మోటార్లకు మీటర్లు... బీఆర్ఎస్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి
- వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాల్
- మీటర్లు పెట్టకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని ప్రశ్న
- హరీశ్ రావు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని రేవంత్ విమర్శ
- రైతులకు నాణ్యమైన విద్యుత్ కోసమే 'రైతు డిస్కం' అని స్పష్టత
- వడ్లు కొనకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసనలని హెచ్చరిక
'రైతు డిస్కం' ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి వివరించారు. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన, అంతరాయం లేని ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, జవాబుదారీతనం పెంచడమే దీని లక్ష్యమని తెలిపారు. దేశంలోనే ఇలాంటి ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. బ్లాక్మెయిల్ చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని, ఎలాంటి ప్రతిపాదన లేకుండానే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తన దగ్గర పూర్తి సమాచారం ఉందని, వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్లోనే ఉంటానని కేసీఆర్పై ఒట్టేసి చెప్పాలని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు.
ధాన్యం కొనుగోలు అంశాన్ని కూడా ప్రస్తావించిన సీఎం, మద్దతు ధర ప్రకటించిన కేంద్రమే వడ్లు కొనాలని, లేదంటే జూన్ 15 తర్వాత బీజేపీ నేతల ఇళ్ల ముందు వడ్ల కుప్పలు పోస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్, కాళేశ్వరం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేశామని, దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. తాను 2034 వరకు తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని, 2029లో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.