విదేశాలకు వెళ్లొచ్చిన 17 మంది ఇండియన్లకు కరోనా లక్షణాలు.. ఆసుపత్రులలో చికిత్స

  • వీరంతా వైరస్ స్క్రీనింగ్ కు ముందు వచ్చినవారే..
  • ఇలాంటి వారి వివరాలను పరిశీలిస్తున్న అధికారులు
  • ఇళ్లలోంచి బయటికి రావొద్దని 4,707 మందికి ఆదేశాలు
ఎయిర్ పోర్టుల్లో కరోనా వైరస్ స్క్రీనింగ్ చేపట్టడానికి ముందు వివిధ దేశాలకు వెళ్లి తిరిగి
వచ్చినవారిలో 17 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని అధికారులు
తెలిపారు. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన జనవరి నెలలో.. చైనా, ఆ చుట్టుపక్కల
దేశాలకు వెళ్లిన వారు సుమారు ఆరు వేల మంది ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
అధికారులు వారందరి వివరాలు సేకరించి, పరీక్షలు చేయిస్తున్నారు.

స్క్రీనింగ్ కు ముందు వచ్చినవారికి..

డిసెంబర్ లోనే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది. జనవరి రెండో వారానికల్లా తీవ్రంగా
పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. మన దేశంలో జనవరి మూడో వారం
నుంచి ఎయిర్ పోర్టుల్లో కరోనా స్క్రీనింగ్ మొదలుపెట్టారు. అయితే అంతకన్నా ముందే విదేశాలకు వెళ్లి, వచ్చినవారికి కరోనా ఉండొచ్చన్న అనుమానాలు తలెత్తాయి. దాంతో ప్రభుత్వం జనవరి మొదటి నుంచీ చైనా, ఇతర వైరస్ ప్రభావిత దేశాల నుంచి ఢిల్లీకి వచ్చినవారి వివరాలను సేకరించి పరీక్షిస్తున్నారు.

ఇళ్లలోంచి బయటికి రావొద్దు

ఫిబ్రవరి 13వ తేదీ వరకు సుమారు 5,700 మంది వివరాలను సేకరించామని.. అందులో 4,707 మందిని కొద్దిరోజుల పాటు ఇళ్లలోనే ఉండాల్సిందిగా ఆదేశించామని అధికారులు తెలిపారు. 17 మంది కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రులలో చేరారని తెలిపారు. వారికి టెస్టులు చేయిస్తున్నామన్నారు. మరో 800 మంది చిరునామా ఇంకా లభించలేదని, వారి జాడ కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.


More Telugu News