డెంగీకి కారణమైన దోమలను అరికట్టడానికి అందరి భాగస్వామ్యం అవసరం: మంత్రి ఈటల

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సుడిగాలి పర్యటన చేశారు. నాలుగు రోజుల్లో 10 జిల్లాలలో వైద్య ఆరోగ్య పరిస్థితులపై క్షుణ్ణంగా పరిశీలించారు. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు.

ప్రజలు ఎంత మాత్రం భయపడాల్సిన అవసరంలేదని వస్తున్న జ్వరాల్లో 90 శాతం జ్వరాలు సాధారణ జ్వరాలని, కేవలం 10శాతం మాత్రమే ప్రమాదకరమైనవని వాటికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈటల తెలిపారు.

జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని, పలు మండల కేంద్రంలో, పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను మంత్రి స్వయంగా పరిశీలించారు. 'ఓపీ'లలో రోగుల వసతులను పరిశీలించారు. ఎక్కువ మంది రోగులు వచ్చే ఆసుపత్రిలో ఓపీ కౌంటర్లు పెంచాలని.. డాక్టర్ల సంఖ్యను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ ని బయటికి పంపించవద్దని ఆదేశాలు జారీ చేశారు.

జ్వర లక్షణాలను బట్టి నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ హాస్పిటల్లోనే చేయాలని ఆదేశించారు. డెంగ్యూ కిట్స్ లేనిచోట్ల వెంటనే కిట్లను అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలిసా టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే డెంగ్యూ వ్యాధి నిర్ధారణ చేయాలని కోరారు. హాస్పిటల్స్ లో బ్లడ్ బ్యాంకులను పరిశీలించిన మంత్రి.. అన్ని వేళలా ప్లేట్ లెట్స్ అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని జ్వరాల బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని, భయాందోళనలతో ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని మంత్రి సూచించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వల్లనే జ్వరాలను పూర్తిస్థాయిలో ఆపలేమని, ప్రజల భాగస్వామ్యం కూడా కావాలని అని మంత్రి కోరారు. నివారణకి ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రజలను కోరారు. పరిసరాల పరిశుభ్రత, ఇంట్లో పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించాలి కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని పట్టణాల్లోని మున్సిపాలిటీలు గ్రామాల్లోని స్థానిక సంస్థలు పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి నివారణ చర్యలు చేపట్టాలని ఆయా కమ్యూనిటీలో అందరూ కలిసి పరిశుభ్రత పాటించాలని ఆ తర్వాత ఇంట్లో దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. దోమల ద్వారా కాకుండా ఇతర కారణాలతో కూడా జ్వరాలు  వస్తున్నాయి కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.

హైదరాబాదులో తీసుకున్న నిర్ణయాలను జిల్లా యంత్రాంగం సక్రమంగా పని చేయించడం కోసం, రాజకీయ నాయకుల భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం కోసమే జిల్లాల పర్యటన చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతమున్న గ్లోబల్ వార్మింగ్, వాతావరణ పరిస్థితులు డెంగీ జ్వరంకి వాహకంగా పనిచేస్తున్న ఎడిస్ ఈజిప్టై దోమల పురోభివృద్ధికి కారణం అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అంతే కాదు ప్రమాదకరమైన 10 జబ్బుల్లో డెంగీని WHO చేర్చింది. డెంగ్యూ జ్వరాలు ఒక్క తెలంగాణ సమస్య మాత్రమే కాదని దేశంలో చాలా చోట్ల జ్వరాలు వస్తున్నాయని మంత్రి తెలిపారు.

మలేరియాకి కారణమైన దోమలను నియంత్రించటంలో విజయవంతమయ్యాయని, డెంగీకి కారణమైన దోమలను అరికట్టడానికి అందరి భాగస్వామ్యం అవసరం అని మంత్రి తెలిపారు. పంచాయతీ రాజ్, మున్సిపల్, ఎడ్యుకేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ లు సమన్వయంతో పనిచేసి జ్వరాల బారి నుండి నుంచి ప్రజలను రక్షించేందుకు అహర్నిశలు పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం జిల్లా పర్యటనలు చేపట్టామని నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు రిపోర్టులను సీఎంకి అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. 


More Press News