అమ్రాబాద్ పులుల అభయారణ్యం - వన్యప్రాణి జనాభా వార్షిక నివేదిక విడుదల
- అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 14 పులులు, 43 రకాల వన్యప్రాణలు కదలికలు నమోదు
- పులుల సంఖ్య పెరిగేందుకు వీలుగా అటవీ సంరక్షణ, సమృద్దిగా శాఖాహార జంతువుల లభ్యత
పులుల సంఖ్య పెరిగేందుకు వీలుగా అటవీ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామని, శాఖాహార జంతువుల లభ్యత కూడా బాగా పెరిగినట్లు నివేదిక సూచిస్తోందని తెలిపారు. జాతీయ పులుల సంక్షణ కేంద్రం (NTCA) మార్గదర్శకాల ప్రకారం ఏటా అభయారణ్యంలో పులులు, వన్యప్రాణులను లెక్కిస్తామని, దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ తెలిపారు. లైన్ ట్రాన్సిక్ట్ మెథడ్, వాటర్ హోల్ సెన్సస్ ల ఆధారంగా జంతువులను లెక్కించామని అన్నారు.
పులులతో పాటు వాటి వేటకు ఆధారమైన శాఖాహార జంతువుల లభ్యతను కూడా పరిశీలించినట్లు వెల్లడించారు. ప్రతీ చదరపు కిలో మీటరు విస్తీర్ణంలో జింకలు, చుక్కల దుప్పులు, అడవి పందులు, సాంబార్, లంగూర్ లాంటి జంతువులను లెక్కించినట్లు తెలిపారు. మొత్తం 43 రకాల వన్యప్రాణులు అమ్రాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో అరుదైన హానీ బాడ్జర్ లాంటి జంతువులూ ఉన్నాయి. ఇక వందలాది రకాల పక్షి జాతులు కూడా అమ్రాబాద్ లో ఉన్నాయి.
ఈ నివేదిక విడుదల కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్ శోభతో పాటు, పీసీసీఎఫ్ (ఎస్.ఎఫ్) ఆర్.ఎం.దోబ్రియల్, పీసీసీఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, వైల్డ్ లైఫ్ అదనపు పీసీసీఎఫ్ సిద్దానంద్ కుక్రేటీ, అదనపు పీసీసీఎఫ్ లు ఎం.సీ. పర్గాయిన్, వినయ్ కుమార్, ఎస్.కే. సిన్హా లతో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ బి. శ్రీనివాస్, డీఎఫ్ఓ, ఎఫ్.డీ.ఓ, సిబ్బంది ఆల్ లైన్ ద్వారా పాల్గొన్నారు.