సెల్ఫీలకు పోజులిచ్చి బంగారు కడియం పోగొట్టుకున్న తెలంగాణ మంత్రి
- మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో ఘటన
- పెళ్లికి హాజరైన మంత్రితో సెల్ఫీలకు అభిమానుల పోటీ
- సందట్లో సడేమియాగా కొట్టేసిన బంగారు కడియం
అభిమానులతో కలిసి సెల్ఫీ దిగిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన చేతి బంగారు కడియాన్ని పోగొట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. స్థానికంగా జరిగిన ఓ వివాహానికి హాజరైన మంత్రిని చూసిన అభిమానులు సెల్ఫీల కోసం క్యూకట్టారు. వారిని నిరాశపరచడం ఇష్టంలేని మంత్రి వారితో ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత చూసుకుంటే ఆయన చేతికి ఉండాల్సిన బంగారు కడియం మాయమైంది. దీంతో విస్తుపోవడం మంత్రిగారిపనైంది. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కడియం మంత్రికి సెంటిమెంట్ కావడంతో ఎవరైనా తీసి ఉంటే ఇచ్చేయాలని పోలీసులు బతిమాలుకోవడం కనిపించింది.