అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై సీఎం చంద్రబాబు ఫోకస్

Chandrababu Naidu Focuses on Amaravati Urban Mobility Planning
  • ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
  • భవిష్యత్ ప్రణాళికలపై చర్చ.. మొత్తం 18 ప్రతిపాదనలకు ఆమోదం
  • హైకోర్టు భవనాల వద్ద రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన
  • అమరావతికి సొంత అగ్నిమాపక విభాగం, బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
  • 9 జిల్లాలను కలుపుతూ అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ప్రణాళిక
అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం ఆయన అధ్యక్షతన జరిగిన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో 18 కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధానిలో పటిష్టమైన అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ ఉండాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో భాగంగా, హైకోర్టు భవనాలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.547.07 కోట్లు కేటాయించడానికి అథారిటీ ఆమోదం తెలిపింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పీపీపీ పద్ధతిలో జెయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి, భవన నిర్మాణ వివాదాల సత్వర పరిష్కారానికి ప్రత్యేక బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు, అమరావతిలో సమర్థవంతమైన అగ్నిమాపక నియంత్రణ కోసం సీఆర్డీఏకు సొంత ఫైర్ వింగ్ ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించారు.

ఏలూరు నుంచి ప్రకాశం వరకు 9 జిల్లాలకు విస్తరించే అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు కూడా అంగీకారం తెలిపారు. రాజధానిలోని అన్ని భవనాలకు సెంట్రల్ కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రతి టౌన్‌షిప్‌లో ఆర్థిక కార్యకలాపాలు ఉండేలా చూడాలని సీఎం సూచించారు. 

వీటితో పాటు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, ఎల్పీఎస్ లేఅవుట్లలో ఏటీఎంల ఏర్పాటు, 495 మంది రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి పలు అంశాలను అథారిటీ ఆమోదించింది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, సీఎస్ జి. సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కోటి మంది లక్ష్యంగా 'యోగాంధ్ర@2026'.. జూన్ 21న కృష్ణా నదిపై సీఎం యోగా

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో 'యోగాంధ్ర@2026' కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 21న జరిగే ఈ వేడుకను విజయవంతం చేసేందుకు కోటి మంది ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ కార్యక్రమ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా, జూన్ 21న రాజధాని అమరావతిలో 25 వేల మందితో రాష్ట్ర స్థాయి యోగా ఈవెంట్ నిర్వహించనున్నారు. కృష్ణా నదిపై కొత్తగా నిర్మించిన వంతెనపై జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటారు. అదే రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో వెయ్యి మంది చొప్పున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.

జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగా వారోత్సవాలు జరగనున్నాయి. "ఒక జిల్లా - ఒక థీమ్"తో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పార్కులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని 56 పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక యోగా సెషన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు గాను ప్రతి జిల్లాకు రూ. 25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న 1.50 లక్షల మంది యోగా శిక్షకులకు అదనంగా మరో లక్ష మందికి శిక్షణ ఇచ్చి, వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయనున్నారు.

ప్రజలకు అందుబాటులో యోగా వీడియోలు 
ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వ యోగా, నాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు రూపొందించిన 'యోగాంధ్ర' పోస్టర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. వివిధ ఆసనాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలపై తాను రూపొందించిన వీడియోలను ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు మంతెన తెలిపారు. 8142404888 నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపడం ద్వారా లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఈ వీడియోలను పొందవచ్చని వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నారాయణ, సత్యకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Amaravati
Urban Mobility
CRDA
Yoga Andhra
Manthena Satyanarayana Raju
Andhra Pradesh
Yoga
Krishna River
AP CRDA

More Telugu News