లవణాలు లేని ఆర్వో నీటిని తాగితే బాడీ పెయిన్స్ తో పాటు మోకాళ్ల నొప్పులు వస్తాయి: మిషన్ భగీరథ ఈ.ఎన్.సీ

ఆర్వో నీటిలో శరీరానికి అవసరమైన లవణాలు ఒక్కటి కూడా ఉండవన్నరు మిషన్ భగీరథ ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి. లవణాలు లేని ఆర్వో నీటిని తాగితే బాడీ పెయిన్స్ తో పాటు మోకాళ్ళ నొప్పులు వస్తయన్నరు. మిషన్ భగీరథ నీటి నాణ్యత, వినియోగం పై కొన్ని రోజుల సంది గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిషన్ భగీరథ అధికారులు, ఇవాళ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని కొండూరు, కొట్టాల, అశ్వాపుర్ కాలనీల్లో పర్యటించారు. మిషన్ భగీరథ ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజినీర్ విజయ్ ప్రకాష్ తో పాటు సుమారు వంద మంది భగీరథ ఇంజినీర్లు ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు.

ప్రతీ ఒక్కరికి శుద్ది చేసిన తాగునీటిని అందించే లక్ష్యంతో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నామని ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి చెప్పారు. అత్యున్నత ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మిషన్ భగీరథ నీళ్లు శుద్ది అవుతాయన్నరు. గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది బాడీ పెయిన్స్ , మోకాళ్ళ నొప్పులతో బాధపడడానికి ఆర్వో నీళ్లు తాగడమే కారణమన్నారు. ఆర్వో నీటితో జీర్ణ సంబంధ సమస్యలు, విటమిన్ డీ లోపం కూడా వస్తాయని డాక్టర్లు చెప్తున్నారని తెలిపారు.  మిషన్ భగీరథ నీటిని తాగడమే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం అన్నారు. 

మంచి నీళ్ల దందా చేస్తున్న కొంతమంది వ్యక్తులు భగీరథ నీటి నాణ్యతపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఈ సందర్భంగా భగీరథ నీటిని తాగి గ్రామస్తులకు ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి భరోసా కల్పించారు.ఆ తరువాత ఇంటింటికి తిరిగి నల్లా కనెక్షన్ లను పరిశీలించారు. నల్లా పైపులు డామేజ్ కాకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యత గ్రామస్తులదే అన్నారు. ఉచితంగా సరాఫరా చేస్తున్న భగీరథ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఆ తరువాత మర్రిగూడెం మండలం బాట్లపల్లి లో నిర్మించిన నీటి శుద్ది కేంద్రంలో సంగారెడ్డి, నల్లగొండ జిల్లా ఇంజినీర్లతో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి సమావేశం అయ్యారు. 

మిషన్ భగీరథ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అన్నీ పూర్తి అయి ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు శుద్ది చేసిన నీరు సరాఫరా అవుతుందన్నారు. ప్రజలందరూ భగీరథ నీటిని తాగేలా ఇంజినీర్లు అందరూ  బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎస్.ఈ పాపారావు, ఈ.ఈ రాకేష్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


More Press News