మ‌హిళ‌కు ప్రాణాంతక వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్స‌ సమ‌ర్థంగా చికిత్స చేసిన కిమ్స్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్ట‌ర్ హ‌య‌గ్రీవ‌రావు

హైద‌రాబాద్, ఏప్రిల్ 05, 2023: అత్యంత అరుదైన గుండె సంబంధిత వ్యాధి ఉన్న 36 ఏళ్ల మ‌హిళ ఉన్న‌ట్టుండి కార్డియాక్ అరెస్టు కావ‌డంతో అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు. 2017లో ఒక‌సారి ఇదే స‌మ‌స్య రావ‌డంతో ఆమెను ఆక‌స్మిక మ‌ర‌ణం నుంచి కాపాడేందుకు అప్ప‌ట్లో వైద్యులు ఇంప్లాంట‌బుల్ కార్డియోవెర్ట‌ర్-డీఫిబ్రిలేట‌ర్ (ఐసీడీ) అమ‌ర్చారు. అప్ప‌టినుంచి బాగానే ఉన్నా, ఇటీవ‌ల వెంట్రిక్యుల‌ర్ ఫిబ్రిలేష‌న్ (గుండె ల‌య త‌ప్పి దానివ‌ల్ల కార్డియాక్ అరెస్టు) కావ‌డంతో ప‌దే ప‌దే షాక్‌లు త‌గిలాయ‌ని మార్చి మొద‌టివారంలో కిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ఒక్క‌రోజులోనే ఆమెకు 30 షాక్‌లు త‌గిలాయి. నిజానికి ఐసీడీ నుంచి త‌గిలే ఈ త‌ర‌హా షాక్‌లు ఆమె ప్రాణాల‌ను కాపాడాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, ప్ర‌తి షాక్ ఆమెను తీవ్ర‌మైన బాధ‌కు గురిచేసింది. దీనివ‌ల్ల ఆమె గుండె బ‌ల‌హీన‌ప‌డే ప్ర‌మాదం సైతం ఉంది. చివ‌ర‌కు అది పనిచేయడం మానేస్తుంది. మరోవైపు ఐసీడీ బ్యాటరీ కూడా వేగంగా అయిపోతోంది.

 
ఆమెకు నాలుగు వేర్వేరు ర‌కాల ఇంజెక్ష‌న్ల‌ను న‌రానికి ఇచ్చి, వెంటిలేట‌ర్ మీద పెట్టారు. అయినా కూడా కొంచెం త‌క్కువ తీవ్ర‌త‌తో ఆమెకు షాక్‌లు త‌గులుతూనే ఉన్నాయి. దాంతో కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన పేసింగ్‌, ఎల‌క్ట్రోఫిజియాల‌జీ విభాగం డైరెక్ట‌ర్, సీనియ‌ర్ కార్డియాల‌జిస్టు డాక్ట‌ర్ బి.హ‌య‌గ్రీవ‌రావు నేతృత్వంలోని బృందం ఈ మ‌హిళ‌ను కాపాడేందుకు ఒక ప్ర‌త్యేక‌మైన వ్యూహాన్ని సిద్ధం చేసింది.

ముందుగా రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక స‌రికొత్త ప్ర‌క్రియ ద్వారా గుండెకు నరాలను సరఫరా చేసే న్యూరల్ గాంగ్లియాను  నొప్పి నివార‌ణలో ప్రత్యేక శిక్షణ పొందిన మత్తుమందు నిపుణురాలు డాక్టర్ నాగలక్ష్మి ధ్వంసం చేశారు. వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ చాలా తక్కువగా, చిన్నగా ఉండ‌టంతో ఈ ప్ర‌క్రియ‌ కొంతవరకు సహాయపడింది. అయితే ఫిబ్రిలేష‌న్‌కు కార‌ణ‌మైన గుండె అద‌న‌పు ల‌య మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. తీవ్రమైన గుండె లయలు ఉన్న ఐదుగురు రోగులకు ఈ పద్ధతిని విజయవంతంగా ఉపయోగించిన అనుభవం తమకు ఉందని, అయితే ఈ రోగి వ‌య‌సు త‌క్కువ‌, గుండె ప‌నితీరు సాధార‌ణంగా ఉంద‌ని డాక్టర్ నాగలక్ష్మి చెప్పారు.

 
దీంతో రోగికి 3డి మ్యాపింగ్‌, అబ్లేష‌న్ చేశారు. గుండె ఎడమ జఠరికలో అద‌నపు బీట్ల‌ను డాక్టర్ హ‌య‌గ్రీవ‌రావు, ఆయన బృందం అత్యంత క‌చ్చితంగా గుర్తించి, రేడియోఫ్రీక్వెన్సీ ఆబ్లేష‌న్ ప‌ల్స్‌తో దాన్ని న‌యం చేశారు.  రెండు గంట‌ల పాటు చేసిన ఈ సుదీర్ఘ ప్ర‌క్రియ త‌ర్వాత ఇక ఫైబ్రిలేష‌న్ తీవ్రంగా లేదు, గుండె ల‌య కూడా సాధ‌ర‌ణ స్థితికి చేరుకుంది.

 
దాంతో త‌ర్వాతిరోజే రోగికి వెంటిలేట‌ర్ తీసేశారు, ఆమె సొంత‌కాళ్ల‌పై న‌డ‌వ‌గ‌లిగారు. ఆ మ‌ర్నాడే ఆమెను డిశ్చార్జి చేశారు. రెండు వారాల త‌ర్వాత ఫాలో అప్ కోసం వ‌చ్చిన‌ప్పుడు ప‌రీక్షిస్తే, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమె చ‌క్క‌గా ఉన్నారు. ఇలాంటివి చాలా అరుదైన కేసుల‌ని, అదే స‌మ‌యంలో కార్డియాల‌జిస్టుల‌కు కూడా చాలా ఇబ్బందిక‌ర‌మ‌ని డాక్ట‌ర్ హ‌య‌గ్రీవ‌రావు తెలిపారు. అయితే.. అదృష్ట‌వ‌శాత్తు సాంకేతిక ప‌రిజ్ఞానం అభివృద్ధి చెంద‌డంతో వీటిని స‌రిగ్గా గుర్తించి, న‌యం చేయ‌డానికి అవ‌కాశం ఉంటోంద‌న్నారు. కిమ్స్ ఆస్ప‌త్రిలో కూడా ప్రాణాల‌ను కాపాడేందుకు కావ‌ల్సిన అత్యాధునిక ప‌రిక‌రాలు, ప్ర‌మాద‌క‌ర‌మైన గుండె ల‌య త‌ప్పే ఇబ్బందుల‌ను స‌రిచేయ‌డానికి అవ‌స‌ర‌మైన ప‌ద్ధ‌తులు ఉన్నాయ‌ని, ఇవ‌న్నీ త‌క్కువ ఖ‌ర్చుతో కూడుకోవ‌డంతో పాటు క‌చ్చితంగా ప‌నిచేస్తాయ‌ని చెప్పారు. ఇలాంటి ప‌రిస్థితులు వ‌చ్చిన‌ప్పుడు అన్ని విభాగాల వైద్యులూ ఒక బృందంగా పనిచేస్తేనే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని, ఇక్క‌డ అలాంటి వాతావ‌ర‌ణం బాగుంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

More Press News