నేటి నుంచి అమల్లోకి తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం
- తెలంగాణలో అమల్లోకి వచ్చిన అడ్వకేట్ల పరిరక్షణ చట్టం-2026
- మంగళవారం నుంచి అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- వృత్తిపరమైన విధుల్లో న్యాయవాదులకు రక్షణ కల్పించడమే లక్ష్యం
- న్యాయవాది మొయిజుద్దీన్ హత్య జరిగిన కొద్ది రోజులకే చట్టం అమలు
వృత్తిపరమైన విధుల్లో ఉన్న న్యాయవాదులపై దాడులు, వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో వారి రక్షణ కోసం ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో 'తెలంగాణ అడ్వకేట్ల పరిరక్షణ బిల్లు-2026'ను ఆమోదించింది. గవర్నర్ ఆమోదం పొందిన ఈ చట్టం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం న్యాయవాదులకు పోలీస్ రక్షణ, తప్పుడు కేసుల నుంచి భద్రత, వేధింపులపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక యంత్రాంగం, బెదిరింపుల నుంచి రక్షణ వంటివి కల్పిస్తారు.
ఇటీవల హైకోర్టు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన కొద్దిరోజులకే ఈ చట్టం అమలులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మే 23న మసాబ్ ట్యాంక్‌లోని తన ఇంటి వద్ద మొయిజుద్దీన్‌ను ఒక కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో ఆయన మరణించారు. ఈ కేసులో కాంగ్రెస్ నేత ముజాహిద్ ఆలం ఖాన్, అతని తండ్రి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వక్ఫ్ ఆస్తుల వివాదమే ఈ హత్యకు కారణమని, రూ.15 లక్షల సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ చట్టం న్యాయవాదుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారు నిర్భయంగా విధులు నిర్వర్తించడానికి దోహదపడుతుందని శాసనసభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు గతంలో తెలిపారు. కర్ణాటక, రాజస్థాన్ తర్వాత దేశంలో ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన మూడో రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం.