ఇప్పుడు వేలాది మంది ప్రాణాలు రక్షిస్తున్న ఈ పరికరాన్ని అనుకోకుండా కనిపెట్టారు!
- పొగ కణాలు విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునేలా స్మోక్ డిటెక్టర్ డిజైన్
- విషవాయువుల గుర్తించడం కోసం ప్రయోగం చేస్తుండగా అనుకోకుండా ఆవిష్కరణ
- లోపల అమెరిషీయం రేడియోధార్మిక పదార్థం
- దీని రేడియేషన్ ప్లాస్టిక్ దాటి బయటకు రాదు
- వేగంగా వచ్చే మంటలను త్వరగా గుర్తిస్తుంది
విషవాయువుల కోసం పరిశోధన
స్మోక్ డిటెక్టర్ ఆవిష్కరణ అగ్ని ప్రమాదాల కోసం జరిగింది కాదు. 1930వ దశకం చివర్లో ఒక స్విస్ శాస్త్రవేత్త విషపూరిత వాయువులను గుర్తించే పరికరంపై ప్రయోగం చేస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఎవరో సిగరెట్ వెలిగించగా ఆ పొగకు సదరు పరికరం ఒక్కసారిగా స్పందించింది. గాల్లోని కణాలు విద్యుత్ ప్రవాహంలో మార్పులు తెస్తాయని దాని ద్వారా తెలిసింది. ఆ తర్వాత 1960వ దశకంలో అమెరికా నియంత్రణ సంస్థలు రేడియోధార్మిక పదార్థాలున్న స్మోక్ డిటెక్టర్ల వాడకానికి అనుమతులు ఇచ్చాయి. మొదట్లో ఫ్యాక్టరీల్లో వాడిన వీటిని 1970ల నుంచి ఇళ్లలో కూడా అమర్చడం మొదలుపెట్టారు.
లోపల ఏం జరుగుతుందో తెలుసా
ఈ డిటెక్టర్ లోపల ఒక చిన్న అయొనైజేషన్ చాంబర్ ఉంటుంది. ఇందులో చాలా తక్కువ పరిమాణంలో రేడియోధార్మిక పదార్థం ఉంటుంది. దీని నుంచి వచ్చే రేణువులు గాల్లోని అణువులతో కలిసి అయాన్లను సృష్టిస్తాయి. ఈ అయాన్ల వల్ల చాంబర్‌లోని రెండు మెటల్ ప్లేట్ల మధ్య ఒక బలహీనమైన విద్యుత్ ప్రవాహం నిరంతరం సాగుతుంది. ఎప్పుడైనా గదిలో పొగ వచ్చి ఈ చాంబర్లోకి ప్రవేశిస్తే ఆ పొగ కణాలు అయాన్ల కదలికను అడ్డుకుంటాయి. దీనివల్ల విద్యుత్ ప్రవాహం తగ్గిపోతుంది. ఆ వెంటనే సర్క్యూట్ అలారమ్‌ను మోగించి ఇంట్లోని వారిని అప్రమత్తం చేస్తుంది.
రేడియోధార్మికత ఎంతవరకు సురక్షితం
ప్రస్తుత ఆధునిక డిటెక్టర్లలో ‘అమెరిషియం-241’ అనే మానవ నిర్మిత ఐసోటోప్‌ను వాడుతున్నారు. గతంలో రేడియం, నికెల్ వంటి పదార్థాలను వాడేవారు. ఈ రేడియోధార్మికత ప్లాస్టిక్ బాడీని దాటి బయటకు రాలేదు కాబట్టి మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. భూమి, సూర్యుడి నుంచి మనకు సహజంగా వచ్చే రేడియేషన్ కంటే ఈ పరికరం వల్ల వచ్చేది చాలా తక్కువ. ఒకవేళ ఇల్లు పూర్తిగా తగలబడిపోయినా లేదా ఈ పరికరాలను చెత్తలో పడేసినా పర్యావరణానికి ఎలాంటి హాని జరగని విధంగా శాస్త్రవేత్తలు వీటిని రూపొందించారు.