వాషింగ్టన్ వీధుల్లో రాహుల్ గాంధీని తన టెస్లాకారులో తిప్పిన పాలమూరు యువకుడు శ్రీధర్ పుప్పలి
వాషింగ్టన్ డీసీ/మహబూబ్‌నగర్, జూన్ 13, 2023: మన పాలమూరులో పుట్టి, అమెరికాలో సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా పనిచేస్తున్న శ్రీధర్ పుప్పలి.. ఈ నెల 1న అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తన టెస్లా-వై కారులో రాహుల్ గాంధీని తిప్పారు. ఆ సమయంలో టెస్లాకార్లలో ఉండే ఫీచర్లు, అసలు విద్యుత్ వాహన రంగం రాబోయే రోజుల్లో రవాణాను ఎలా విప్లవాత్మకంగా మారుస్తుందన్న వివరాలను రాహుల్ గాంధీకి శ్రీధర్ వివరించారు.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతో పాటు మాజీ ఎంపీ మధు యాస్కీ గౌడ్ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో.. వాషింగ్టన్ డీసీలోని కాపిటల్ హిల్ బిల్డింగ్, విల్లర్డ్ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, పెన్సల్వేనియా ఎవెన్యూ ప్రాంతాల మీదుగా రాహుల్ గాంధీ తిరిగారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ టెక్నోక్రాట్ శాం పిట్రోడా, రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుడైన అలంకార్ సవాయ్ కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ పుప్పలి మాట్లాడుతూ, "రాహుల్ గాంధీని నా టెస్లా-వై కారులో తిప్పాలని నాకు ఆహ్వానం అందగానే ఎంతో థ్రిల్ అయ్యాను. ఈ ప్రయాణ సమయంలో కారు ఎలా పనిచేస్తుంది, టెస్లాలో ఏవేం మోడళ్లు ఉన్నాయనే వివరాలను తెలుసుకోవడానికి రాహుల్ ఆసక్తి చూపించారు. అలాగే, కారులో ఉన్న నేవిగేషన్ సెట్టింగులు, మ్యూజిక్ లాంటి ఫీచర్లను ఉపయోగించేందుకూ ప్రయత్నించారు" అని చెప్పారు.
"టెస్లా మోడళ్ల ధరలు తెలుసుకోడానికీ రాహుల్ ఆసక్తి చూపించారు. ఇంత ఖరీదైన కార్లు ఇతర సాధారణ కార్లతో పోలిస్తే ఎంత కాలానికి అందుబాటులోకి వస్తాయని కూడా అడిగారు. రాహుల్ గాంధీకి వివిధ జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఉన్న అవగాహన, లోతైన పరిజ్ఞానం, ఆయన ఆలోచనల్లో ఉన్న స్పష్టత చూస్తే అబ్బురం అనిపిస్తుంది. కాంగ్రెస్ అగ్రనేతకు ఉన్న హాస్యచతురత వల్ల మా 15 నిమిషాల ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా గడిచిపోయింది. ఈ సాయంత్రాన్ని నేను రాబోయే చాలా సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటాను" అని శ్రీధర్ పుప్పలి చెప్పారు.
అనంతరం సాయంత్రం రాహుల్ గాంధీ గౌరవార్థం కేపిట్ హిల్ వద్ద ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన డిన్నర్‌కు శ్రీధర్ పుప్పలి, ఆయన భార్య, పిల్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. డిన్నర్ సమయంలో కూడా రాహుల్ గాంధీ శ్రీధర్, ఆయన కుటుంబంతో ఎంతో సరదాగా గడిపారు. అమెరికాలో వాళ్ల జీవితం ఎలా సాగుతోందని తెలుసుకోడానికి ప్రయత్నించారు.