13 ఏళ్ల బాలుడికి హృద్రోగం.. పేస్ మేక‌ర్ అమ‌రిక‌!

త‌ర‌గ‌తి గ‌దిలో క‌ళ్లుతిరిగి ప‌డిపోయిన బాలుడు

నిమిషానికి 30 సార్ల‌కు త‌గ్గిపోయిన గుండె వేగం

* అనంత‌పురం కిమ్స్ వైద్యుడు డాక్ట‌ర్ మూడే సందీప్ వెల్ల‌డి

 
అనంత‌పురం, ఏప్రిల్ 10, 2023: ఇటీవ‌లి కాలంలో చాలామంది యువ‌కుల‌కు, మ‌ధ్య‌వ‌య‌స్కుల‌కు గుండెపోటు రావ‌డం, కార్డియాక్ అరెస్టు సంభ‌వించి అప్ప‌టిక‌ప్పుడే మ‌ర‌ణించ‌డం లాంటి ఘ‌ట‌న‌లు చూస్తున్నాం. అయితే దాదాపుగా ఇవ‌న్నీ 20 ఏళ్లు దాటిన‌వారికే క‌నిపిస్తున్నాయి. అనంత‌పురం జిల్లా క‌నేక‌ల్ మండలంలో 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న గౌత‌మ్ అనే 13 ఏళ్ల బాలుడు త‌ర‌గ‌తి గ‌దిలో ఉండ‌గా ఉన్న‌ట్టుండి క‌ళ్లు తిరిగి ప‌డిపోయాడు. ఏమైందోన‌ని వెంట‌నే ఆర్డీటీ ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా అక్క‌డ ఈసీజీ, ఇత‌ర ప్రాథ‌మిక ప‌రీక్ష‌లు చేశారు. గుండె వేగం నిమిషానికి క‌నీసం 60-70 సార్లు ఉండాల్సింది ఈ బాలుడికి కేవ‌లం 30 సార్లు మాత్ర‌మే ఉంది. ర‌క్త‌పోటు కూడా బాగా త‌గ్గిపోయింది. దాంతో వెంట‌నే అక్క‌డి వైద్యులు అనంత‌పురంలోని కిమ్స్ ఆస్ప‌త్రికి పంపారు. ఆస్ప‌త్రిలో గౌత‌మ్‌కు చికిత్స చేసిన సీనియ‌ర్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ కార్డియాల‌జిస్టు డాక్టర్ మూడే సందీప్ ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

 
‘‘గౌత‌మ్‌ను మా వ‌ద్ద‌కు తీసుకురాగానే ముందుగా అతడి ప‌రిస్థితి గ‌మ‌నించి ఐసీయూలో తాత్కాలిక పేస్ మేక‌ర్ అమ‌ర్చి మ‌రింత లోతుగా ప‌రీక్ష‌లు చేశాం. దాంతో అత‌డికి పుట్టుక‌తోనే గుండెలో కండక్ష‌న్ వ్య‌వ‌స్థ స‌రిగా లేక‌పోవ‌డంతో పాటు, ఒక చిన్న రంధ్రం కూడా ఉంద‌ని తెలిసింది. కండక్ష‌న్ వ్య‌వ‌స్థ మ‌న గుండె నిర్ధారిత వేగంతో కొట్టుకునేందుకు కార‌ణం అవుతుంది. అది లేన‌ప్పుడు త‌గినంత వేగం లేక‌పోవ‌డం గానీ, లేదా బాగా ఎక్కువ వేగంతో కొట్టుకోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. గుండె కొట్టుకున్న‌ప్పుడ‌ల్లా విద్యుత్ సిగ్న‌ళ్లు మ‌న గుండెగుండా వెళ్తాయి. వాటివ‌ల్లే గుండె సంకోచించ‌డం, వ్యాకోచించ‌డం ఉంటుంది. ఈ బాలుడిలో కండక్ష‌న్ వ్య‌వ‌స్థ స‌రిలేక‌పోవ‌డం వ‌ల్ల గుండె నిమిషానికి 30 సార్లు మాత్ర‌మే కొట్టుకుంటోంది. దీన్ని గ‌మ‌నించి, బాలుడికి వెంట‌నే పేస్‌మేక‌ర్ అమ‌ర్చాం. గుండె నిమిషానికి 60 సార్ల కంటే త‌క్కువ కొట్టుకుంటే ఇది వెంట‌నే తెలుసుకుని, విద్యుత్ సిగ్న‌ళ్లు పంపుతుంది. దానివ‌ల్ల గుండె వేగం పెరుగుతుంది. ఇలాంటి కేసుల్లో ఇవి జీవితాంతం ఉండాలి. అవి ఉన్నా, సాధార‌ణ జీవ‌నానికి ఏమీ ఇబ్బంది ఉండ‌దు. ఎంచ‌క్కా తిన‌చ్చు, ఆడుకోవ‌చ్చు. అయితే, సుమారు 15 ఏళ్ల త‌ర్వాత ఇందులో బ్యాట‌రీ అయిపోతుంది. అప్పుడు మ‌ళ్లీ మార్పించుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య‌ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

గౌత‌మ్ గుండె సాధార‌ణంగా కొట్టుకోవ‌డం, గాయం కూడా పూర్తిగా మాన‌డంతో అత‌డిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపేశాం. ఇంత త‌క్కువ వ‌య‌సులో పేస్ మేక‌ర్ అమ‌ర్చాల్సి రావ‌డం రాష్ట్రంలోనే ఇదే మొద‌టిసారి. ఈ విష‌యం తెలిసి, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ నుంచి కూడా వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవ‌లి కాలంలో చిన్న‌వ‌య‌సులోనూ ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నందువ‌ల్ల త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అంద‌రూ నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉంటూ ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా త‌క్ష‌ణం స్పందించాలి’’ అని డాక్ట‌ర్ మూడే సందీప్ వివ‌రించారు. 

More Press News