డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Orders Arrest of Digital Arrest Phone Scammers
  • రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి ‘ఏపీ సైబర్ గార్డ్’ ఏర్పాటు
  • ఫిర్యాదు అందిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు
  • ఆరు స్తంభాల వ్యవస్థతో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రణాళిక
  • ఏపీలో నేరం చేస్తే తప్పించుకోలేమనే భయం నేరగాళ్లకు కలగాలని సీఎం స్పష్టం
"డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్లు చేసి ప్రజలను భయపెడుతూ డబ్బులు దోచుకునే వారే అరెస్ట్ కావాలి. ఆ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు శాఖను ఆదేశించారు. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు దోచుకుంటుంటే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ పరిస్థితిని అరికట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సైబర్ నేర రహితంగా మార్చడమే లక్ష్యమని, ఏపీ ప్రజలను మోసం చేస్తే తప్పించుకోలేమనే భయం నేరగాళ్లకు కలగాలని ఆయన హెచ్చరించారు. సచివాలయంలో సైబర్ నేరాల కట్టడిపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో సైబర్ నేరాలను సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ ‘ఏపీ సైబర్ గార్డ్’ పేరుతో ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖ్యమంత్రికి వివరించారు. ఆరు స్తంభాల (6 పిల్లర్స్) ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా సైబర్ వార్ రూం, 1930 కాల్ సెంటర్ డాష్‌బోర్డ్, టెక్నాలజీ-ఏఐ వినియోగం, పోలీసులకు శిక్షణ, 3-టైర్ ఆర్కిటెక్చర్, ప్రజా చైతన్యం వంటివి ఉంటాయని పేర్కొన్నారు.

మంగళగిరిలోని ‘ప్రభల టెక్ పార్క్’లో అత్యాధునిక సదుపాయాలతో రాష్ట్రస్థాయి సైబర్ వార్ రూం ఏర్పాటు చేస్తున్నామని, ఇది 30 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని డీజీపీ తెలిపారు. సైబర్ మోసంపై ఫిర్యాదు అందిన వెంటనే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి, గోల్డెన్ అవర్ టైంలో స్పందించి బాధితుల డబ్బు బదిలీ కాకుండా చూడాలని సీఎం సూచించారు. ఇందుకు బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని కోరారు.

పోలీసు పెట్రోలింగ్ తరహాలోనే ‘సైబర్ పెట్రోలింగ్’ కూడా నిరంతరం జరగాలని చంద్రబాబు అన్నారు. నేరం జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయడంపై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలపై వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. ఆర్బీఐ, ప్రముఖ బ్యాంకులతో కలిసి MuleHunter.AI వంటి టెక్నాలజీలను వాడతామని, ఏడాదిలో 500 మంది పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తామని డీజీపీ వివరించారు. 28 జిల్లాల్లో సైబర్ యూనిట్లు, 4 ప్రాంతీయ హబ్‌లు ఏర్పాటు చేసి నేరాలకు అడ్డుకట్ట వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సైబర్ నేరాల నియంత్రణలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రాజెక్టుల పూర్తికి గడువు విధించండి: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదని, వాటి పూర్తికి కచ్చితమైన కాలపరిమితి నిర్దేశించుకుని పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్టీసీపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులతో పాటు దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల పనులపైనా చర్చించారు. "ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవ తేదీలు ప్రకటించాం. పెద్ద పరిశ్రమలను 18 నెలల్లోగా ఉత్పత్తి ప్రారంభించాలని చెబుతున్నాం. అదే తరహాలో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను పూర్తి చేయాలి. దశాబ్దాల తరబడి జాప్యం చేయడం సరైన విధానం కాదు" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, నిధుల సమీకరణ, టెండర్ల ప్రక్రియ వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. 

అనంతరం ఆర్టీసీపై జరిగిన సమీక్షలో, సంస్థ ఆస్తులను సద్వినియోగం చేసుకుని, బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈవీ బస్సుల కొనుగోళ్లపై కూడా అధికారులతో చర్చించారు. 

ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, సీఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Cyber Crime
Andhra Pradesh
AP Cyber Guard
Digital Arrest
Cyber Patrol
Harish Kumar Gupta
Sai Prasad
Infrastructure Projects

More Telugu News