నన్ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు: బాల్క సుమన్

Balka Suman Alleges Political Vendetta Before Arrest
  • తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తతల మధ్య బాల్క సుమన్ అరెస్ట్
  • పోలీసులను అడ్డుకుని, నినాదాలు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
  • ఇది కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపేనన్న బాల్క సుమన్
తనను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ నిర్ణయించారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. అరెస్ట్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 250కి పైగా కేసులు పెట్టారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే తరహాలో వేధిస్తోందని అన్నారు.

రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన సాగుతోందని విమర్శించారు. సింగరేణిలో వందల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెబుతూనే, నేతలను విచారణ పేరుతో వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. తాను ఎక్కడకూ పారిపోలేదని, పార్టీ కార్యక్రమంలోనే ఉన్నానని తెలిపారు.

అరెస్టు సమయంలో ఉద్రిక్తత

బాల్క సుమన్ అరెస్టు చేసే సమయంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అరెస్ట్‌ను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించడంతో పార్టీ కార్యాలయం వద్ద గందరగోళం ఏర్పడింది. బాల్క సుమన్ తెలంగాణ భవన్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

అయితే, పోలీసులు లోపలికి వస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ న్యాయవాదులతో చర్చలు జరిపిన పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
Go Back to Shorts
Balka Suman
Revanth Reddy
Telangana
BRS
Singareni
Telangana Bhavan
Arrest
Political Vendetta

More Telugu News