'ట్రంప్' గేదె.. పాప్యులారిటీనే దాని ప్రాణాలు కాపాడిందిగా!

Trump Buffalo Rescued Transferred to Bangladesh National Zoo
  • ట్రంప్‌ను పోలిన జుట్టుతో వైరల్ అయిన బంగ్లాదేశ్ గేదె
  • బక్రీద్ బలి నుంచి చివరి నిమిషంలో కాపాడిన ప్రభుత్వం
  • భద్రతా కారణాల దృష్ట్యా ఢాకా జాతీయ జూకు తరలింపు
  • ఈ దున్నపోతు అరుదైన అల్బినో జాతికి చెందినదని తెలిపిన యజమాని
  • అదే ఫామ్‌లో 'బెంజమిన్ నెతన్యాహు' పేరుతో మరో దున్నపోతు
బంగ్లాదేశ్‌లో ఓ గేదె ఇప్పుడు సెలబ్రిటీగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పోలిన జుట్టుకట్టుతో సోషల్ మీడియాలో వైరల్ కావడమే దీనికి కారణం. బక్రీద్ పండుగ సందర్భంగా బలి ఇచ్చేందుకు సిద్ధం చేసిన ఈ గేదె.. చివరి నిమిషంలో ప్రభుత్వం కాపాడి జాతీయ జూకు తరలించింది. దాంతో చాలామంది నెటిజ‌న్లు పాప్యులారిటీనే దాని ప్రాణాలు కాపాడిందంటూ కామెంట్లు చేస్తున్నారు. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ ఆసక్తికర కథనాన్ని వెలుగులోకి తెచ్చింది.

దాదాపు 700 కిలోల బరువున్న ఈ గేదెకు నుదుటిపై తెల్లటి మచ్చ, తలపై ట్రంప్ హెయిర్‌స్టైల్‌ను పోలిన జుట్టు ఉండటంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో దీనికి 'డొనాల్డ్ ట్రంప్ బఫెలో' అని పేరుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు లక్షలాది వ్యూస్‌తో వైరల్ అయ్యాయి. ప్రజల నుంచి వస్తున్న అసాధారణ స్పందన, భద్రతా కారణాల దృష్ట్యా ఈ దున్నపోతును బలి ఇవ్వకూడదని ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. దాని యజమాని జియా ఉద్దీన్ మ్రిధా నుంచి దాన్ని కొనుగోలు చేసి ఢాకాలోని బంగ్లాదేశ్ నేషనల్ జూకు తరలించారు.

"దాని తలపై జుట్టు చూసి మా తమ్ముడు సరదాగా ట్రంప్ అని పేరు పెట్టాడు" అని యజమాని మ్రిధా స్థానిక మీడియాతో చెప్పారు. ఇది అరుదైన అల్బినో జాతికి చెందినదని, సాధారణంగా ఇవి చాలా శాంత స్వభావంతో ఉంటాయని ఆయన వివరించారు. దీనికి మొక్కజొన్న, సోయాబీన్ వంటి పౌష్టికాహారం అందించినట్లు తెలిపారు. ఈ దున్నపోతును చూసిన చాలామంది ట్రంప్‌తో పోలికను అంగీకరించారు. "ఫేస్‌బుక్‌లో ఫొటోలు చూసినప్పుడు అచ్చం ట్రంప్‌లాగే కనిపించింది. ముఖం, హెయిర్‌స్టైల్ సరిగ్గా సరిపోయాయి. కానీ, ఈ గేదె చాలా ప్రశాంతంగా, మర్యాదగా ఉంటుంది" అని ఓ మహిళ వ్యాఖ్యానించారు.

ఇదే ఫామ్‌లో మరో దున్నపోతు కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సుమారు 750 కిలోల బరువున్న ఆ దున్నపోతుకు 'బెంజమిన్ నెతన్యాహు' అని పేరు పెట్టారు. అయితే ఇది 'ట్రంప్' దున్నపోతుకు పూర్తి భిన్నంగా చాలా చురుకుగా, అల్లరి స్వభావంతో ఉంటుందని, ఒక్కోసారి యజమానుల పైకి దూసుకొస్తుందని ఫామ్ వర్కర్లు చెబుతున్నారు. 
Go Back to Shorts
Donald Trump Buffalo
Bangladesh National Zoo
Trump Hairstyle Buffalo
Viral Buffalo Bangladesh
Bakrid Festival
Benjamin Netanyahu Buffalo
Albinism in Buffaloes
Social Media Viral Animal

More Telugu News