ఒకే వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు.. ఇతర అవయవాలు
* అత్యంత అరుదైన సమస్య.. ప్రపంచంలో 300 కేసులే
* సంతానరాహిత్యమని వస్తే బయటపడిన అసలు విషయం
* కిమ్స్ ఆస్పత్రిలో లాప్రోస్కొపిక్ శస్త్రచికిత్సతో ఊరట
హైదరాబాద్, ఆగస్టు 22, 2023: సాధారణంగా స్త్రీ, పురుషులకు వేర్వేరు జననాంగాలు, పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. పిండం ఏర్పడేటప్పుడు రెండు రకాల అవయవాలూ ఉన్నా, ఆ తర్వాత హార్మోన్ల ప్రభావంతో ఏదో ఒకటే మిగులుతుంది. దానివల్ల పుట్టేసరికి ఆడపిల్ల, లేదా మగ పిల్లవాడు అనేది నిర్ణయం అయిపోతుంది. కానీ, అత్యంత అరుదైన కేసుల్లో జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్) కారణంగా హార్మోన్లు తగినంత స్థాయిలో విడుదల కాకపోవడంతో.. స్త్రీ, పురుష పునరుత్పత్తి అవయవాలు రెండూ ఉంటాయి. ఇలాంటి కేసులు ప్రపంచంలో ఇప్పటివరకు కేవలం 300 మాత్రమే బయటపడ్డాయి. భారతదేశంలో 20 కేసులు మాత్రమే ఉన్నాయి. అలాంటి అత్యంత అరుదైన కేసు ఒకటి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చింది. ఇందులోని సమస్య, అందించిన చికిత్స వివరాలను కన్సల్టెంట్ యూరాలజిస్టు, యూరో-ఆంకో, ఆండ్రాలజిస్టు, మూత్రపిండాల మార్పిడి, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వై.ఎం. ప్రశాంత్ తెలిపారు.
‘‘జిల్లా కేంద్రమైన మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఒకరు పిల్లలు పుట్టడం లేదని, పొత్తికడుపు కింది భాగంలో తీవ్రమైన నొప్పి కారణంగా అక్కడి వైద్యులు పరీక్షించి, సమస్య తీవ్రమైనది కావడంతో ఇక్కడకు పంపారు. ఇక్కడకు రాగానే అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎంఆర్ఐ పరీక్షలు చేయడంతో అసలు విషయం తెలిసింది. అతడికి వృషణాలు కిందకు రాకుండా.. ఉదరభాగంలోనే ఉండిపోయాయి. దాంతోపాటు లోపల గర్భసంచి, ఫాలోపియన్ ట్యూబ్‌లు.. ఇంకా యోనిలో కొంత భాగం కూడా ఉంది. దీన్ని వైద్య పరిభాషలో పెర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్ అంటారు. శరీరంలో స్రవించాల్సిన యాంటీముల్లేరియన్ హార్మోన్ (ఏఎంహెచ్) తగిన స్థాయిలో రాకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. సాధారణంగా అయితే ఆ హార్మనో పురుషుల్లో స్త్రీల పునరుత్పత్తి అవయవాలను అణిచేస్తుంది. కానీ కొద్దిమందిలో మాత్రం జన్యు ఉత్పరివర్తనం కారణంగా ఏఎంహెచ్ హార్మనో రాకపోవడం వల్ల స్త్రీ పునరుత్పత్తి అవయవాలు కూడా అలాగే ఉండిపోతాయి. కానీ విచిత్రం ఏమిటంటే, ఇలాంటివాళ్లు పైకి చూడటానికి సర్వసాధారణంగా ఉంటారు. పురుషుల్లో మీసాలు, గడ్డాలు బాగానే వస్తాయి. పురుషాంగం కూడా సాధారణంగానే ఉంటుంది. కానీ వృషణాలు లోపల ఉండిపోవడం వల్ల వీర్యకణాలు ఉత్పత్తికావు. దాంతో పిల్లలు పుట్టరు. మిగిలిన హార్మోన్లు అన్నీ మామూలుగానే ఉంటాయి.
ఈ కేసులో రోగిని పరీక్షించినప్పుడు లోపల బ్లాడర్, ప్రోస్టేట్ పక్కనే చిన్నపాటి కణితి లాంటిది ఏర్పడింది. లోపల ఉన్న స్త్రీ పునరుత్పత్తి అవయవాల స్రావాల వల్ల ఇది ఏర్పడినట్లు తెలిసింది. అతడి హార్మోన్ల విశ్లేషణ చేయించగా, టెస్టోస్టిరాన్, ఎల్‌హెచ్, ఎఫ్ఎస్‌హెచ్, ప్రోలాక్టిన్ అన్నీ కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. వృషణతిత్తి మాత్రం ఖాళీగా ఉంది. వీర్యపరీక్ష చేయగా, అసలు వీర్యకణాలు లేవని తేలింది. ఇతర రక్తపరీక్షల ఫలితాన్నీ మామూలుగానే వచ్చాయి. అందువల్ల ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్ ఉందని గుర్తించి.. లాప్రోస్కొపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. చిన్నపాటి కోతలతోనే లోపల ఉన్న వృషణాలు, ఫాలోపియన్ ట్యూబులు, గర్భసంచి, యోనిభాగం.. అన్నింటినీ తొలగించాం. ఇప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్టోస్టిరాన్ రీప్లేస్‌మెంట్ చికిత్స చేయాలని సూచించాం. ఈ శస్త్రచికిత్స వల్ల అతడికి ఇన్నాళ్లుగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. అయితే పిల్లలు పుట్టే అవకాశం మాత్రం లేదు. అదే 18 ఏళ్ల వయసు లోపల ఇలాంటి శస్త్రచికిత్స చేస్తే, వృషణాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉండేది. దానివల్ల పిల్లలు పుట్టడానికీ అవకాశం ఉంటుంది. అయితే నిరక్షరాస్యత, పేదరికం, సామాజికంగా ఉండే కొంత ఇబ్బంది, ఇతరత్రా కారణాల వల్ల ఇన్నాళ్లూ రాకపోవడంతో ఇప్పుడు వృషణాలను తీసేయడం తప్పలేదు’’ అని డాక్టర్ వై.ఎం. ప్రశాంత్ వివరించారు.