూడాలని మంత్రి చెప్పారు.

ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు, పాడి గేదెలలో మరణించిన జీవాలు ఎన్ని, ఎన్ని జీవాలకు క్లెయిమ్ వచ్చింది, ఇంకా ఎన్ని క్లెయిమ్ కావాల్సి ఉందో జిల్లా పశువైద్యాదికారుల నుండి సమగ్ర నివేదికను తెప్పించి అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్లెయిమ్ నిధులతో వెంటనే జీవాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్న కారణంగా చెరువులు, రిజర్వాయర్ లకు వరద నీరు పోట్టేతు తుందని అన్నారు. ఇలాంటి సమయంలో చేప పిల్లలను విడుదల చేయడం వలన వరద నీటిలో కొట్టుకపోయి మత్స్యకారులు నష్టపోయే అవకాశం ఉందని, అందుకోసం 4 రోజుల పాటు చేపల పిల్లల సరఫరాని నిలిపివేయాలని, వరదలు తగ్గిన అనంతరం తిరిగి చేప పిల్లల సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, హైవే ల వెంట ఏర్పాటు చేసే ఔట్ లెట్స్ కు అదనంగా ప్రతి జిల్లా లో 5 నుండి 6 విజయ ఔట్ లెట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డైరీ MD శ్రీనివాస్ రావును ఆదేశించారు. రానున్న 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఔట్ లెట్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. 

More Press News