అది గొడ్డలి పార్టీ, మాది రాజ్యాంగాన్ని నమ్మిన పార్టీ: హోం మంత్రి అనిత

Vangalapudi Anitha Slams Rival Party as Axe Party at TDP Mahanadu
  • టీడీపీ మహానాడులో అనిత ప్రసంగం
  • ప్రత్యర్థి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు
  • చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్న అనిత
  • 20 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంటే ఏపీ ప్రపంచంలోనే నెంబర్ వన్
  • మహానాడును మహిళలకు అంకితమివ్వడంపై చంద్రబాబుకు ధన్యవాదాలు
తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యర్థి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల పాలన విధ్వంసకరంగా సాగిందని, అది ప్రజావేదిక కూల్చివేతతో మొదలైందని ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీని"గొడ్డలి పార్టీ"గా అభివర్ణించిన ఆమె, టీడీపీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ అని స్పష్టం చేశారు. మహానాడు రెండో రోజు రాజకీయ తీర్మానాన్ని బలపరుస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో అమరావతి కోసం పోరాడిన మహిళలను బూటుకాళ్లతో తొక్కించారని, నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని అనిత ధ్వజమెత్తారు. దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని మండలికి పంపిన నీచపు ఘనత ఆ పార్టీదేనని తీవ్రంగా విమర్శించారు. తాము గొడ్డళ్లు చేతికిచ్చే పార్టీ కాదని, యువనేత లోకేష్ రాజ్యాంగబద్ధమైన పాలన అందిస్తారని, ఆయన చేతిలో ఉన్నది 'రెడ్ బుక్' అని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అనిత అన్నారు. 2014లో నవ్యాంధ్రకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, అమరావతి, పోలవరం పనులను పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2000కు పెంచిన ఘనత ఆయనదేనని కొనియాడారు. రానున్న 20 ఏళ్లు ఇదే ప్రభుత్వం కొనసాగితే, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ మహానాడును మహిళలకు అంకితం చేసిన చంద్రబాబుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గత పాలనలో విధ్వంసమే: సోమిరెడ్డి 

తెలుగుదేశం పార్టీ మహానాడు-2026 రెండో రోజు సమావేశాలు వాడివేడిగా సాగాయి. మౌలిక సదుపాయాలు, దేవాలయాల పరిరక్షణపై ప్రవేశపెట్టిన తీర్మానాల సందర్భంగా టీడీపీ నేతలు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనక్కి వెళ్లిందని ఆరోపించారు.

మౌలిక సదుపాయాలపై ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. 2019-24 మధ్య వైసీపీ పాలనలో రాష్ట్రంలో కేవలం 1,800 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే నిర్మించారని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 5,050 కిలోమీటర్ల రహదారులను నిర్మించిందని ఆయన పోల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలోని రోడ్లలో 50 శాతం దెబ్బతిన్నాయని ఆరోపించారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు 1,631 రోజుల పాటు ఉద్యమం చేశారని, ఈ పోరాటంలో 230 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. "మావిగన్" పేరుతో వైసీపీ డ్రామాలు ఆడుతోందని, వారి గన్ కల్చర్ ఇంకా పోలేదని విమర్శించారు.

‘గొడ్డలి పార్టీ’ పాలనలో దేవాలయాలు ధ్వంసమయ్యాయి: పనబాక లక్ష్మి

దేవాలయాల పరిరక్షణ తీర్మానంపై టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి ప్రసంగించారు. ‘గొడ్డలి పార్టీ’ పాలనలో దేవాలయాలు ధ్వంసమయ్యాయని, తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారని ఆమె ఆరోపించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను గత ప్రభుత్వంలోని నేతలు దోచుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అర్చకుల వేతనాలు, ధూప దీప నైవేద్యాల నిధులను పెంచిందని, వేద పండితులకు గౌరవ వేతనం అందిస్తోందని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో దేశవ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణం చేపట్టామని వివరించారు.


Go Back to Shorts
Vangalapudi Anitha
Anitha Vangalapudi
TDP Mahanadu
Telugu Desam Party
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Somireddy Chandramohan Reddy
Panabaka Lakshmi
Amaravati

More Telugu News