దిశ కుటుంబానికి న్యాయం జరిగింది...నా కూతురి విషయంలోనే ఆవేదన కలుగుతోంది : నిర్భయ తల్లి ఆశాదేవి
- నిర్భయ దోషుల విషయంలో శిక్ష జాప్యం కావడం ఆవేదన కలిగిస్తోంది
- రానురాను న్యాయస్థానాల పైనా నమ్మకం పోతోంది
- జనం కోరుకున్నదే దిశ హత్య కేసులో నిందితులకు జరిగింది
ఎన్‌కౌంటర్ తో దిశ కుటుంబానికి న్యాయం జరిగిందని, తన కూతురి విషయంలోనే శిక్ష అమలు జాప్యం ఆవేదన కలిగిస్తోందని నిర్భయ తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించారు. ఈరోజు ఓ టీవీ చానెల్ ప్రతినిధితో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ లో దిశ హత్య తర్వాత నిందితులకు జనం ఏం జరగాలని కోరుకున్నారో అదే జరిగిందని, అందుకే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినప్పుడు వారిపై పూల జల్లు కురిసిందని అమె వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంలో నలుగురు నిందితులు కేస్ రీకనస్ట్రక్షన్ సందర్భంగా పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నిర్భయ ఘటనలో ఉరిశిక్ష పడిన దోషులకు శిక్ష అమలు విషయంలో జాప్యం జరుగుతుండడంపై ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
రోజు రోజుకీ ఎదురవుతున్న పరిస్థితులు చూస్తుంటే రానురాను కోర్టులపై కూడా నమ్మకం పోతోందని ఆమె వాపోయారు. కోర్టులపై నమ్మకం సన్నగిల్లుతున్నందునే దిశ ఎన్‌కౌంటర్ అనంతరం జనం స్వీట్లు కూడా పంచుకున్నారని తెలిపారు. తన కుమార్తెకు అన్యాయం జరిగి ఇప్పటికే ఎనిమిదేళ్లయిందని, ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని ఆశాదేవి కోర్టులను వేడుకున్నారు.
పరిస్థితులు మారినా ఇంకా తాను కోర్టు ముందు చేతులు జోడించి అర్థిస్తూనే ఉన్నానన్నారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలని, ప్రాధేయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మార్చి 3న దోషులను ఉరితీయాలన్న కోర్టు తీర్పు అమలవుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. నిర్భయ దోషులను ఉరితీసినా మహిళల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
దోషులను వదిలేయాలని వారి కుటుంబ సభ్యులు తనను పదేపదే అడుగుతున్నారని, వారి కుటుంబంలో వారికి నా కూతురికి జరిగిన విధంగా జరిగితే వదిలేస్తారా? అని ప్రశ్నించారు. మానవహక్కుల సంఘం కార్యకర్తలు తమ మనుగడకోసం ఏదో మాట్లాడుతుంటారని, వారి మాటలను తాను వినదల్చుకోలేదని, దోషులను ఉరితీయాల్సిందేనని స్పష్టం చేశారు.