ఈనెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ: మంత్రి కేటీఆర్

  • 1.02కోట్ల మహిళలకు చీరల అందచేత

  • రూ.313కోట్ల ఖర్చు

  • 100 వెరైటీల్లో చీరలు

  • వచ్చే సంవత్సరం కల్లా బతుకమ్మ చీరలకు బ్రాండింగ్‌ 

  • తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ వ్యవహరాల శాఖ మంత్రి కే తారక రామారావు 

బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని మహిళలకు అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 23 నుంచి ప్రారంభించనున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. ఆ రోజున ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో చీరల పంపిణీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ ఛైర్మన్‌లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నట్లుగా ఆయన వెల్లడించారు.

గురువారం మసాబ్‌ ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌ శైలజా రామయ్యార్‌, సీడీఎంఏ డైరెక్టర్‌ శ్రీదేవి, సెర్ప్‌ సీఈవో పౌసమి బసు, టెస్కో జీఎం యాదగిరి తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో బతుకమ్మ చీరల నుంచి వివరాలను వెల్లడించారు. ద్విముఖ వ్యూహంతో బతుకమ్మ చీరల పథకానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల పైబడిన మహిళలందరు చీరలను అందచేస్తామన్నారు. 1.02కోట్ల మంది అర్హులైన మహిళలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కోట్లు వెచ్చిస్తుందన్నారు.

రాష్ట్రంలో మహిళలందరు ప్రీతిపాత్రంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు మూడు సంవత్సరాలుగా బతుకమ్మ చీరలను అందిస్తున్నారని అన్నారు. పవర్‌ లూం కార్మికులకు ఉపాధి బతుకమ్మ చీరల ద్వారా 16వేల కుటుంబాలకు ప్రత్యక్ష్యంగా ఉపాధి దొరికిందన్నారు. 26వేల మరమగ్గాల ద్వారా చీరలను తయారు చేశామన్నారు. ఈ సంవత్సరం 10 రకాల డిజైన్‌లు, 10 రకాల రంగుల్లో మొత్తం 100 వెరైటీల్లో చీరలను పంపిణీ చేయడానికి సిద్దంగా ఉంచామన్నారు.

చీరలు జిల్లాలకు చేరవేశామన్నారు. బతుకమ్మ చీరల ద్వారా మరమగ్గ కార్మికులకు గతంలో నెలకు రూ.8 నుంచి 12వేల రూపాయలు మాత్రం దక్కేదని కానీ బతుకమ్మ చీరల తయారీ తరువాత నెలకు రూ.16-20వేల రూపాయల వరకు లభిస్తుందన్నారు. బతుకమ్మ చీరల కోసం గత మూడు సంవత్సరాల్లో రూ.715కోట్లు కేటాయించిందని తెలిపారు. చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌ శైలజా రామయ్యార్‌ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా చీరల పంపిణి చేస్తున్నామని, ప్రతి సంవత్సరం డిజైన్‌లు, నాణ్యతలో మరింత మెరుగుగా ఉండే విధంగా చీరల తయారి చేయిస్తున్నామన్నారు. చీరతో పాటుగా జాకెట్‌ కూడా అందించనున్నట్లుగా తెలిపారు.


More Press News