రాజధాని అంటే అధికార పార్టీకి ఆటలైపోయింది: పవన్ కల్యాణ్

•ప్రజలపై కాదు... భూములపైనే ప్రేమ ఎక్కువ

•రేపు ఉత్తరాంధ్ర, సీమ ప్రజలను కూడా మోసం చేస్తారు

•రైతులు, ఆడపడుచుల కన్నీళ్లే సర్వనాశనం చేస్తాయి 

•పోలీస్ శాఖను రౌడీయిజం చేసే స్థాయికి దిగజార్చారు

•నాయకులకు మదమెక్కితేనే ఇలాంటి పనులు చేయిస్తారు

•ఉద్యోగ సంఘాలు రాజధాని రైతులకు సంఘీభావం తెలపాలి 

•రేపు ఢిల్లీ వెళ్తున్నా... రాజధాని రైతుల పరిస్థితిని కేంద్రంలో ముఖ్యులకు వివరిస్తా 

•వైసీపీని కూల్చే వరకు జనసేన నిద్రపోదు 

•అమరావతి... శాశ్వత రాజధానిగా నిలుపుతాం

•రాజధాని రైతులు, మహిళల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులపై లాఠీఛార్జ్ చేయించిన వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన పార్టీ నిద్రపోదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఆడపడుచులు, రైతులు, దివ్యాంగుల ఒంటిపై పడిన దెబ్బలు వైసీపీ సర్వనాశనానికి దారి తీస్తాయి అన్నారు. జగన్ రెడ్డి మూడు కాదు 30 రాజధానులు పెట్టినా తిరిగి రాజధానిని అమరావతికే తీసుకొస్తామని మాటిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం రాజధాని గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు పవన్ కల్యాణ్ ని కలవడానికి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చారు. వారితో సమావేశమైన పవన్ కల్యాణ్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  పోలీసుల లాఠీ ఛార్జీలో గాయపడ్డ రైతులు, దివ్యాంగులు, మహిళల బాధలు తెలుసుకుని చలించిపోయారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... “రైతులు, మహిళలపై జరిగిన లాఠీఛార్జ్ కంటతడి పెట్టిస్తోంది. నోట మాట రాని దివ్యాంగుడిపైనా పోలీసులు లాఠీలు ప్రయోగించడం బాధాకరం. రాజధాని కోసం భూములు త్యాగం చేసి, బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టిన మీ చేత ప్రభుత్వం రక్తం చిందించేలా చేసింది. ఆడపడుచులు అని చూడకుండా పాశవికంగా దాడి చేసి వాళ్లతో కన్నీరు పెట్టించారు. నాయకులకు మదమెక్కితేనే ఇలాంటి పనులు చేస్తారు. వైసీపీ వ్యక్తిత్వమే రౌడీ, ఫ్యాక్షనిస్టు సంస్కృతి. భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి రాకుండా చేయాలి. రాజధాని పరిరక్షణ కోసం అమరావతి పరిరక్షణ సమితితో కలిసి పని చేస్తాం.

•అమరావతిలో భూములు ఉంటే మార్చేవారా? 

రాజధానిగా అమరావతి ఉండాలని 5 కోట్ల మంది సమష్టిగా తీసుకున్న నిర్ణయం. రాజధాని ప్రాంత రైతులు ఎవరో వ్యక్తిని నమ్మి భూములు ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చారు. రాజధాని కోసం త్యాగం చేసిన రైతులను ఇవాళ ప్రభుత్వం వంచించింది. వారి త్యాగాలను గుర్తించకపోగా వాళ్లను తిట్టడానికి వాడిన పదజాలం చాలా బాధ కలిగించింది.

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే దానిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కానీ వైసీపీ ప్రభుత్వం ఏకంగా రాజధానినే మార్చేసింది. అదే అమరావతిలో వైసీపీ నాయకులకు భూములు ఉంటే మాత్రం రాజధాని మార్చే వారు కాదు. వైజాగ్ లో భూములు ఉన్నాయి కనుక రాజధానిని మార్చేస్తున్నారు.  మట్టి మనిషితో కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించనట్లు చరిత్రలో లేదు. 

•పోలీస్ శాఖ వ్యక్తిత్వాన్ని చంపేశారు 

పోలీస్ శాఖను రౌడీయిజం చేసే స్థాయికి దిగజార్చారు. వారి వ్యక్తిత్వాన్ని చంపేశారు. ప్రభుత్వ ఆలోచనా విధానమే పోలీస్ శాఖ తీసుకోవడం బాధకలిగించింది. నిన్న కూడా గాయపడ్డ రైతులను పరామర్శించడానికి వెళ్తానంటే పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 400 నుంచి 500 మంది పోలీసులు మంగళగిరి పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. డి.ఐ.జి. స్థాయి వ్యక్తులను పంపించి నిర్భందించారు. సుమారు 5 గంటల పాటు పార్టీ కార్యాలయం నుంచి బయటకు అడుగుపెట్టకుండా చేశారు. మేము తలచుకుంటే పోలీసు వలయాలను చేధించగలం. అయితే వైసీపీ నాయకులకు కావాల్సింది గొడవ జరగడం. గొడవ జరిగితే మన ముసుగులో పోలీసులపై రాళ్ల దాడి చేయడానికి వాళ్ల మనుషులు సిద్ధంగా ఉన్నారు. అలాంటి అవకాశం వాళ్లకు ఇవ్వకూడదనే సంయమనం పాటించాను. 

•భవిష్యత్తులో వైసీపీ ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే గొప్పలా ఉండాలి 

రాజధాని అంటే వైసీపీ నాయకులకు ఆటైపోయింది. తమాషాలు చేస్తున్నారు. ఫుడ్ ఫ్యాకెట్లు పడేసినట్లు రాజధానులను పడేస్తున్నారు. అహంకారంతో కొట్టుకుంటున్నారు. ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా అమరావతే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు వస్తాయి.. ఏ ప్రాంతం బాధపడకుండా ఇక్కడ నుంచి వెళ్లిపోయిన రాజధానిని తిరిగి ఇక్కడికే తీసుకొస్తాం. రాజధాని ప్రాంతానికి మద్దతుగా మాట్లాడితే మిగిలిన ప్రాంతాల్లో పార్టీ దెబ్బ తింటుందనే భయం నాలో లేదు. ఎందుకంటే నేను ధర్మాన్ని నమ్ముతాను. ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఈ రోజు రాజధాని ప్రాంత రైతులను మోసం చేసిన వాళ్లు.. రేపు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయకుండా ఎందుకుంటారు. వీళ్లకు ప్రజలపై కంటే భూములపైనే ప్రేమ ఎక్కువ. ఇవాళ 151 ఎమ్మెల్యేలను గెలిచిన వైసీపీకి... భవిష్యత్తుల్లో ఒక్క ఎమ్మెల్యే వస్తే గొప్ప అనే పరిస్థితి వచ్చేలా జనం తీర్పు ఇవ్వాలి.  వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను కాకినాడ ఎమ్మెల్యే తిట్టినట్లు నన్ను తిట్టినా భరిస్తాను. కానీ మీరు తిట్టిన ప్రతి మాటకు బదులు ఇచ్చే తీరుతాను. 

•రైతులకు సంఘీభావం తెలపండి

సచివాలయం ఉద్యోగులు రాజధాని ఆందోళనకు సంఘీభావం తెలపాలి. ప్రజలకు అండగా నిలబడాలి. రాజకీయ నాయకులు, వ్యవస్థను నమ్మకండి. ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి. ప్రజలు శాశ్వతం. వాళ్లను మాత్రమే నమ్మండి. వారి ఆందోళనలకు అండగా నిలబడండి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో  తెలంగాణ సచివాలయం ఉద్యోగులు ఏ విధంగా అయితే భాగమయ్యారో.. అదే విధంగా మీరు ఉద్యమంలో భాగమవ్వండి. ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడిపోయారు. వాటన్నింటిని పక్కన పెట్టి ఉద్యమంలో పాలుపంచుకోండి.

•ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని 

అమరావతే శాశ్వత రాజధాని. దీనికి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కట్టుబడి ఉన్నాయి. అమరావతికి ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేశారు. దానిని గౌరవించి ఇరు పార్టీలు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. రేపు ఢిల్లీ వెళ్తున్నాను. అద్భుతాలు జరుగుతాయని చెప్పను కానీ.. మన బాధలను కేంద్ర పెద్దలకు వివరిస్తాను. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం రాకుండా బలంగా ప్రయత్నాలు చేస్తాను. వీళ్లు ఎక్కువ కాలం పాలనలో ఉండరు. ప్రజాకంటకులు ఎవరైనా సర్వనాశనం కావాల్సిందే. ఏ ప్రభుత్వమైనా శంకుస్థాపనలతో పాలన మొదలు పెడుతుంది.. వైసీపీ మాత్రం కూల్చివేతలతో పాలన మొదులు పెట్టింది. కూల్చివేతలతో పాలన మొదలు పెట్టిన ప్రభుత్వం కూలిపోక తప్పదు.

•ఫోటోల కోసం డ్రామాలు చేయను 

జనసేన పార్టీ అవకాశవాద రాజకీయాలు చేయదు. ప్రజలకు మంచి చేసే రాజకీయాలే చేస్తుంది. జనసేన భావజాలం ఇష్టపడ్డ అప్పటి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్లాను తప్ప... సార్ నా మీద కేసులు ఉన్నాయి మాఫీ చేయండి అని చెప్పుకోవడానికి ఎప్పుడూ ఢిల్లీ వెళ్లలేదు. ఫోటోలు కోసం డ్రామాలు చేయను. పదిసార్లు వచ్చి హడావుడి చేయను. భవిష్యత్తుతులో రిజల్ట్ మాత్రం చూస్తారు. ఎప్పుడు విజయవాడ వచ్చినా రాజధాని గ్రామాల్లో పర్యటించే వెళ్తాను. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్లకు జనసేన పార్టీ గుర్తుకు వచ్చేలా పోరాటం చేస్తాను.  ఇవాళ మాట ఇస్తున్నాను అమరావతే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని. దీనిని ఎవరు కదపకుండా ఉండే బాధ్యత జనసేన, బీజేపీ పార్టీలు తీసుకుంటాయ”ని తెలిపారు.

•పోలీసులో రౌడీలో అర్ధం కావడం లేదు : రాజధాని రైతులు 

అంతకుముందు రాజధాని రైతులు, మహిళలు మాట్లాడుతూ.. “అసెంబ్లీ వద్ద శాంతియుతంగా నిరసనలు తెలుపుకుంటాం, సభలోకి చొచ్చుకువెళ్లం అని చెప్పినా వినకుండా పోలీసులు ఇష్టారాజ్యంగా కొట్టారు. ఈడ్చేశారు. మాలోకి కొంత మంది చొరబడి రాళ్లు రువ్వారు. రాళ్లు రువ్విన వారిలో రైతులు ఎవ్వరూ లేరు. మీరు ఒక గీత గీయండి దాని అవతలే మేం ఉంటామని చెప్పినా వినలేదు. వాళ్లతో మాటలేంటి ఫోర్స్ ను పంపి కొట్టించండి అంటూ సివిల్ డ్రెస్ లో ఉన్నవారు ఆదేశాలిస్తుంటే పోలీసులు రెచ్చిపోయారు. అత్యంత పాశవిహంగా, ఆడవారిని సైతం అభ్యంతరకర పదజాలంతో తిడుతూ ఈడ్చేశారు. మమ్మల్ని కొడుతున్న వారు పోలీసులో కాదో కూడా అర్ధంకాని పరిస్థితి. వారి భాష చాలా తేడాగా ఉంది. పోలీసులు రౌడీల్లా వ్యవహరించార”ని మహిళలు వాపోయారు. తాళ్లు కట్టి అడ్డదిడ్డంగా ఈడ్చేశారని రైతులు చెప్పారు. ప్రజలను రక్షించే పోలీసుల మాదిరి వాళ్లలా లేరన్నారు. తాగేందుకు తెచ్చిన మంచి నీరు లాగేసుకోవడం, బాటిల్లో నీళ్లని కాల్వల్లో పోసేయడం వంటి దారుణమైన చర్యలకు పాల్పడ్డారని వాపోయారు.


More Press News