మంటల కంటే పొగే ప్రమాదకరం.. ఎందుకో వివరిస్తున్న నిపుణులు!
- ఆక్సిజన్ తగ్గి క్షణాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం
- విషవాయువులతో నిలువునా ఊపిరాడకుండా చేసే సైనైడ్
- అత్యంత వేడి గాలితో ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం
- పొగ ఎక్కువగా ఉంటే నేలపై వంగి నడవాలి
- ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని నిపుణుల హెచ్చరిక
ఆక్సిజన్ లేకపోవడం: సాధారణంగా గాలిలో 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. కానీ మంటలు వ్యాపించినప్పుడు గదిలోని ఆక్సిజన్‌ను అవి వేగంగా లాగేసుకుంటాయి. కారిడార్లు, హోటల్ రూముల్లో ఆక్సిజన్ స్థాయి 10-12 శాతం కంటే తక్కువకు పడిపోగానే మెదడుకు ఆక్సిజన్ అందడం ఆగిపోతుంది (హైపోక్సియా). దీనివల్ల మనుషుల్లో గందరగోళం పెరిగి, బయటకు వెళ్లే దారి వెతుక్కునే లోపే నిమిషాల వ్యవధిలోనే స్పృహ తప్పి పడిపోతారు.
విషవాయువుల ప్రభావం: ఆధునిక హోటళ్లలో వాడే కార్పెట్లు, ఫోమ్ సోఫాలు, ప్లాస్టిక్ వస్తువులు కాలినప్పుడు అత్యంత ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ వంటి విషవాయువులు విడుదలవుతాయి. కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో వేగంగా కలిసిపోయి శరీరానికి ఆక్సిజన్ సప్లైని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అలాగే సైనైడ్ గ్యాస్ రక్తంలో ఆక్సిజన్ ఉన్నప్పటికీ కణాలు దాన్ని వాడుకోకుండా చేసి నిలువునా ఊపిరాడకుండా చేస్తుంది.
శ్వాసకోశాలు కాలిపోవడం: పొగలో కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా విపరీతమైన వేడి, మసి కణాలు ఉంటాయి. ఈ వేడి గాలిని పీల్చినప్పుడు నోరు, గొంతు, ఊపిరితిత్తులు లోపల కాలిపోయి వాపు వస్తుంది. దీనివల్ల ప్రమాద స్థలం నుండి బయటపడినప్పటికీ శ్వాసనాళాలు మూసుకుపోయి తర్వాత నిమోనియా లేదా ‘ఆర్డ్స్’ వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధితులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
భవనాల్లో నిబంధనలకు విరుద్ధంగా గదులు నిర్మించడం, అత్యవసర ద్వారాలు మూసివేయడం వల్లే ఇవి మృత్యుకుహరాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎప్పుడైనా పొగతో నిండిన భవనంలో చిక్కుకుపోతే.. నేలకు వీలైనంత దగ్గరగా వంగి లేదా పాకుతూ బయటకు వెళ్లేందుకు యత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఎప్పుడూ నేల భాగంలోనే ఉంటుంది. అలాగే ముక్కు, నోటికి తడి గుడ్డను అడ్డుగా పెట్టుకొని వెంటనే మెట్ల ద్వారా బయటకు రావాలని విపత్తు నిర్వహణ సంస్థలు సూచిస్తున్నాయి.