రాష్ట్రంలో ప్ర‌తి గ్రామం దేశానికి ఆద‌ర్శం కావాలి: మంత్రి ఎర్ర‌బెల్లి

  • రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేయాలి
  • మ‌రిన్ని అవార్డులు వ‌చ్చేలా స‌ర్పంచ్ లు, కార్య‌ద‌ర్శులు ప‌ని చేయాలి
  • ప్ర‌తి రోజూ పారిశుద్ధ్యాన్ని నిర్వ‌హించాలి-సానిటేష‌న్ యాప్ ని ఉప‌యోగించాలి
  • క‌రోనా విజృంభన నేప‌థ్యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి
  • ప‌ల్లె ప్ర‌గ‌తిపై వీడియో కాన్ఫ‌రెన్సులో స‌ర్పంచ్ లు, అధికారుల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఉద్బోధ‌
హైద‌రాబాద్, ఏప్రిల్ 8ః ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త‌-పారిశుద్ధ్యం ఒక జీవ‌న విధానం కావాలి. గ్రామాల్లో నిత్యం పారిశుద్ధ్యం కొన‌సాగాలి. న‌ర్స‌రీలను, నాటిన మొక్క‌ల‌ను సంర‌క్షించాలి. డంపింగ్ యార్డులు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, వైకుంఠ ధామాలు అన్నీ ఉప‌యోగంలోకి తేవాలి. ప్ర‌తి గ్రామం దేశానికి ఆద‌ర్శంగా నిల‌వాలి. అవార్డులు రావాలి. క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా స‌ర్పంచ్ లు, గ్రామ కార్య‌ద‌ర్శులు, ఇత‌ర అధికారులు ప‌ని చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స‌ర్పంచ్ లు, గ్రామ కార్య‌ద‌ర్శుల‌ను ఆదేశించారు. గురువారం హైద‌రాబాద్ లోని త‌న కార్యాల‌యం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, డిఆర్ డిఓలు, డిపిఓలు, డిఎల్ పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, స‌ర్పంచ్ లు, గ్రామ కార్య‌ద‌ర్శులు తదిత‌ర అధికారుల‌తో మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, గౌర‌వ సీఎం కెసిఆర్ గారు రూపొందించిన ప‌ల్లె ప్ర‌గతి అత్యంత విజ‌య‌వంత‌మైన కార్య‌క్ర‌మం. ప‌ల్లెల‌ను దేశానికే ఆద‌ర్శంగా నిలిపిన, మ‌న రాష్ట్రానికి అనేక అవార్డులు తెచ్చిపెడుతున్న కార్య‌క్ర‌మం. దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన క‌రోనా లాంటి క‌ఠిన‌మైన వైర‌స్ ల‌ను ఎదుర్కోవ‌డానికి దోహ‌ద‌ప‌డిన‌, సీజ‌న‌ల్ వ్యాధుల‌ను పూర్తిగా అదుపులోకి తెచ్చి, ప‌ల్లెల‌ను ప‌రిశుభ్రంగా, ప‌చ్చ‌ద‌నంతో, ప్ర‌జ‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతున్న కార్య‌క్ర‌మం అన్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అత్యంత విజ‌య‌వంతం చేసిన అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులంద‌రినీ పేరుపేరునా అభినందించారు. అయితే, రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేయాల‌ని ఆదేశించారు. పల్లెలను దేశానికి ఆద‌ర్శంగా నిల‌పాలి. మీ ప‌ని తీరుతో సీఎం కెసిఆర్ మ‌న‌సు గెలిచారు. ఎవ్వ‌రికీ లేనంత‌గా కార్య‌ద‌ర్శుల జీతాల‌ను పెంచారు. మీరు బాగా ప‌ని చేసి, సీఎం కెసిఆర్ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా, రాష్ట్రానికి మ‌రింత మంచి పేరు వ‌చ్చే విధంగా ప‌ని చేయాల‌ని మంత్రి చెప్పారు.

ప్ర‌తి రోజూ పారిశుద్ధ్యాన్ని నిర్వ‌హించాలి-సానిటేష‌న్ యాప్ ని ఉప‌యోగించాలి:

ప్ర‌తి రోజూ పారిశుద్ధ్యాన్ని నిర్వ‌హించాలి. గతంలో రూపొందించుకున్న ప్ర‌ణాళిక‌ల ప్ర‌కారంగా, గ్రామాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాలి. అన్నారు. సానిటేష‌న్ యాప్ ని త‌ప్ప‌నిస‌రిగా వాడాలి. ఆ యాప్ ద్వారా ప్ర‌తి రోజూ నిర్వ‌హిస్తున్న పారిశుద్ధ్య వివ‌రాల‌ను అందులో పొందుప‌ర‌చాలి. గ్రామాల స‌మాచారం అందులో ఉంటుంది. రోజు వారి స‌మ‌స్య‌లు కూడా మీరు ఫీడ్ బ్యాక్ ఇవ్వ‌వ‌చ్చు.

కార్య‌ద‌ర్శులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను కూడా అందులో చెప్పండి. ఏడు ర‌కాల రిజిస్ట‌ర్లకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను కూడా మీరు ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ళ వ‌చ్చు. దీంతో గుడ్ గ‌వ‌ర్నెన్స్ తోపాటు, పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌ని మంత్రి వివ‌రించారు.

క‌రోనా విజృంభన నేప‌థ్యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి:

గ‌తంలో లాగే గ్రామ కార్య‌ద‌ర్శులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వ‌ర్క‌ర్లు, ఇత‌ర సిబ్బంది నుంచి ఉన్న‌తాధికారుల వ‌ర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్యాన్ని నిర్వ‌హిస్తూ, మ‌రింత అప్ర‌మ‌త్తంగా ప‌ని చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతోపాటు, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు ర‌వింద‌ర్, రామారావు, త‌దిత‌‌ర అధికారులు పాల్గొన్నారు.

More Press News