అంబేద్కర్ ఆశయాలు సాధించడమే నిజమైన నివాళి: మంత్రి సత్యవతి రాథోడ్

  • అంబేద్కర్ బాటలో సీఎం కేసీఆర్ గారు నడుస్తున్నారు
  • దళిత, గిరిజనులకు దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు తెలంగాణలోనే
  • సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కింద అదనంగా వెయ్యి కోట్ల రూపాయల కేటాయింపు
  • బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మహబూబాబాద్ లో ఘనంగా నివాళులు అర్పించిన
  • రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్
(మహబూబాబాద్, ఏప్రిల్ 14): దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి, సమానత్వాన్ని కోరుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత, మహా మేథావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా నేడు మహబూబాబాద్ లో మంత్రి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ రాష్ట్రంలో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇటీవల బడ్జెట్ లో కూడా దళితులకు కేటాయించే ప్రత్యేక ప్రగతి పద్దుకు అదనంగా సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకం కింద వెయ్యి కోట్లను కేటాయించారన్నారు. ఈ నిధులతో దళిత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని తెలిపారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్య ద్వారానే వెనుకబాటుతనం సమసిపోతుందని బలంగా నమ్మారని, అందుకే ఆయన ఆ కాలంలోనే అనేక డిగ్రీలు సంపాదించి, గొప్ప విద్యావంతుడు కాగలిగారన్నారు. అందువల్లే ఆయనను పిలిచి రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలు అప్పగించారని కొనియాడారు. అంబేద్కర్ గారు నమ్మిన విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు.

70 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఈ రాష్ట్రంలో ఎన్ని గురుకులాలు ఏర్పాటు చేశారో...తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ ఆరేళ్ల కాలంలో వాటికి రెండింతలు ఎక్కువగా గురుకులాలు పెట్టి పేద దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని చెప్పారు. దీంతో పాటు గురుకులాల్లో మంచి భోజనం పెడుతూ ఈ వర్గాల పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో మంచి విద్య అందించడమే కాకుండా విదేశాల్లో కూడా విద్య అభ్యసించడానికి వీలుగా అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పెట్టి విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు 20 లక్షల రూపాయలను ఇస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ గారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ కుమారి బిందు, జడ్పీటీసి బండి వెంకట్ రెడ్డి, కలెక్టర్ వి.పి గౌతమ్, ఎస్సీ నంద్యాల కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. 

More Press News