అర్చకులు, దేవాలయాల సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక విధానం: మంత్రి వెల్లంపల్లి
- కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు, అందరికీ వ్యాక్సిన్
- వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు మంత్రి వెల్లంపల్లి ఆదేశం
కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు కరోనా నియంత్రణకు దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది, అర్చకులు విధిగా మాస్క్ ధరించడంతో పాటు వచ్చే భక్తులు కూడా మాస్క్ ధరించే విధంగా అవగాహన, ప్రచారం చేయాలన్నారు.
దేవాలయాలకు వచ్చే ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటించేలా చేపట్టడంతో పాటు మార్కింగ్ వేయించాలన్నారు. ముఖ్యంగా అన్ని దేవాలయాల్లోనూ భక్తులకు అందుబాటులో శానిటైజర్లు ఏర్పాటు చేయడం, విధిగా శానిటేషన్ చేయించడం జరగాలన్నారు. భక్తుల దర్శన సమయంలో అవసరం మేరకు మార్పులు చేసుకోవాలన్నారు. అదే విధంగా భక్తుల నియంత్రణకు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌ని అవకాశం ఉన్న ప్రతి దేవాలయం అమలు చేయాలని సూచించారు.
అలాగే అన్నీ ప్రముఖ దేవాలయల్లో అయ్యవారికి, అమ్మవారికి యధావిధిగా ఏకాంతంగా పూజలు, సేవలు కొనసాగించాలన్నారు. ఇటీవల సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన ఈ-పూజ, ఈ-సేవలకు అధిక ప్రాధ్యానత ఇవ్వాలన్నారు. దేవాలయాల్లో పరోక్ష పూజలు ప్రత్యక్ష ప్రసారం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
దేవాలయాల భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, సెక్యూరిటిని పెంచడం వంటి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో దేవాదాయ శాఖ సెక్రటరి వాణీమెహన్, దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావు, రిజనల్ జాయింట్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లు, అసిసెంట్ కమిషనర్లు, ఈవోలు తదితరులు పాల్గొన్నారు.