కొడుకు అనారోగ్యంతో అకౌంటెంట్ రాజీనామా.. కోట్లమంది హృదయాలను తాకిన బాస్ ఉదారత!
- కొడుకు అనారోగ్యం కారణంగా రాజీనామాకు సిద్ధపడిన ఉద్యోగి
- జీతంతో కూడిన సెలవులిచ్చి అండగా నిలిచిన యజమాని
- అద్భుతంగా కోలుకున్న కొడుకు.. సంతోషంతో ఆఫీసుకు వచ్చిన ఉద్యోగి
- పనిచేయని నెల జీతం వద్దనగా.. అది తమ కానుకన్న యజమాని
- సోషల్ మీడియాలో వైరల్.. వ్యాపారవేత్తపై ప్రశంసల వర్షం
రెండు నెలల క్రితం సదరు అకౌంటెంట్ కన్నీళ్లతో అంకిత్ పాండే క్యాబిన్‌లోకి ప్రవేశించాడు. వైద్యులు తన కొడుకు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారని, అందుకే ఉన్న కొద్ది రోజులు వాడి పక్కనే గడపాలని అనుకుంటున్నట్లు చెబుతూ రాజీనామా లేఖను అందించాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచి పని) చేసే అవకాశం ఉందా? అని అంకిత్ అడగ్గా.. బాబుకు 24 గంటలు పూర్తి సమయం సపర్యలు చేయాల్సి ఉంటుందని ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. అది విన్న అంకిత్ పాండే.. రాజీనామా లేఖను పక్కనబెట్టి.. "నువ్వు వెంటనే వెళ్లి నీ కొడుకు పక్కన ఉండు. నీ సీటు ఎవరూ తీసుకోరు, అది నీ కోసమే ఖాళీగా ఉంటుంది. అంతేకాదు, నీకు ప్రతి నెలా జీతం కచ్చితంగా అందుతుంది. డబ్బు గురించి ఆలోచించకుండా నీ కొడుకు ఆరోగ్యంపైనే దృష్టి పెట్టు" అని భరోసానిచ్చారు.
ఆ తర్వాత అద్భుతం జరిగింది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఆ అకౌంటెంట్ చేతిలో మిఠాయిల బాక్స్‌తో ఎంతో సంతోషంగా ఆఫీసులోకి అడుగుపెట్టాడు. తన కొడుకు ఊహించని విధంగా ప్రాణాంతక వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడని కన్నీళ్లతో చెప్పాడు. మరుసటి రోజు నుండే విధుల్లో చేరిన సదరు ఉద్యోగి.. ఒక నిజాయతీ గల వ్యక్తిగా, తాను పని చేయని ఆ ఒక్క నెల జీతాన్ని తన తదుపరి జీతాల నుంచి మినహాయించుకోవాలని యజమానిని కోరాడు. కానీ అంకిత్ పాండే ఆ అభ్యర్థనను నవ్వుతూ తిరస్కరించారు. "మేము ఇచ్చిన జీతం నీ శ్రమకు కాదు.. నీ కొడుకు త్వరగా కోలుకోవాలని మా కంపెనీ తరఫున మేము అందించిన ఒక చిన్న కానుక" అని సమాధానమిచ్చారు.
"కొన్నిసార్లు ఒక కంపెనీ అనేది కేవలం పని చేసే స్థలం మాత్రమే కాదు.. అదొక కుటుంబం" అంటూ అంకిత్ పాండే ముగించిన ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కంపెనీ పాలసీలు, టార్గెట్లు అంటూ ఉద్యోగులను యంత్రాల్లా చూసే ఈ రోజుల్లో.. ఇలాంటి కరుణ, మానవత్వం ఉన్న నాయకులు అరుదుగా ఉంటారని, ఇటువంటి నాయకత్వమే నిజమైన వ్యాపార విజయానికి మూలస్తంభమని నెటిజన్లు కొనియాడుతున్నారు.