విధి విచిత్రం: యువకుడిగా రాసిన పరీక్షకు.. వృద్ధాప్యంలో అందిన నియామక పత్రం
- 18 ఏళ్ల తర్వాత ఉద్యోగ ఉత్తర్వు.. రిటైరయ్యాక నియామక పత్రం
- కేరళకు చెందిన అబ్దుల్ మజీద్‌కు వింత అనుభవం
- అరబిక్ టీచర్ పోస్టుకు ఎంపిక..
- రిటైర్మెంట్ వయసు దాటిపోవడమే సమస్య
- అర్హులు దొరక్కపోవడంతో పాత లిస్టు తిరగేసిన పీఎస్సీ
- చేతికి లెటర్ వచ్చినా.. ఉద్యోగంలో చేరలేని నిస్సహాయ స్థితి
మలప్పురం జిల్లా కాళికావుకు చెందిన అబ్దుల్ మజీద్ 2005లో పార్ట్ టైమ్ జూనియర్ అరబిక్ టీచర్ పోస్టు కోసం పీఎస్సీ నిర్వహించిన పరీక్ష రాశారు. ఆ తర్వాత విడుదలైన ర్యాంక్ జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. అయితే, ఆ ర్యాంక్ లిస్ట్ గడువు 2008లోనే ముగిసిపోయింది. దీంతో ఉద్యోగంపై ఆశలు వదులుకున్న మజీద్‌కు, గత నెలలో అనూహ్యంగా పీఎస్సీ నుంచి నియామక ఉత్తర్వు (అడ్వైజ్ మెమో) అందింది. ఇది చూసి ఆయన ఆనందించాలో, బాధపడాలో తెలియని స్థితిలో పడిపోయారు.
అసలు ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందంటే?
ఈ పోస్టుకు సంబంధించి పలుమార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా అర్హులైన అభ్యర్థులు దొరకలేదని తెలుస్తోంది. దీంతో చాలాకాలంగా ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేసేందుకు అధికారులు పాత ఫైళ్లను పరిశీలించి, మజీద్‌ను ఎంపిక చేశారు. ఈ పరిణామంపై మజీద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రభుత్వ ఉద్యోగం నా కల. కానీ దానిని నెరవేర్చుకోవడానికి పీఎస్సీ 18 ఏళ్లు తీసుకుంది. ఇప్పుడు నేను ఉద్యోగంలో చేరే వయసు కూడా దాటిపోయాను. ఈ లేఖతో నాకేం ప్రయోజనం?" అని ఆయన స్థానిక మీడియాతో వాపోయారు.
నిబంధనల ప్రకారం, నియామక పత్రం అందిన మూడు నెలల్లోగా ఉద్యోగంలో చేరాలి. కానీ, మజీద్ ఎస్ఎస్ఎల్సీ సర్టిఫికెట్ ప్రకారం ఆయన పుట్టిన తేదీ 1966 మే 27. అంటే, ఈ ఉత్తర్వు అందే సమయానికే ఆయనకు 60 ఏళ్లు సమీపించాయి. ఇప్పటికే ఆయన అధికారికంగా ఉద్యోగ విరమణ వయసును దాటేశారు. దీంతో సాంకేతికంగా ఆయన ఆ ఉద్యోగంలో చేరే అర్హతను కోల్పోయారు. ఫలితంగా, దశాబ్దాల కల చేతికి అందినట్టే అంది చేజారిపోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది.