తలనొప్పి, అలసటను లైట్ తీసుకోవద్దు.. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలపై డాక్టర్ల హెచ్చరిక!

Do not ignore headache and fatigue Doctors warn about brain tumor symptoms
  • దేశంలో ఏటా 28,000 ట్యూమర్ కేసులు
  • ఉదయం వచ్చే తలనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు
  • ఒత్తిడి, మైగ్రెయిన్‌గా పొరబడే ప్రమాదం ఉంది
  • ఫిట్స్, చూపు మసకబారడం దీని లక్షణాలు
  • ల్యాబ్ పరీక్షల ద్వారానే కచ్చితమైన నిర్ధారణ
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 3.21 లక్షల మంది బ్రెయిన్ ట్యూమర్ బారిన పడుతుండగా.. దాదాపు 2.48 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఇవి కేవలం రెండు శాతమే అయినప్పటికీ మెదడు పనితీరుకు సంబంధించిన వ్యాధి కావడంతో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 28,000 కొత్త బ్రెయిన్ ట్యూమర్ కేసులు నమోదవుతున్నాయని ఐసీఎంఆర్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభ లక్షణాలు మనం నిత్యం ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్యల తరహాలోనే ఉండటం వల్ల చాలా మంది వీటిని గుర్తించలేకపోతున్నారు. సాధారణ మానసిక ఒత్తిడి, మైగ్రెయిన్ తలనొప్పి, నిద్రలేమి లేదా అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఈ నిర్లక్ష్యమే వ్యాధి ముదిరిపోయేలా చేస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణ తలనొప్పికి, బ్రెయిన్ ట్యూమర్ తలనొప్పికి చాలా తేడా ఉంటుందని డాక్టర్లు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం తీవ్రమైన తలనొప్పి, రోజురోజుకూ ఆ నొప్పి మరింత ఎక్కువవడం, సాధారణ పెయిన్ కిల్లర్ మందులకు ఆ నొప్పి తగ్గకపోవడం దీని ప్రధాన లక్షణం. ఇవే కాకుండా జ్ఞాపకశక్తి తగ్గడం, విపరీతమైన కోపం, ఆందోళన, అయోమయం వంటి మానసిక మార్పులూ మెదడులో గడ్డలు ఉన్నాయనడానికి సంకేతాలు.

మెదడులో ట్యూమర్ ఉన్న స్థానాన్ని బట్టి మరికొన్ని శారీరక మార్పులు కనిపిస్తాయి. కారణం లేకుండా వాంతులు అవ్వడం, చూపు మసకబారడం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడం, కళ్లు తిరగడం, కాళ్లు చేతులు బలహీనపడటం, జీవితంలో ఎప్పుడూ లేని విధంగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడం వంటివి జరిగితే వెంటనే అలర్ట్ అవ్వాలి. కొందరిలో మాట పడిపోవడం లేదా వినికిడి లోపం కూడా రావచ్చు.

ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన అందరికీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు కాదని, అయితే లక్షణాలు తగ్గకుండా రోజురోజుకూ తీవ్రమౌతుంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో బ్రెయిన్ ఎంఆర్ఐ వంటి ఇమేజింగ్ పరీక్షల ద్వారా దీన్ని ముందే గుర్తిస్తే.. ఆధునిక వైద్య విధానాలతో సంపూర్ణంగా నయం చేయొచ్చని చెబుతున్నారు. ఏ చిన్న శారీరక మార్పునూ సాధారణమైనదిగా భావించి నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
Go Back to Shorts
Brain Tumor
Brain Tumor symptoms
Headache fatigue
ICMR India
Brain cancer
MRI scan
Early detection
Neurological health
Morning headache
Seizures

More Telugu News