మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ

Mega DSC allegations AP Education Department provides clarification
  • మెగా డీఎస్సీ-2025 పై ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం
  • మెరిట్, రిజర్వేషన్ల ప్రకారమే నియామకాలు జరిగాయని స్పష్టీకరణ
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేశామన్న అధికారులు
మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా ఖండించాయి. నియామకాలన్నీ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన, నిర్దేశిత రిజర్వేషన్ రోస్టర్ నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశాయి. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

సుమారు 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ ప్రక్రియను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా నిష్పాక్షికంగా నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మెరిట్ జాబితాలు, ఎంపిక జాబితాలు సహా అన్ని వివరాలను నిబంధనల మేరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, రిజర్వేషన్ విధానాలను కచ్చితంగా పాటిస్తూ, బహుళస్థాయి పరిశీలన తర్వాతే నియామకాలు చేపట్టామని, అందువల్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీ, డేటా తొలగింపు, మెరిట్ జాబితాల ప్రకటనలో జాప్యం, స్పోర్ట్స్ కోటా మరియు ఇతర రిజర్వేషన్ల అమలులో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నియామక ప్రక్రియపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) స్పెషల్ సీఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, శాప్ ఎండీ భరణి నిన్న సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నియామక ప్రక్రియపై ఎవరికైనా అనుమానాలుంటే పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వచ్చి నివృత్తి చేసుకోవచ్చని వారు సూచించారు. తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న 34 మంది అభ్యర్థుల ర్యాంకులు, క్రీడా మెరిట్, హారిజాంటల్ రిజర్వేషన్ అమలుకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా వెల్లడించి, వారికి ఉద్యోగాలు ఎందుకు రాలేదనే విషయాన్ని స్పష్టంగా వివరించారు.
Go Back to Shorts
Mega DSC 2025
AP Education Department
Andhra Pradesh Teacher Recruitment
YS Jagan Mohan Reddy
Kona Sasidhar
AP Teacher Jobs
Mega DSC Merit List
Education Department Clarification
School Education AP
Teacher Recruitment Allegations

More Telugu News