సంక్లిష్ట‌మైన పాంక్రియాటిక్ కేన్స‌ర్‌కు లాప్రోస్కొపిక్ శ‌స్త్రచికిత్స‌ * కొండాపూర్ కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యుల ఘ‌న‌త‌

హైద‌రాబాద్, ఏప్రిల్, 2023: సాధార‌ణంగా పాంక్రియాస్‌, కాలేయానికి కేన్స‌ర్ వ‌చ్చినప్పుడు వాటికి శ‌స్త్రచికిత్స‌లు చేయ‌డం చాలా సంక్లిష్టం, సాంకేతికంగా చాలా క‌ష్ట‌మైన‌వి. అందువ‌ల్ల వాటిని ఓపెన్ ప‌ద్ధ‌తిలోనే చేస్తుంటారు.  కానీ, అత్యున్న‌త నైపుణ్యం, సాంకేతిక ప‌రిజ్ఞానం ఉంటే మాత్రం వాటిని లాప్రోస్కొపిక్ ప‌ద్ధ‌తిలోనూ చేయొచ్చు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఓ కేన్స‌ర్ బాధితుడికి కొండాపూర్ కిమ్స్ ఆస్ప‌త్రిలో ఇలాగే లాప్రోస్కొపిక్ ప‌ద్ధ‌తిలో శ‌స్త్రచికిత్స చేసి, వైద్యులు ఊర‌ట క‌ల్పించారు. అందుకు సంబంధించిన వివ‌రాల‌ను సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు డాక్ట‌ర్ సీహెచ్ న‌వీన్ కుమార్, క‌న్స‌ల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు డాక్ట‌ర్ మ‌ధులిక వివ‌రించారు.
 
‘‘ఖ‌మ్మం ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల వ్య‌క్తికి ప‌చ్చ‌కామెర్లు, బ‌రువు త‌గ్గిపోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు రావ‌డంతో వివిధ ఆస్ప‌త్రుల‌కు వెళ్లారు. చివ‌ర‌కు కొండాపూర్ కిమ్స్ ఆస్ప‌త్రికి రాగా, ఆయ‌న‌కు వివిధ ప‌రీక్ష‌లు చేశాం. అందులో ఆయ‌న‌కు పాంక్రియాటిక్ కేన్స‌ర్ సోకిన‌ట్లు తేలింది. ఆయ‌న‌కు విపుల్స్ ప్రొసీజ‌ర్ అనే పేరున్న లాప్రోస్కొపిక్ శ‌స్త్రచికిత్స చేయాల‌ని నిర్ణ‌యించాం. సాధార‌ణ శ‌స్త్రచికిత్స‌ల కంటే ఇందులో చిన్న‌పాటి రంధ్రాలు మాత్ర‌మే చేయ‌డం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా న‌య‌మ‌వుతాయి, త్వ‌ర‌గా కోలుకోగ‌ల‌రు, నొప్పి త‌క్కువ‌గా ఉంటుంది, శ‌స్త్రచికిత్స విజ‌య‌వంతం అయ్యే అవ‌కాశాలు కూడా ఎక్కువ కావ‌డండ‌తో ఈ ప‌ద్ధతినే ఎంచుకున్నాం. దాదాపు ఆరు గంట‌ల పాటు శ‌స్త్రచికిత్స చేశాం. దాని తర్వాత రోగి చాలా త్వ‌ర‌గా కోలుకోవ‌డంతో వారం రోజుల్లోనే ఆయ‌నను డిశ్చార్జి చేసి, ఇంటికి పంపేశాం’’ అని తెలిపారు.
 
విపుల్స్ ప్రొసీజ‌ర్ అనేది చాలా సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌. అందులో పాంక్రియాస్ (క్లోమం) త‌ల భాగం, చిన్న పేగుల్లో మొద‌టి భాగం, ఆంత్ర‌మూలం, పిత్తాశ‌యం.. ఇవ‌న్నీ కొంత మేర తొల‌గించాల్సి ఉంటుంది.  కాలేయం, ఆంత్ర‌మూలం.
ఇది చేయ‌డానికి అత్యున్న‌త స్థాయి నైపుణ్యం కావాలి, సాంకేతికంగా కూడా అత్యున్న‌త నాణ్య‌త క‌లిగిన ప‌రిక‌రాలు ఉండాలి. అందువ‌ల్ల హైద‌రాబాద్‌లోనే చాలా త‌క్కువ కేంద్రాల్లో మాత్రమే దీన్ని లాప్రోస్కొపిక్ ప‌ద్ధ‌తిలో చేస్తారు.
 
రోగులు త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి అవ‌కాశం ఉండ‌టం, నొప్పి త‌క్కువగా ఉండ‌టం, శ‌స్త్రచికిత్స త‌ర్వాత స‌మ‌స్య‌లు పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ఈ త‌ర‌హా శ‌స్త్రచికిత్స చేయించుకుంటే మంచిద‌న్న విష‌యాన్ని మినిమ‌ల్లీ ఇన్వేజివ్ ప‌ద్ధ‌తిలో గ్యాస్ట్రోఇంటెస్టిన‌ల్, కేన్స‌ర్ శ‌స్త్రచికిత్స‌ల నిపుణుడైన డాక్ట‌ర్ న‌వీన్‌కుమార్ చెబుతుంటారు. ముఖ్యంగా కేన్స‌ర్ బాధితులు శ‌స్త్రచికిత్స పూర్త‌యిన త‌ర్వాత వీలైనంత త‌క్కువ స‌మ‌యంలోనే కీమోథెర‌పీ మొద‌లుపెట్టాలి. అలాంట‌ప్పుడు ఈ త‌ర‌హా శ‌స్త్రచికిత్స‌లే మంచిదని ఆయ‌న సూచించారు. ఓపెన్ శ‌స్త్రచికిత్స‌ల కంటే, వీటివ‌ల్ల జీవ‌న నాణ్య‌త కూడా మెరుగ్గా ఉంటుంది.

More Press News