పాపం సాయి సుదర్శన్‌... వరుసగా రెండో మ్యాచ్ లోనూ చేజారిన బ్యాట్, వికెట్లపై పడింది!

Sai Sudharsan Hit Wicket Again in GT vs RR IPL Match
  • ఐపీఎల్ క్వాలిఫయర్ 2లో సాయి సుదర్శన్ వింత ఔట్
  • వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా వెనుదిరిగిన వైనం
  • రాజస్థాన్‌పై 32 బంతుల్లో 58 పరుగులు చేసిన సుదర్శన్
  • గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యం
  • 215 పరుగుల లక్ష్య ఛేదనలో పటిష్ట స్థితిలో గుజరాత్
ఐపీఎల్ 2026 సీజన్ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఒక వింత, అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా ఔటయ్యి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో అద్భుతమైన ఫామ్‌తో అర్ధశతకం పూర్తి చేసుకున్న సుదర్శన్, దురదృష్టవశాత్తు తన వికెట్‌ను తానే పడగొట్టుకున్నాడు.

రాజస్థాన్ బౌలర్ బ్రిజేష్ శర్మ వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఆఫ్ స్టంప్ అవతల వేసిన ఫుల్ టాస్ బంతిని ఆడే క్రమంలో సుదర్శన్ బ్యాట్‌పై నియంత్రణ కోల్పోయాడు. షాట్ ఆడిన తర్వాత అతని చేతి నుంచి జారిన బ్యాట్ నేరుగా వికెట్లను తాకింది. దీంతో ఫీల్డ్ అంపైర్ అతడిని హిట్ వికెట్‌గా ప్రకటించారు. అంతకుముందు మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో ఔటైన సుదర్శన్, మళ్లీ అదే రీతిలో వెనుదిరగడంతో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర నిరాశతో మోకాళ్లపై కూలబడిపోయాడు.

ఔటయ్యే సమయానికి సుదర్శన్ కేవలం 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 58 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో ఉన్నాడు. కెప్టెన్ గిల్‌ (100*)తో కలిసి తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేయగా, గుజరాత్ ఈ భాగస్వామ్యంతో బలమైన స్థితిలో నిలిచింది.

అంతకుముందు, ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్-1లోనూ ఇలాగే సాయిసుదర్శన్ తన బ్యాట్ ను వికెట్లపైకి జారవిడిచి హిట్ వికెట్ రూపంలో అవుటయ్యాడు. ఇవాళ కూడా అదే రీతిలో అవుట్ కావడంతో నిశ్చేష్టకు గురయ్యాడు. తీవ్ర నిరాశతో మైదానం వీడాడు. 
Go Back to Shorts
Sai Sudharsan
Gujarat Titans
Rajasthan Royals
IPL 2026
hit wicket
Shubman Gill
cricket
Brijesh Sharma
Indian Premier League
GT vs RR

More Telugu News