ఒలింపిక్స్‌ లక్ష్యంగా స్విమ్మింగ్‌ పూల్‌ను ప్రారంభించిన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌

ఒలింపిక్స్‌ కోసం భారతదేశం నుంచి మొట్టమొదటి టీమ్‌ను అభివృద్ది చేయాలనే మహోన్నత లక్ష్యంతో  ఆర్టిస్టిక్‌  స్విమ్మింగ్‌ శిక్షణను విద్యార్ధులకు పరిచయం చేసింది

ప్రతి విద్యార్ధికీ స్విమ్మింగ్‌ను  అవసరమైన లైఫ్‌ స్కిల్‌గా బోధిస్తారు.

స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా భాగస్వామ్యంతో ప్రపంచ శ్రేణి స్విమ్మర్లను తీర్చిదిద్దడం కోసం ఈ క్రీడకు మరింత ప్రోత్సాహం

హైదరాబాద్‌, 31 మార్చి 2023: అత్యున్నత  స్ధాయిలో పోటీపడేలా, ఉన్నత శ్రేణి  క్రీడాకారులను తీర్చిదిద్దాలనే తమ ప్రయత్నాలకు కొనసాగింపుగా, బేగంపేట లోని  హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ తమ ప్రపంచ శ్రేణి ఒలిపింక్‌ సైజ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ను నేడు ప్రారంభించింది.  ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌ మరియు ఆక్వాటిక్‌ ఏరోబిక్స్‌లో అంతర్జాతీయ స్ధాయి శిక్షణను తమ విద్యార్థులకు అందించడంతో పాటుగా అన్ని విభాగాలలోనూ అత్యుత్తమ స్థాయి ఈతగాళ్లు (స్విమ్మర్లు)ను తీర్చిదిద్దాలనేది స్కూల్‌ లక్ష్యం. దీనితో, దేశంలో పరిమిత స్ధాయిలో ఈ తరహా సౌకర్యాలు కలిగిన స్కూల్స్‌లో ఒలింపిక్‌ పరిమాణంలో స్విమ్మింగ్‌ పూల్‌ను కలిగిన  మొట్టమొదటి మరియు ఒకే ఒక్క స్కూల్‌గా బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌  నిలువడమే కాదు ఇక్కడ ఆర్టిస్టిక్‌ మరియు అక్రోబాటిక్‌ స్విమ్మింగ్‌ శిక్షణను సైతం అందిస్తుంది.

ఈ స్విమ్మింగ్‌ పూల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన, ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌ ట్రూప్‌, ప్రపంచ  మరియు ఒలింపిక్‌ స్ధాయి చాంఫియన్స్‌ను కలిగిన  ‘కజక్‌ సింక్రో స్టార్స్‌’ను ప్రత్యేకంగా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కు ఆహ్వానించారు. ఈ  పూల్‌ను  నేడు తెలంగాణా ప్రభుత్వ విద్యా శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ, ఐఏఎస్‌ ;  హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేట  బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్‌పర్సన్‌  ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ అతిథిగా  స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ జనరల్‌  శ్రీ మోనల్‌ చోక్షీ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేట  తమ స్కూల్‌లో  క్రీడా పర్యావరణ వ్యవస్ధను అభివృద్ధి చేయడానికి 25 కోట్ల రూపాయలను కేటాయించింది.  దీనిలో భాగంగా ఆధునిక మౌలిక సదుపాయాలు,  సరైన కోచ్‌లు, ట్రైనర్లు మరియు ఈ అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులను నియమించడం ద్వారా తమ విద్యార్ధులను ప్రపంచశ్రేణి క్రీడాకారులుగా తీర్చిదిద్దడంతో పాటుగా ఒలింపిక్స్‌ వద్ద పతకాలను గెలిచే సామర్ధ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దుతారు. ఈ స్కూల్‌ ఇప్పుడు సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, బాడ్మింటన్‌, టేబుల్‌టెన్నిస్‌, హాకీ మరియు షూటింగ్‌ వంటి అంశాలపై దృష్టి సారించింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ సొసైటీ అధ్యక్షులు శ్రీ గుస్తి జె నొరియా మాట్లాడుతూ  ‘‘విద్యాంశాలతో పాటుగా ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో కూడా  అత్యున్నత ప్రతిభను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేట  ఇప్పుడు ప్రపంచ శ్రేణి క్రీడాకారులను తీర్చిదిద్దాలనే ప్రతిష్టాత్మక లక్ష్యం పెట్టుకుంది. ఒలింపిక్‌–పరిమాణపు స్విమ్మింగ్‌ పూల్‌ను ప్రారంభించడం మరియు  ఆర్టిస్టిక్‌, ఆక్వాటిక్‌ శిక్షణ కార్యక్రమాలను నేడు పరిచయం చేయడమన్నది మా లక్ష్యం చేరుకునే దిశగా వేసిన మరో ముందడుగు’’ అని అన్నారు.

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేట లోని స్విమ్మింగ్‌ కాంప్లెక్స్‌లో  ఒలింపిక్‌ పరిమాణపు పూల్‌ ఉంది. ఇది 50 మీటర్లుపొడవు, 21 మీటర్లు వెడల్పు ఉంటుంది. డెక్‌ ఏరియా 16వేల చదరపు అడుగులుగా ఉండి, 8 వరుసలు ఉంటాయి. ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 1000 మంది కూర్చునే వసతులు ఉంటాయి. ఈ స్విమ్మింగ్‌పూల్‌ నిర్మాణంలో అధికమొత్తం నిధులను స్కూల్‌ పూర్వ విద్యార్థులు అందించడంతో పాటుగా ప్రపంచ శ్రేణి స్విమ్మింగ్‌ పూల్‌ కలను సాకారం చేశారు.

శ్రీ నోరియా మాట్లాడుతూ ‘‘ఇనిస్టిట్యూషన్‌ అభివృద్ధిలో హెచ్‌పీఎస్‌ పూర్వ విద్యార్ధులు  చురుకైన పాత్రను పోషించడంతో పాటుగా తగిన మద్దతు అందించడం సంతోషంగా ఉంది. ఈ స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణానికి తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను’’ అని అన్నారు.

వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన  కజక్‌ సింక్రో స్టార్స్‌

ఆర్టిస్టిక్‌ స్విమ్మర్ల బృందం చేసిన విన్యాసాలు ఈ కార్యక్రమానికి వీక్షకులుగా హాజరైన ఉపాధ్యాయలు, విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. ఈ ప్రదర్శన ఖచ్చితంగా చూడతగ్గ దృశ్యంగా ఉంది. ఎందుకంటే, ఈ బృందం సంగీతానికి అనుగుణంగా, ఎలాంటి లోపాలు లేకుండా క్లిష్టమైన మరియు మనోహరమైన నృత్యాలతో అలరించింది. ఈ బృందం యొక్క అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించిన తీరుతో ఆకర్షితులైన వీక్షకులు మంత్రముగ్ధులయ్యారు.

   నేషనల్‌ కజక్‌ టీమ్‌ బృందంలోని సభ్యులలో  యెరెన్‌చెన్కో వాలెంటినా ; టీమ్‌ టెక్నికల్‌ రొటీన్‌లో  బ్రాంజ్‌ మెడలిస్ట్‌లు – ఐదా మీమాంటే  మరియు యెకటెరినా సిమోనోవా ; ఆర్టిస్టిక్‌ సింక్రోనైజ్డ్‌ స్విమ్మింగ్‌ ఇన్‌ ఫ్రీ సోలో (మహిళలు) విభాగంలో ఆసియన్‌ చాంఫియన్‌  అఖ్బషేవా  అడెల్యేం ఉన్నారు. వీరితో పాటుగా ఈ బృందంలో  గుర్తింపు పొందిన స్విమ్మర్లలో  అలియా కరిమోవా ; అలెగ్జాండ్రా నెమిచ్‌ ; యెకటెరినా నెమిచ్‌ మరియు  ఒలింపిక్‌ డ్యూయట్‌ ప్రదర్శన చేసిన అర్న తొక్తాగన్‌ సైతం ఈ డిస్‌ప్లేలో పాల్గొనడంతో పాటుగా స్కూల్‌ కోసం అద్భుతమైన ప్రదర్శనలు చేశారు.

    ఈ సందర్భంగా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ , బేగంపేట ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాధవ్‌ డియో సరస్వత్‌ మాట్లాడుతూ ‘‘మా విద్యార్ధులు అథ్లెటిక్స్‌ ద్వారా  సమగ్ర అభివృద్ధిని సాధించడం మాత్రమే కాదు  అంతర్జాతీయ క్రీడా వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహించేలా సిద్ధమై, దేశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకురావాలని కోరుకుంటున్నాము. దీనికోసం మా నిబద్ధతను చూపడంతో పాటుగా  అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తూనే  అత్యుత్తమ కోచ్‌లను  నియమించుకున్నాము. కజకస్తాన్‌ టీమ్‌ ప్రదర్శనలతో మా విద్యార్థులు స్ఫూర్తి పొందారని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.



More Press News