ఐపీఎల్ లో లక్షల డాలర్లు ధర పలికిన క్రికెటర్ ఇప్పుడో దొంగ!

  • సైకిల్ దొంగతనం చేసిన ఆసీస్ క్రికెటర్ పోమర్స్ బ్యాక్
  • గతంలో ఐపీఎల్ లోనూ ఆడిన వైనం
  • అప్పట్లోనే ఓ అమెరికన్ మహిళను వేధించిన కేసులో అరెస్ట్
  • ప్రస్తుతం ఓ కారులో తలదాచుకుంటున్న పోమర్స్ బ్యాక్
ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ పోమర్స్ బ్యాక్ ఒకప్పుడు టి20 క్రికెట్లో విధ్వంసక బ్యాట్స్ మన్ గా పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ నుంచి ఐపీఎల్ వరకు ప్రపంచంలో పేరుమోసిన క్రికెట్ లీగుల్లో ఆడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లో లక్షల డాలర్ల ధర పలికిన డాషింగ్ ప్లేయర్ ఇప్పుడో దొంగ అంటే నమ్మలేం!

కానీ వ్యసనాల బారినపడి కెరీర్ అప్రదిష్ఠపాలయ్యాడు. సర్వం కోల్పోయిన పోమర్స్ బ్యాక్ ప్రస్తుతం ఓ కారులో నివాసం ఉంటున్నాడంటే ఎంతటి దయనీయ స్థితికి దిగజారాడో అర్థమవుతోంది. అంతేకాదు, ఓ సైకిల్ దొంగతనం చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు.

పోమర్స్ బ్యాచ్ వ్యవహారశైలి మొదట్నించి వివాదాస్పదమే. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న సమయంలో ఓ అమెరికా జాతీయురాలిని వేధించిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఆ సీజన్ నుంచి ఐపీఎల్ యాజమాన్యం తొలగించింది. ఆ తర్వాత బిగ్ బాష్ లీగ్ లో దుమ్మురేపడంతో తాను ప్రాతినిధ్యం వహించిన బ్రిస్బేన్ హీట్ జట్టు టైటిల్ నెగ్గింది. ఇది జరిగి ఎనిమిదేళ్లయింది. పోమర్స్ బ్యాచ్ మారిపోయాడనుకున్నారంతా.

కానీ, 2014 నుంచి పోమర్స్ బ్యాక్ తిరోగమనం ప్రారంభమైంది. ఒకసారి బైకు దొంగతనం చేయగా, మరోసారి మరీ చీప్ గా మద్యం దుకాణం నుంచి మందు బాటిల్ కొట్టేసి దొరికిపోయాడు. ఇప్పుడు మరీ పతనానికి పరాకాష్ఠలా, అందరూ వదిలేయడంతో ఓ కారులో తలదాచుకుంటున్నాడు. ఏదేమైనా వ్యసనాలు ఎంత పనిచేస్తాయో చెప్పడానికి ఈ ఆసీస్ క్రికెటర్ జీవితం ఓ పాఠం వంటిది!


More Telugu News