రామప్ప దేవాలయంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో యూనెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రామప్ప దేవాలయంకు యునేస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినందుకు హెరిటేజ్ తెలంగాణ శాఖ తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

రామప్ప దేవాలయంపై యునెస్కో సూచించిన గైడ్ లైన్స్ పై, డిసెంబర్ 2022 లో సమర్పించాల్సిన సమగ్ర నివేదికపై మంత్రి చర్చించి పలు సూచనలను, సలహాలను చేశారు.

కాకతీయల కాలంనాటి అద్భుతమైన కళాసంపదను, తెలంగాణ సంస్కృతిని యూనెస్కో సంస్థ గుర్తించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేల ఏళ్ల నాటి చారిత్రాత్మక సంపద, ఎన్నో అత్యద్భుతమైన ప్రదేశాలున్నాయన్నారు. రామప్ప దేవాలయంను యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ కొన్ని సూచనలు చేసిందన్నారు. వారి సూచనల మేరకు వచ్చే సంవత్సరం డిసెంబర్ - 2022 లోగా వారు సూచించిన సూచనలు యూనెస్కోకు సమర్పించిన DOSSIER లో పొందుపరిచిన సమాచారానికి లోబడి ఉండాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయం సమీపంలో వున్న చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలను సంరక్షించి, కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ గా అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలను సిద్దం చేయాలని తెలంగాణ హెరిటేజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

రామప్ప దేవాలయంలో కేంద్ర ఆర్కియాలజి శాఖకు చెందిన స్థలం వాటి సరిహద్దులు గుర్తించాలన్నారు. తెలంగాణ హెరిటేజ్ శాఖ అధీనంలో వున్న స్థలం అభివృద్ధి చేసేందుకు, తీసుకునే చర్యలపై మంత్రి చర్చించి పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది. రామప్ప దేవాలయం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రామప్ప దేవాలయం, చెరువు, కాలువలను చట్టబద్ధత కల్పించే విషయంపై యూనెస్కో వారికి వచ్చే సంవత్సరం డిసెంబర్ - 2022 లోపల ప్రణాళికలను సమర్పించాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

నీటి పారుదల కాలువల పరిధిలో ఉన్న కాకతీయుల కాలంలోని నిర్మించబడిన చారిత్రక కట్టడాలు, దేవాలయాలు వాటి సంరక్షణ కై చర్యలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రామప్ప దేవాలయం అభివృద్దిపై రూపోందించిన నివేదకను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో చర్చించి తదుపరి చర్యలను తీసుకుంటామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ స్మిత ఎస్. కుమార్, వైఏటీసీ జాయింట్ సెక్రటరీ కె. రమేష్, హెరిటేజ్ తెలంగాణ ఉన్నతాధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

More Press News